Table of Contents
IAF Mig21 Fighter Aircraft.. అవసరం తీరిపోయాక ‘అల్లుడు డాష్ నా కొడుకు’ అన్నాడట వెనకటికి ఒకడు.!
సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ ‘మిగ్-21’ విషయంలో ‘ఎగిరే శవ పేటికలు’ అనే ప్రస్తావన కూడా దాదాపు అలాంటిదే.!
భారత వైమానిక దళంలో, ‘మిగ్ – 21’ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌కి ప్రత్యేకమైన గుర్తింపు వుండేది ఒకప్పుడు. ఇప్పటికీ, ఆ యుద్ధ విమానం, భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషిస్తోంది.
IAF Mig21 Fighter Aircraft.. వందల కొద్దీ యుద్ధ విమానాల తయారీ..
రష్యాకి చెందిన యుద్ధ విమానం ఈ ‘మిగ్-21’. దీన్ని, మన దేశంలోనూ ఉత్పత్తి చేసుకున్నాం.. రష్యా భాగస్వామ్యంతో.
భారత రక్షణావసరాలకు సంబంధించి, రష్యా అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడు మనకి.! ఇది అందరికీ తెలిసిన విషయాలే.

సుఖోయ్, బ్రహ్మోస్.. ఇవన్నీ, రష్యా సాంకేతిక సహకారంతో మనం ఇక్కడ తయారు చేసుకుంటున్నవే. అణు జలాంతర్గాముల తయారీలోనూ, రష్యా సహకారం గురించి కొత్తగా చెప్పేదేముంది.?
‘మిగ్-21’ విషయానికొస్తే, వందల కొద్దీ యుద్ధ విమానాల్ని మనం తయారు చేసుకున్నాం.. యుద్ధ రంగంలో వాడేసుకున్నాం కూడా.!
మొన్నటికి మొన్న, ‘బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్’ నేపథ్యంలోనూ, మిగ్-21 తనదైన పోరాట పటిమను ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
కూలిపోతున్నాయ్.. కానీ, తప్పెవరిది.?
నిజమే.. ‘మిగ్-21’ యుద్ధ విమానాలు వరుసగా కుప్పకూలిపోతున్నాయ్. కానీ, దానికి కారణమేంటి.? ఎప్పుడో 90లలో ఈ యుద్ధ విమానల వాడకాన్ని నిలిపేసింది రష్యా.
కానీ, మనం ఏం చేస్తున్నాం.? భారత వైమానిక దళం, ఇప్పటికీ మిగ్-21 యుద్ధ విమానాల్ని వినియోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రక్షణ రంగంలో అనేక మార్పులు వచ్చేశాయ్.

అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానాలు అందుబాటులోకి వచ్చాక, మిగ్-21 యుద్ధ విమానాల్ని ఇంకా వాడటమంటే, అది మన తప్పు.!
అంతమాత్రాన, ‘ఫ్లైయింగ్ కోఫిన్స్’.. అదే, ఎగిరే శవ పేటికలంటూ, మిగ్-21 యుద్ధ విమానాల్ని అవమానించడమేంటి.. హాస్యాస్పదం కాకపోతే.
ఇక సెలవు..
ప్రస్తుతం భారత వైమానిక దళంలో మరీ ఎక్కువగా మిగ్-21 యుద్ధ విమానాలేం లేవు. వున్న ఆ కొన్ని విమానాల్నీ, విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది.
హమ్మయ్య.. ఇకపై, ‘ఎగిరే శవ పేటికలు’ అనే అపప్రధని మిగ్-21 యుద్ధ విమానాలు మోయాల్సిన అవసరం వుండదన్నమాట.

కానీ, వాటి స్థానంలో అందుబాటులోకి రావాల్సిన ‘హెచ్ఏఎల్ తేజస్’ యుద్ధ విమానాల సంగతేంటి.? ఇప్పటికే, ‘తేజస్’ యుద్ధ విమానాలు అందుబాటులోకి వచ్చినా.. సంఖ్య మరింత పెరగాలి.
ఎంతలా పెరగాలి అంటే, వందల సంఖ్యలో తేజస్ యుద్ధ విమానాలు.. భారత వైమానిక దళంలో చేరాల్సి వుంది. మరి, ఆ స్థాయిలో ఉత్పత్తి వేగం పుంజుకుంటుందా.?
IAF Mig21 Fighter Aircraft.. అరవయ్యేళ్ళపాటు వాడేశాం విచ్చలవిడిగా..
పదేళ్ళు కాదు, పాతికేళ్ళు కాదు.. యాభయ్యేళ్లూ కాదు.. అంతకు మించి.! ఔను, ఆరు దశాబ్దాలకు పైగానే ‘మిగ్-21’ యుద్ధ విమానాన్ని వాడేశాం. ఆ లెక్కన, ఇదొక లెజెండరీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నమాట.
అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అత్యాధునిక యుద్ధ విమానాలు సాంకేతిక సమస్యలతో ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం.
ఆ లెక్కన, ‘మిగ్-21’ ప్రమాదాల్ని అత్యంత కిరాతకంగా చిత్రీకరించడం ఎంతవరకు సబబు.? దిక్కుమాలిన ఆరోపణలు, విశ్లేషణలు పక్కన పెట్టి, వాటికి హుందాగా రిటైర్మెంట్ ప్రకటిస్తే.. ఎంత బావుంటుంది.?