Ys Jagan Assembly Fear.. రాజకీయమన్నాక విమర్శలు సహజం. విపక్షమన్నాక ప్రభుత్వాన్ని ప్రశ్నించడమూ సహజం.
కాకపోతే, ప్రశ్నించడానికి ఓ వేదిక అంటూ కావాలి కదా.!
అదృష్టవశాత్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ అనే వేదిక వుంది. కాకపోతే, ఆయనే అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టపడటంలేదు.
2024 ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం తర్వాత, ఏమనుకున్నారోగానీ.. తాడేపల్లి నివాసం వదిలేసి, బెంగళూరు ప్యాలెస్‌కి మకాం మార్చేస్తారు.
ఎన్నికల సమయంలో, ‘కాపురం విశాఖలో పెడతా’ అనేవారు వైఎస్ జగన్.! విశాఖలోనే ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం.. అని కూడా ప్రకటించారు ఎన్నికలకు ముందర.
Ys Jagan Assembly Fear.. వై నాట్ 175 అంటే పదకొండు మాత్రమే..
వై నాట్ 175 అని నినదిస్తే, వైసీపీకి వచ్చింది 11 సీట్లు మాత్రమే. అంతకు ముందొచ్చిన.. అంటే, 2019 ఎన్నికల్లో వచ్చిన 151 సీట్లలో ఏకంగా, 140 సీట్లను వైసీపీ కోల్పోయింది.
ఇది నిఖార్సయిన ప్రజా తిరస్కారం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం.. అనుకుని, ముందుకు సాగిపోవాలి.
మొత్తం 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలూ, అసెంబ్లీకి వెళితే, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు.
ప్రభుత్వంలో వున్నవారు, బాధ్యతగా సమాధానం చెప్పకపోతే, వచ్చే ఎన్నికల్లో ప్రజలే చూసుకుంటారు. ఆ సంగతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ బాగా తెలుసు.
ఇక, ఏపీలో ఇటీవల సంభవించిన మొంథా తుపాను, ఈ క్రమంలో జరిగిన పంట నష్టం, రైతుల కష్టాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వమ్మీద కొన్ని ఆరోపణలు చేశారు.
ప్రశ్నించాల్సింది అసెంబ్లీలో..
ఈ ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీకి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. అసెంబ్లీకి రమ్మని, అసెంబ్లీలో ప్రశ్నించమనీ ఉచిత సలహా ఇచ్చారు వైసీపీకి.
కానీ, అసెంబ్లీలో కాదు.. ఏ టీవీ ఛానల్‌లో అయినా చర్చకు సిద్ధమంటూ వైసీపీ నుంచి సమాధానమొచ్చింది. అచ్చెన్న అన్నారని కాదుగానీ, టీవీలు ఎందుకు అసెంబ్లీ వుండగా.?
‘‘టీవీలు ఎందుకు దండగ? అసెంబ్లీ ఉండగా! వస్తాడా మీ మేత జగన్?’’ ఇదీ అచ్చెన్న సోషల్ మీడియా వేదికగా సంధించిన ప్రశ్న.
వైసీపీ శ్రేణులూ ఈ విషయమై, తమ అధినాయకత్వంపై ఒకింత గుస్సా అవుతున్నారు. పదకొండు మంది గెలిచి కూడా దండగ.. అన్న చర్చ వైసీపీలోనే జరుగుతోంది.
వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలికి వెళుతున్నారు. వైసీపీ లోక్ సభ సభ్యులూ, రాజ్య సభ సభ్యులూ పార్లమెంటుకు వెళుతున్నారు.
కేవలం వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే, శాసన సభ అంటే భయపడిపోతున్నారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా.! ఎందుకింత భయం.?
