Table of Contents
Ram Charan Orange Review.. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన మూడో చిత్రమది.!
‘చిరుత’ సినిమాతో తెరంగేట్రం చేసిన రామ్ చరణ్, ‘మగధీర’ సినిమాతో తండ్రిని మించిన తనయుడనిపించేసుకున్నాడు.!
ఇండస్ట్రీ హిట్టు కొట్టాక, డిజాస్టర్ చవి చూడటం.. అనేది ఓ సెంటిమెంట్ అప్పట్లో.! అలా, ‘ఆరెంజ్’ సినిమా ఆ సెంటిమెంటునీ నిజం చేసింది.
అసలు అదేం టైటిల్.! ‘ఆరెంజ్’ ఏంటి.? అంటూ, సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే సినిమాపై నెగెటివిటీ తారాస్థాయికి చేరిపోయింది.
Mudra369
ఆ రోజు నాకు ఇప్పటికీ బాగానే గుర్తుంది.! ఉదయాన్నే మార్నింగ్ షో టిక్కెట్ ఇచ్చాడో సినీ స్నేహితుడు.! గాబరా గాబరాగా థియేటర్‌కి బైక్ మీద వెళ్ళడం గుర్తుంది.
థియేటర్లోకి వెళ్ళేసరికి, సినిమా స్టార్ట్ అయిపోయింది.. ఒకట్రెండు సీన్స్ కూడా అయిపోయాయి. అప్పటికే, సినిమాపై విపరీతమైన నెగెటివ్ టాక్ నా చెవిన పడింది.
Ram Charan Orange Review.. అప్పట్లో డిజాస్టర్..
‘సినిమా డిజాస్టర్’ అనే ఒపీనియన్‌ని నా స్నేహితులే కొందరు నా మెదడులో బలంగా ముద్ర పడేలా చేసేశారు.! అయినా, సినిమాకి వెళ్ళాను.
ముందే చెప్పాను కదా, సినిమా అప్పటికే స్టార్ట్ అయిపోయిందని. సీన్స్ ఒకటొకటిగా నడుస్తున్నాయి. పాటలొస్తున్నాయి.
కొంచెం కామెడీ, అక్కడక్కడా ఎమోషనల్ సీన్స్.. ఫైట్స్ కూడా.. అలా కథ ముందుకు సాగిపోతోంది. ‘సినిమా బాగుంది కదా’ అంటూ అని నాతో నేనే చెప్పుకుంటున్నాను.
ఈ సినిమాని ఎలాగైనా చంపెయ్యాలి.. అని కంకణం కట్టుకున్ని కొన్ని మీడియా సంస్థలు.! ప్రత్యక్షంగా నేను విన్నదీ, చూసిందీ ఇది.!
Mudra369
ఇంటర్వెల్.. బయటకు వచ్చి చూస్తే, అక్కడ సినిమా గురించి డిస్కషన్. సినిమా బాలేదన్నారుగానీ, బాగానే వుంది కదా.. అంటూ కొందరు మాట్లాడుకోవడం జరిగింది.
సినిమా పూర్తయ్యింది.. పూర్తయ్యాక కూడా థియేటర్ నుంచి బయటకు వస్తున్న జనం, ‘సినిమా బావుంది’ అనే అభిప్రాయంతోనే వున్నారు. ‘మగధీర’తో పోల్చితే.. అంటూ కొందరు దీర్ఘాలు తీయడం మొదలు పెట్టారు.
సినిమా ఎక్కడ తేడా కొట్టిందంటే..
అసలు, సినిమా ఎక్కడ తేడా కొట్టేసింది.? అని అనుకున్నాను.! నిజానికి, సినిమా సమీక్ష ఎక్కడో రాసినట్లు గుర్తు.. ఇప్పుడైతే గుర్తు లేదు.
ఇన్నేళ్ళ తర్వాత, ఆ పాత సినిమాకి ఇప్పుడు కొత్తగా సమీక్ష ఎందుకు రాయాల్సి వస్తోందంటే, రీ-రిలీజ్, రీ-రీ-రిలీజ్ అంత ఘనంగా ‘ఆరెంజ్’ సినిమాకి జరిగింది కాబట్టి.
