Telugu Students America Dreams.. ట్రంప్ తాత వచ్చాడు.. తంటాలు తీసుకొచ్చాడు.! ఇకపై అమెరికాని మర్చిపోవాల్సిందే.! అమెరికా వద్దు.. భారత దేశంలో సెటిలవడమే ముద్దు.!
తెలుగు రాష్ట్రాల నుంచి.. ఇంజనీరింగ్ పూర్తవగానే, అమెరికా చెక్కెయ్యాలనుకునే యువత గురించి కొత్తగా చెప్పేదేముంది.?
ఎంఎస్ కోసం.. అనే వంకతో ఎలాగోలా అమెరికా వెళ్ళిపోతే, అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ డాలర్లు కూడబెట్టెయ్యొచ్చని అనుకుంటారు.
కానీ, ఇప్పుడు ఆ పప్పులు ఉడకడం లేదు. కేవలం చదువుకోవడానికే అమెరికా రావాలి.. వేరే వ్యాపకాలు పెట్టుకుంటే, తాట తీస్తాం.. అంటోంది అక్కడి ప్రభుత్వం.
Telugu Students America Dreams.. ఇప్పుడెలా.? ఏం చేయాలి చెప్మా.?
తన్ని తరిమేస్తున్నారు.. అన్నది చిన్నమాటే.! ఎందుకంటే, ట్రంప్ అధికార పీఠమెక్కాక, అమెరికాలో భారతీయులపై నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తున్నారన్నది నిర్వివాదాంశం.
పెరిగిన ఆంక్షలు సరే సరి.! భారత దేశంతో వాణిజ్య యుద్ధం చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ‘పెంచిన పన్నులతో’.!

ఈ క్రమంలో ముందు ముందు అమెరికాలో, భారతీయుల పరిస్థితి అగమ్యగోచరం.. అన్న చర్చ అంతటా జరుగుతోంది. ఎక్కువ కాలం ట్రంప్, అమెరికా అధ్యక్ష పీఠం మీద వుంటాడా.? అన్నదీ ఓ ప్రశ్న.
కానీ, అమెరికాలో ఎవరు అధ్యక్ష పీఠమెక్కినా, ‘అమెరికా ఫస్ట్’ అన్న నినాదాన్నే జపిస్తారు. సో, జర జాగ్రత్తగా వుండాల్సిందే. అప్రమత్తంగా వ్యవహరించాల్సిందే.
వేల కోట్లు.. అక్కడెందుకు ధారపొయ్యాలి.?
అమెరికా వెళ్ళి చదువుకోవడమంటే మాటలు కాదు. లక్షలు పోసెయ్యాలి. వేలాది మంది.. లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, అమెరికా వెళ్ళి.. వందల కోట్లు అక్కడ పారబోసేస్తున్నారు.
ఇకపై, అవన్నీ మానేస్తే బెటర్.. అన్న చర్చ అయితే జరుగుతోందిక్కడ. ఏమో, ఈ మార్పు కూడా మంచిదేనేమో.!
అమెరికా వెళ్ళాలనుకోవడం తప్పు కాదు.. అదో వ్యసనంగా మారిపోతేనే తప్పు.! ఇది అమెరికాలో వున్న చాలామంది భారతీయులు చెబుతున్నమాట.
Also Read: ‘పరదా’ రివ్యూ.! ఆంక్షల పరదా తొలగించే ప్రయత్నమేగానీ.!
అన్నీ సక్రమంగా వుండి.. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే.. అమెరికాలో భారతీయులకు ఎలాంటి ఇబ్బందులూ వుండవన్నదీ కాదనలేని వాస్తవం.
భయాలూ మామూలే.. ఆకాశానికి నిచ్చెనలు వేయడమూ మామూలే.! అమెరికా అంటే.. అదో కలల ప్రపంచం మరి.! అమెరికా వెళ్ళాలనుకుంటే, అమెరికా గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

అక్కడి చట్టాల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. వీసా ఇంటర్వ్యూ దగ్గర్నుంచి, అమెరికాలో అడుగు పెట్టేదాకా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందే.
ఏ చిన్న పొరపాటుకీ ఆస్కారమివ్వొద్దు. అక్కడికి వెళ్ళాక కూడా, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. పరాయి దేశంలో ‘మన హక్కులు’ అన్న ఆలోచనే చేయొద్దు.
అన్నిటికీ మించి, అమెరికా వెళ్ళేందుకు ‘దళారుల్ని’ ఆశ్రయించి మోసపోవద్దు. విద్యాభ్యాసం కోసం వెళ్ళేవారు, అక్కడి విద్యా సంస్థల గురించి పూర్తిగా అవగాహన కలిగి వుండాలి.
