Pawan Kalyan Jayakethanam.. జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ‘జయకేతనం’ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
‘మనం నిలబడ్డాం.. టీడీపీని నిలబెట్టాం..’ అని పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక ‘జయకేతనం’లో వ్యాఖ్యానించడం, కొందరికి అస్సలు నచ్చలేదు.
తనను అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతోపాటు, తమ పార్టీని నిలబెట్టిన రాష్ట్ర ప్రజానీకానికి కృతజ్ఞత చెబుతూ, ‘జయకేతనం’ పేరుతో సంబరాలు చేసుకుంది జనసేన.
పదకొండేళ్ళ జనసేన రాజకీయ పోరాటం, వైసీపీని పదకొండు సీట్లకు పరిమితం చేసిందని కూడా జనసేనాని వ్యాఖ్యానించారు. టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి అత్యద్భుతంగా ముందడుగు వేశాయనీ చెప్పారు.
Pawan Kalyan Jayakethanam.. ఔను.. నిలబడ్డారు, నిలబెట్టారు కూడా.!
మరోపక్క, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తన ప్రసంగంలో, పరోక్షంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై ‘ఖర్మ’ అంటూ చేసిన వ్యాఖ్యలూ వైరల్ అయ్యాయి.
వాస్తవానికి, వర్మ పేరుని నాగబాబు ప్రస్తావించలేదు. గుమ్మడికాయ దొంగ.. అంటే, భుజాలు తడిమేసుకున్నారు ఆ కొందరు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని కూడా అలాగే తీసుకున్నారు ఆ కొందరు.
2024 ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీ పరిస్థితేంటి.? ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితేంటి.? వైసీపీ దెబ్బకి కకావికలమైంది టీడీపీ. ఆ టీడీపీకి ధైర్యాన్నిచ్చింది జనసేన.
ఈ విషయం రాష్ట్రంలో ఆ చివర నుంచి ఈ చివరి వరకు.. ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే. కూటమిగా ఏర్పడ్డాక, కలిసికట్టుగానే మూడు పార్టీలూ ప్రయాణం చేస్తున్నాయి.
కూటమి సఖ్యతను దెబ్బకొట్టే ప్రయత్నమెవరిది.?
ఒకరు ఎక్కువా కాదు.. ఇంకొకరు తక్కువా కాదు.. అన్నట్లే వుంది.. ఈ కూటమి స్నేహ బంధం. జన సేన పార్టీ వేడుక గనుక, తమ పార్టీ గురించి జనసేన నేతలు, అధినేత చెప్పుకోవడం తప్పెలా అవుతుంది.?
వాస్తవానికి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని కావొచ్చు, నాగబాబు వ్యాఖ్యల్ని కావొచ్చు, టీడీపీ అధినాయకత్వం నెగెటివ్ యాంగిల్‌లో చూడలేదు.
కానీ, సోషల్ మీడియా వేదికగా పాపులారిటీ కోసం పిచ్చి పిచ్చి కామెంట్లు చేసే కొందరికి మాత్రం, ఈ వ్యవహారం ఓ వివాదాస్పద విందు భోజనంగా మారిపోయింది.
Also Read: సనాతనంపై విషం: పాత్రికేయ వనంలో గంజాయి మొక్కలు.!
చంద్రబాబు అరెస్టయి, జైల్లో వుంటే.. ఆయనకు, ఆయన కుటుంబానికీ ధైర్యాన్నిచ్చింది పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని చంద్రబాబు, చంద్రబాబు కుటుంబ సభ్యులే పలు సందర్భాల్లో చెప్పారు.
సో, ‘మేం నిలబడ్డాం.. టీడీపీని నిలబెట్టాం’ అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వేరే కోణంలో ఎవరూ చూడాల్సిన పనిలేదు. ఒకవేళ అలా చూసినా, టీడీపీ అధినాయకత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదు.
			        
														