అత్యంత భయంకరమైన నెగెటివిటీ ఎదుర్కొన్న సినిమాగా అప్పట్లో ‘ఆరెంజ్’ రికార్డులకెక్కింది. సినిమా డిజాస్టర్ అట కదా.. అని కొందరు సినీ జనాలే పైశాచికానందం సినీ పరిశ్రమలో ప్రదర్శించారు.
Mudra369
మొన్నీమధ్యనే ఫిబ్రవరి 14న రీ-రీ-రిలీజ్ జరిగితే, వసూళ్ళ పంట పండింది. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ రోజు నడిచిన హంగామా కంటే, ‘ఆరెంజ్’ సినిమాకి ఎక్కువ హంగామా కనిపించిందనడం అతిశయోక్తి కాదు.
ప్రేమ ఎప్పుడూ ఒకేలా వుండదన్నది ‘ఆరెంజ్’ సినిమాలో హీరో పాత్ర ద్వారా చెప్పాలనుకున్నాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. హీరోకి పూర్తి క్లారిటీ వుంటుంది. హీరోయిన్‌ది గందరగోళంతో కూడిన పాత్ర.
జెనీలియా తప్పెంత.?
జెనీలియా డిసౌజా అంటేనే, ‘అతి’.! ఆమె పాత్రల్ని దర్శకులూ అలా డిజైన్ చేస్తుంటారు. కొన్నాళ్ళ తర్వాత టీవీలో సినిమా పూర్తిగా చూశాక, రిలీజ్ రోజున నేను మిస్ అయిన ‘అతి’ సన్నివేశాల గురించి తెలిసిందే.
సినిమా ఫెయిలవడానికి మొదట్లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్ పాత్ర ‘అతి’ ఓ కారణం. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా వుంది. ఆమె పేరు షాజాన్ పదామ్సీ. చాలా ముద్దుగా కనిపించింది.
‘ఆరెంజ్’ సినిమా నిజంగానే క్లాసిక్ కదా.. అని ఓ స్నేహితుడు ఈ మధ్యనే నాతో మాట్లాడుతూ చెప్పాడు.! అతనే, అప్పట్లో ‘సినిమా చెత్త’ అన్నాడు. ఇప్పుడతను సినీ పరిశ్రమలో వున్నాడు.
Mudra369
పాటలైతే సూపర్ డూపర్ హిట్టు.! ఇప్పటికీ ఆ పాటలు వినిపిస్తూనే వుంటాయ్. ఫ్రెష్ మ్యూజిక్.. అనే చెప్పాలి.
ముంబై, ఆస్ట్రేలియా అందాలు ‘ఆరెంజ్’ సినిమాలో ఓ రేంజ్‌లో చూపించాడు దర్శకుడు. సినిమాటోగ్రఫీ అద్భుతం. మ్యూజిక్ వేరే లెవల్.! ఎడిటింగ్ కూడా నిజానికి చాలా బావుంటుంది.
Ram Charan Orange Review.. డిజాస్టర్ నుంచి క్లాసిక్ దాకా..
పాటల్లో, యాక్షన్ సీక్వెన్సెస్‌లో రామ్ చరణ్ చాలా చాలా స్టైలిష్‌గా కనిపిస్తాడు. వెరసి, ‘ఆరెంజ్’ సినిమా నిజంగానే ఓ క్లాసిక్.
అప్పుడేమో, డిజాస్టర్.. అలాగని అప్పట్లో చెప్పినవాళ్ళే, ఇప్పుడు ‘క్లాసిక్’ అంటున్నారు.
అదే సినీ‘మాయ’ అంటాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, ఓ నెటిజన్ తాజాగా ఈ సినిమా గురించి వ్యక్తం చేసిన అభిప్రాయంపై స్పందిస్తూ.
‘ఆరెంజ్’ మాత్రమే కాదు, ఈ తరహాలో ఇంకొన్ని సినిమాలు కూడా రీ-రిలీజ్ సందర్భంగా మంచి విజయాల్ని అందుకుంటున్నాయ్.!
– yeSBee