EKO Telugu Review.. మలయాళ సినిమాలు కొన్ని నెమ్మదిగా సాగుతాయి.. కానీ, అలా నెమ్మదిగా సాగడం వల్ల, కథలో లీనమయ్యేలా చేస్తాయి.!
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, నటీనటుల నటనా ప్రతిభ, ఎడిటింగ్.. ఒకటేమిటి, అన్నీ కలగలిసినప్పుడు వెండితెరపై అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి.
స్టార్స్‌తో పని వుండదు.. మంచి మంచి కథలు చెప్పడానికి.! ఒక్కోసారి, రొటీన్ రివెంజ్ డ్రామానే కదా.. అనిపిస్తుంటుంది. కానీ, కథ చెప్పే విధానం వేరేలా వుంటుంది.
‘ఎకో’ పేరుతో వచ్చిన ఓ మళయాల సినిమా గురించి ప్రస్తావించేముందు, పైన ఉపోద్ఘాతం చెప్పుకోవాల్సి వస్తోంది. మరి, ఆ స్థాయిలో అద్భుతం ఈ సినిమా నుంచి ఆశించవచ్చా.?
అద్భుతం అని అనలేంగానీ.. సినిమా సాగుతున్నంతసేపూ, మనం కథలో లీనమైపోతాం. పాత్రలతో కనెక్ట్ అవుతాం. తర్వాత ఏమవుతుందా.? అన్న ఉత్కంఠకు గురవుతాం.
నటీనటుల్లో సీనియర్ నటుడు వినీత్ ఒక్కడే మనకి సుపరిచితుడు. మిగతా నటీనటులంతా, మనకి పరిచయం లేనివాళ్ళే.!
దర్శకుడు, సినిమాటోగ్రాఫర్.. ఇలా సాంకేతిక విభాగాలకు చెందినవారూ, మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు కారు.! ఇది మలయాళ సినిమా, ఓటీటీ ద్వారా తెలుగులోకి వచ్చింది.
కొంతమంది, ‘ఎకో’ సినిమాని థియేటర్లలో చూసి, మంచి మంచి రివ్యూలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దాంతో, మిగతావారికీ సినిమాపై ఆసక్తి ఏర్పడింది.
కాస్త తీరిక దొరకడంతో, అన్యమనస్కంగానే ‘ఎకో’ సినిమాని ఓటీటీలో చూడ్డం మొదలెట్టాక, కాస్సేపటికే కథలో లీనమైపోవడం జరిగింది.
కురియాచన్ అనే వ్యక్తి ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతుంటాయి. అతనెవరు.? కుక్కల బ్రీడింగ్ కథేంటి.? అతన్ని వెతుక్కుంటూ వచ్చిన, అతని పాత స్నేహితుడేమయ్యాడు.?
ఓ ముసలావిడ చుట్టూ కథ నడుస్తుంటుంది. ఆమె ఎవరు.? కురియాచన్ అసలెక్కడున్నాడు.? ముసలావిడకి సహాయకారిగా వున్న కుర్రాడెవరు.? ఇలా చాలా ప్రశ్నలు.. వాటికి సినిమా నడుస్తోంటే, సమాధాానాలు దొరుకుతుంటాయి.
కొన్ని ప్రశ్నలకు నేరుగా సమాధానం దొరకదు. సినిమా చూసే ప్రేక్షకుడే, కథా గమనంలో అర్థం చేసుకోవాల్సి వుంటుంది. క్లయిమాక్స్ కూడా అంతే.
ఎక్కడా డ్రమెటిక్ సన్నివేశాలు కనిపించవు. అంతా సహజంగా సాగిపోతుంటుంది. నటీనటుల్లో ఎవరూ ఓవరాక్షన్ చేయలేదు. ఏ పాత్రకి ఎంత కావాలో, అంతే నటనని రాబట్టాడు దర్శకుడు.
కొన్ని సన్నివేశాల్లో అవతార్ సినిమాని పోలిన ప్రకృతి అందాలు కనిపిస్తాయి. పైగా, ‘ఎకో’లో చూపించినవి సహజసిద్ధమైన ప్రకృతి అందాలు.
నరాలు తెగే ఉత్కంఠ.. అనలేంగానీ, కాస్త ఆ స్థాయిలోనే ఉత్కంఠభరితంగా సాగుతుంటాయి కొన్ని సన్నివేశాలు. చివర్లో యాక్షన్ సన్నివేశాలు అయితే, అత్యంత సహజంగా తెరకెక్కించారు.
ఓవరాల్‌గా ఇదొక మంచి థ్రిల్లర్.! అస్సలేమాత్రం నిరాశపరచదు. ముందే చెప్పుకున్నట్లు అక్కడక్కడా కాస్త స్లో పేస్ ఇబ్బంది పెడుతుంది.!
పనికిమాలిన కామెడీ, గ్లామర్ పేరుతో వల్గారిటీ.. ఇలాంటివేవీ, ‘ఎకో’ సినిమా నుంచి ఆశించకూడదు. అన్నట్టు, డబ్బింగ్ చాలా శ్రద్ధగా చెప్పించినట్లున్నారు.. బావుంది.
