INS Aridhaman Submarine.. భారత నావికాదళం అమ్ములపొదిలో ఆల్రెడీ రెండు న్యూక్లియర్ పవర్డ్ జలాంతర్గాములున్నాయి.
వాటిల్లో ఒకటి ఐఎన్ఎస్ అరిహంత్ కాగా, ఇంకొకటి ఐఎన్ఎస్ అరిఘాత్.
ఈ రెండూ స్వదేశీ తయారీ అణు జలాంత్గాములు. వీటిని అరిహంత్ క్లాస్ అణు జలాంతర్గాములుగా పేర్కొంటున్నాం. 6000 టన్నుల బరువైన జలాంతర్గాములివి.
ఇదే ‘క్లాస్’లో మరో జలాంతర్గామి రంగంలోకి దిగుతోంది. దాని పేరే ఐఎన్ఎస్ అరిధమాన్. అయితే, ఇది ఇంతకు ముందున్న రెండు అణు జలాంతర్గాములు అరిహంత్, అరిఘాత్‌లతో పోల్చితే కాస్త పెద్దది.
అరిధమాన్ సబ్‌మెరైన్ 7000 టన్నులతో, మరిన్ని ప్రత్యేకతలతో రూపొందింది. అరిహంత్, అరిఘాత్ సబ్‌మెరైన్ల కంటే ఎక్కువ మిస్సైళ్ళను అరిధమాన్ తీసుకెళ్ళగలదు.
సముద్రం అడుగున, అత్యంత సైలెంట్‌గా వుండి, అవసరమైనప్పుడు.. అత్యంత శక్తివంతమైన మిస్సైళ్ళతో విరుచుకుపడటం ఈ సబ్‌మెరైన్ల ప్రత్యేకత.
ప్రస్తుతం సీ-ట్రయల్స్‌లో వున్న ఐఎన్ఎస్ అరిధమాన్, అతి త్వరలో నావికాదళంలో చేరబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఇండియన్ నేవీ చీఫ్ వెల్లడించడం గమనార్హం.
అరిహంత్ క్లాస్ సబ్‌మెరైన్లు ఎక్కడో కాదు, మన ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖ తీరంలో నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్లాస్‌లో ఇంకో సబ్‌మెరైన్ కూడా తయారవుతోంది.
ఇవన్నీ బాలిస్టిక్ మిస్సైళ్ళను మోసుకెళ్ళగల సామర్థ్యం వున్న సబ్‌మెరైన్లు. బాలిస్టిక్ మిస్సైళ్ళు.. అంటే, అందునా ప్రత్యేకించి అణు వార్ హెడ్లు మోసుకెళ్ళగలవి.
శతృదేశాల భూమి లేదా ఆకాశ మార్గాల్లో మన మీద దాడి చేసినప్పుడు సెకెండ్ స్ట్రైక్ సామర్థ్యం కోసం ఈ బ్యాలిస్టిక్ మిస్సైళ్ళను ప్రయోగించగల సబ్‌మెరైన్లు ఎంతగానో ఉపయోగపడతాయి.
సిబ్బంది అవసరాల నిమిత్తం తప్పితే, ఈ అణు జలాంతర్గాములు, సముద్ర ఉపరితలం మీదకు రావాల్సిన అవసరం కూడా వుండదు.
న్యూక్లియర్ పవర్డ్ ఎటాక్ సబ్‌మెరైన్ల అవసరం కూడా భారత నావికాదళానికి వుంది. వాటి నిర్మాణానికి కూడా రంగం సిద్ధమయ్యింది.
10 వేల టన్నుల సామర్థ్యంతో ఈ అణు జలాంతర్గాముల్ని తయారు చేయనున్నారు. ఈ జలాంతర్గాముల తయారీకి కొన్నేళ్ళ సమయం పట్టొచ్చు.
