Table of Contents
H1B Visa Trump USA.. ఇకపై ‘హెచ్1 బి వీసా’ కావాలంటే, ఏడాదికి లక్ష డాలర్లు సమర్పించుకోవాల్సిందే.! గతంలో, ఈ మొత్తం నామమాత్రంగా వుండేది.
భారత దేశం మీద పగబట్టేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఒక్కసారిగా ‘హెచ్1 బి వీసా’ ఫీజు పెంచేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు.
అమెరికా ఫస్ట్.. అంటూ, డోనాల్డ్ ట్రంప్ గత కొన్నాళ్ళుగా తీసుకుంటున్న నిర్ణయాలు, భారత దేశానికి అశనిపాతంగా తయారవుతున్న సంగతి తెలిసిందే.
ఈ మధ్యనే, భారతీయ ఉత్పత్తులపై సుంకాల్ని అనూహ్యంగా పెంచేస్తూ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో, భారత దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
H1B Visa Trump USA.. ఎంతమంది ఉసురు పోసుకుంటాడో.!
ప్రధానంగా, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ‘హెచ్1 బీ వీసా’పై గత కొంతకాలంగా అమెరికా వెళుతున్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు, తమ ఉద్యోగుల్ని ‘ఆన్ సైట్’ కింద, అమెరికాకి పంపిస్తున్న సంగతి తెలిసిందే.
అలా ఆన్ సైట్ వెళ్ళేందుకు, భారతీయ సాఫ్ట్వేర్ నిపుణులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. అలా, గత కొన్నేళ్ళలో ‘హెచ్1 బీ’ వీసా మీద అమెరికా వెళ్ళినవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
‘హెచ్ 1 బీ’ వీసా లభిస్తే, లైఫ్ సెటిలైపోయినట్లే.. అని భావిస్తారు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు. ఇప్పుడీ ఏడాదికి లక్ష డాలర్ల నిబంధనతో, ఎంతమంది రోడ్డున పడతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
లక్ష డాలర్లు.. అంటే, ప్రస్తుతం సుమారు 88 లక్షల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. అంత మొత్తాల్నికంపెనీలు భరించలేవు. దాన్ని సాఫ్ట్వేర్ రంగ నిపుణులూ భరించే పరిస్థితి లేదు.
ఎందుకీ తలతిక్క నిర్ణయాలు.?
‘హెచ్1 బీ వీసా’ మీద వచ్చే నిపుణులకు జీతాలు ఎక్కువగా వుంటున్నాయన్నది ట్రంప్ ఆరోపణ. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా.
అమెరికన్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సరిగ్గా లభించడంలేదనీ, అమెరికన్ వర్సిటీల్లో చదువుకునేవారికి, ఉద్యోగాల్లో ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలనీ ట్రంప్ అంటున్నారు.
సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా, ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తాయన్నది, అమెరికా ప్రభుత్వ వర్గాల వాదనగా కనిపిస్తోంది.
మరోపక్క, ట్రంప్ తల తిక్క నిర్ణయాలు కోర్టుల్లో నిలబడవన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం.
అయితే, ‘అమెరికా ఫస్ట్’ అంటూ ప్రతి విషయానికీ లింక్ పెడుతున్న ట్రంప్.. ముందు ముందు ఇంకెలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటాడో ఏమో.!
భయపడుతున్న యువత..
ఇంజనీరింగ్లో సీటు రాగానే, అమెరికా చెక్కేయొచ్చని.. భారతీయ యువత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న రోజులివి. అమెరికాలో ఎంఎస్ చదివితే.. ఆ కిక్కే వేరప్పా.. అంటోంది యువత.
మరి, ఈ తరహా నిర్ణయాలతో ట్రంప్ చెలరేగిపోతోంటే, ఆ యువత పరిస్థితేంటి.? ఆల్రెడీ అమెరికాలో కొలువుల్లో వున్న భారతీయుల పరిస్థితి ఏంటి.?
Also Read: అమృత ఫడ్నవిస్ వస్త్రధారణపై ఎందుకింత రచ్చ.?
వేలాది సంఖ్యలో.. కాదు, కాదు లక్షలాది సంఖ్యలో భారతీయులు, అమెరికాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు.
ముందు ముందు వారందరికీ ట్రంప్ నిర్ణయాల కారణంగా వారందరికీ ఇబ్బందులు తప్పకపోవచ్చు.
