Table of Contents
YS Jagan Against Vizag.. పరిపాలనా రాజధాని విశాఖ.. అన్నారు కదా.! మళ్లీ గెలిస్తే, విశాఖలోనే కాపురం.. అన్నారు కదా.! ఇప్పుడేంటి, విశాఖ మీద ఇంతలా విషం చిమ్మడం.?
విశాఖ అనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా, రాష్ట్రానికి చెందినవారిగా ప్రతి ఒక్కరూ గర్వపడాలి.
తెలుగు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమం పట్ల ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారంతా గర్వపడి తీరాల్సిందే.
దురదృష్టమేంటంటే, ప్రజా సేవ కోసమంటూ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు.. అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవడం.!
YS Jagan Against Vizag.. విశాఖకు గూగుల్ డేటా సెంటర్..
టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి హయాంలో, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. కానీ, దీన్ని వైసీపీ తట్టుకోలేకపోతోంది.
ఓ పక్క, విశాఖలో డేటా సెంటర్ ఆలోచన తమదేనని వైసీపీ నాయకులు చెబుతున్నారు. వాళ్ళే, డేటా సెంటర్ వల్ల ప్రయోజనం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు.
గూగుల్ ఎంత ప్రముఖ సంస్థ.. అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గూగుల్ సంస్థలో కొలువులంటే, జీవితంలో సాధించిన అతి పెద్ద అచీవ్‌మెంట్‌గా చెప్పుకుంటుంది నేటి యువతరం.
అలాంటి గూగుల్ సంస్థ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థకు రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతోంది.
పెట్టుబడులు ఎలా వస్తాయి.?
విశాఖ మీద వైసీపీ విషం చిమ్మితే, విశాఖకు పెట్టుబడులు ఎలా వస్తాయ్.? అని వైసీపీ నాయకులే ఆత్మ విమర్శ చేసుకోవాలి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా వున్న సమయంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రతిపాదించారు. సముద్ర తీరం కనిపించేలా, ముఖ్యమంత్రి కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
అయితే, దాన్నిప్పుడు పర్యాటక సంస్థ భవనాలని వైసీపీ బుకాయిస్తోందనుకోండి.. అది వేరే సంగతి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. అన్న ఆలోచన జరిగిందంటే, ముందుగా సెక్రెటేరియట్ నిర్మాణం కదా చేయాలి.?
‘ఎన్నికల్లో మళ్ళీ గెలిచాక, విశాఖలో కాపురం పెడతా..’ అన్నారు వైఎస్ జగన్. అందుకేనేమో, ముందుగా నివాస భవనాన్ని ప్రజాధనం వెచ్చించి, నిర్మించుకున్నారు.

కానీ, దానికి పర్యాటక భవనాలనే పేరు పెట్టారు.. తెలివిగా.! వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాలేదు, ఆ భవనాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇదీ వైసీపీ చిత్తశుద్ధి.
అదే, విశాఖలో సెక్రెటేరియట్ కోసం భవనాలు నిర్మించి వుంటే, ఇతరత్రా ప్రభుత్వ అవసరాల కోసమైనా అవి ఉపయోగపడేవి.
ఇప్పుడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ మీద వైసీపీ నేతలతో, కార్యకర్తలతో వైఎస్ జగన్ దుష్ప్రచారం చేయిస్తున్నారంటే, విశాఖకు పెట్టుబడులు రాకూడదనే కదా.?
విశాఖ అభివృద్ధి అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎందకు నచ్చడంలేదన్నది అంతటా వెల్లువెత్తుతున్న ప్రశ్నాస్త్రాల సారాంశం.
ఉత్తరాంధ్ర ముఖచిత్రం విశాఖ. విశాఖ మీద విషం చిమ్మితే, మొత్తంగా ఉత్తరాంధ్రలోనే వైసీపీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదముంది.
రాజకీయం వేరు.. రాజకీయ విమర్శలకు చాలా అవకాశాలుంటాయి. కానీ, అభివృద్ధి విషయంలో విషం చిమ్మడం రాజకీయం కాబోదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుసుకుంటే మంచిది.
వేగం.. ఖచ్చితత్వం.. ముఖ్యం.!
ఇక, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పనులు వీలైనంత త్వరగా ప్రారంభమై, అంతే వేగంగా, ఖచ్చితత్వంతో పూర్తవ్వాల్సి వుంది.
ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే అంత మంచిది. ఇక్కడ క్రెడిట్ కోసం కూటమి పార్టీల్లో లొల్లి జరగడం కూడా సబబు కాదు.!
కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, రాష్ట్రంలో కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీ, అలానే రాష్ట్రంలో కూటమి గెలుపుకు ప్రధాన కారణమైన జనసేన, విశాఖ అభివృద్ధికి చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి వుంది.
Also Read: మీ బిర్యానీలో ‘చికెన్’ వుందా.?
గడచిన ఐదేళ్ళ వైసీపీ పాలనలో విశాఖ దోపిడీకి గురయ్యింది. ల్యాండ్ మాఫియా.. విశాఖను కబళించేసింది. ఇప్పుడీ అభివృద్ధి ద్వారా విశాఖకు పూర్వ వైభవాన్ని కూటమి ప్రభుత్వమే తీసుకురావాలి.
మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖకు రావాలి, విశాఖలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి.!
చివరగా.. ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న జగన్, విశాఖ సహా రాష్ట్రాభివృద్ధి విషయంలో చిత్తశుద్ధితో కూడిన రాజకీయాలు చేయాల్సి వుంది.
