Table of Contents
Tamannaah Bhatia Odela2 Review.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అరుంధతి’ అప్పట్లో పెను సంచలనం.
దాదాపు అదే పేటర్న్‌లో ‘ఓదెల-2’ సినిమాని తీసుకొచ్చారు. సంపత్ నంది సినిమా అంటే, ఆషామాషీ వ్యవహారమా.? పైగా, ‘మిల్కీ బ్యూటీ’ తమన్నాని ‘శివ శక్తి’గా చూపిస్తున్నారనగానే ఒకింత ఆశ్చర్యం కలిగింది కూడా.
సినిమా ప్రమోషన్ల కోసం ‘మహా కుంభ మేళా’ని వాడుకున్నారు మేకర్స్.! తప్పేముంది.? సినిమాని మార్కెట్ చేసుకోవడానికి, రకరకాల పబ్లిసిటీ స్టంట్స్ చేయడం మామూలే.
ఇంతకీ, కథేంటి.? తమన్నా ఎలా చేసింది.? అసలు సినిమా ఎలా వుంది.? ‘ఓదెల’ సిరీస్‌లో తొలి సినిమాకీ, ఈ రెండో సినిమాకీ లింకేంటి.?
Tamannaah Bhatia Odela2 Review.. ఆ ఓదెల.. ఈ ఓదెల.. అసలేంటి కథ.?
అదీ, ఓదెల ఊరిలోని కథే.. ఇదీ, ఓదెల ఊరిలోని కథే. అందులో హెబ్బా పటేల్ పాత్రకి కొనసాగింపు వుంది. అందులో చనిపోయిన ‘తిరుపతి’, ఇందులో ప్రేతాత్మకగా మారతాడంతే.
తిరుపతి పాత్ర, ఓ సైకో.. తొలి ‘ఓదెల’లో. ఇందులో, ప్రేతాత్మగా మారిపోయి.. మరింతగా చెలరేగిపోతాడు.. కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలపై ‘కామం’ తీర్చుకుని, క్రూరంగా చంపేస్తాడు.
మొదటి ‘ఓదెల’ సినిమాలోని హెబ్బా పటేల్ వుంది కదా.. ఆ పాత్రకి అక్కగా నటించింది తమన్నా. ‘శివ శక్తి’గా తమన్నాకి దైవత్యం అద్దారు ‘ఓదెల-2’ మేకర్స్.
ఒక చిన్న ఊరిలో నడిచే కథ. కానీ, ఏకంగా ఆ పరమ శివుడే తన ముందర ‘ఉఫ్’ అనేంత, శక్తి శాలిగా ‘తిరుపతి’ పాత్రని తీర్చిదిద్దేశారు.!
క్లయిమాక్స్‌లో నందీశ్వరుడొస్తాడు.. వచ్చి, చచ్చి పడున్న శివ శక్తి మళ్ళీ బతికేలా చేస్తాడంతే. ఆ తర్వాత శివుడొస్తాడు, తిరుపతి ప్రేతాత్మని అంతం చేయిస్తాడు.. శివ శక్తితో.
శివ కోటి.. శివ నామ జపం.!
శివ శక్తి కోటి సార్లు ‘శివ నామం’ జపించింది కాబట్టి, ఆమెకే సాక్షాత్కరిస్తాడు శివుడని.. నాగ సాధువులు చెబుతారుగానీ, ఊరందరికీ శివుడు కనిపించేస్తాడేమిటో.!
ఊళ్ళో అన్ని అనర్థాలు జరుగుతున్నా, శివ శక్తి.. ఊళ్ళోని నందీశ్వరుడ్ని ప్రసన్నం చేసుకోవాలని అనుకోదెందుకో.? ఈ ప్రశ్నల్నీ వేసుకుంటూ వెళితే, అసలు సినిమా ఎందుకో.. అనిపిస్తుంది.
అన్ని లూప్ హోల్స్ పెట్టుకుని.. ప్రేతాత్మ సినిమా తీసేశారు. తమన్నా నటించిందంటే, నటించిందంతే. హావభావాలు అస్సలు పలకలేదు. హెబ్బా పటేల్ గురించి మాట్లాడుకోవడం దండగ.
ఆ పశుపతి.. ఈ తిరుపతి..
‘అరుంధతి’లో పశుపతిలా, ఇందులో తిరుపతి పాత్ర అన్నమాట. పశుపతి క్యారెక్టర్ సూపర్ హిట్టు. పశుపతి పాత్ర సూపర్ ఫట్టు.! అక్కడ అనుష్క సూపర్ హిట్టు.. ఇక్కడ తమన్నా డిజాస్టర్.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మీద ఆసక్తిని పెంచదు.. సినిమాటోగ్రఫీ కూడా అంతే. ఏదీ, వుండాల్సిన స్థాయిలో లేదు.!
ఊళ్ళో ఘోరాలు జరుగుతున్నాయని తెలిసీ, పొలంలోని ‘మంచె’ మీద ఫస్ట్ నైట్ ప్లాన్ చేసే ఊరి పెద్ద వ్యవహారం.. అయితే, సూపర్ కామెడీ అన్నమాట.
‘అరుంధతి’ వచ్చి చాలా ఏళ్ళయ్యింది. విజువల్ ఎఫెక్ట్స్ మరింత అద్భుతంగా వచ్చేందుకు అనుకూలంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. కానీ, నాసిరకం గ్రాఫిక్స్ వాడారు ‘ఓదెల-2’ కోసం.
నటీనటుల ఎంపిక దగ్గర్నుంచి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు.. ఏదీ వుండాల్సిన స్థాయిలో లేవు. ‘ఓదెల’ ఒకింత ఇంట్రెస్టింగ్గా వుంటుంది.. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కూడా వుంటుంది.
‘ఓదెల-2’లో అవేవీ కనిపించవు. స్కిప్ చేసుకుంటూ ఓటీటీలో సినిమా చూసినా, ఏం ఫరక్ పడదు. ఓటీటీలో ఉచితంగానే అందుబాటులో వున్నా సరే.. జస్ట్ టైమ్ వేస్ట్ అంతే.