కరోనా వైరస్ (కోవిడ్ 19) ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే లక్షలాదిమందికి కరోనా సోకింది.. కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకీ అనూహ్యంగా పెరుగుతోంది ప్రపంచ వ్యాప్తంగా. మన దేశంలోనూ కరోనా వైరస్ (Corona Virus Covid 19 Vaccine) తీవ్రత అధికంగానే వుంది. ఇదిగో వ్యాక్సిన్.. అదిగో వ్యాక్సిన్.. అంటూనే రోజులు గడిచిపోతున్నాయి.
కానీ, వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. తొలి వ్యాక్సిన్‌ని తామే కనిపెట్టామంటూ ఇప్పటికే రష్యా ప్రకటించేసుకుంది. ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని ఐసీఎంఆర్ ప్రకటించినా, అది జరగలేదు. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. 2020 చివరి నాటికి కూడా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని తాజాగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
2021 తొలి క్వార్టర్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం వుందన్నది తాజాగా విన్పిస్తోన్న వాదన. వ్యాక్సిన్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దశల వారీగా పరీక్షించాల్సి వుంటుంది. కొన్ని వ్యాక్సిన్లు ఇప్పటికే మూడు దశల్ని పూర్తి చేసుకున్నాయి కూడా. ఆయా దశల్లో వచ్చిన ఫలితాల్ని విశ్లేషించడమే ఇక్కడ అత్యంత కీలకమైన అంశం. ఆ విశ్లేషణ తర్వాతనే వ్యాక్సిన్‌కి ఆమోద ముద్ర పడుతుంది.
సో, వ్యాక్సిన్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుందన్నమాట. మరి ఈలోగా కరోనా వైరస్ నుంచి ఎలా తప్పించుకోవడం.? దీనికి సమాధానం చెప్పడం కష్టమే. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా మన దేశంలో లాక్‌డౌన్‌ని ఎత్తేయాల్సి వచ్చింది. లాక్డౌన్ ఎత్తివేయకపోతే జనం మరింతగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతారు. అది మరింత ప్రమాదకరమైన పరిస్థితి.
ఇంకోపక్క, కరోనా కేసులు పెరుగుతున్నా.. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో.. జనంలోనూ ధైర్యం పెరుగుతోంది. ఖచ్చితమైన వైద్య చికిత్స ఏదీ లేకపోయినా, అందుబాటులో వున్న మందులతో కరోనా వైరస్‌కి మెరుగైన చికిత్సనే అందించగలుగుతున్నారు మన దేశంలో.
కొన్ని ప్రత్యేకమైన మందులు ఇంకాస్త విరివిగా మార్కెట్లోకి వస్తే, వ్యాక్సిన్ (Corona Virus Covid 19 Vaccine) వచ్చినా, రాకపోయినా కరోనా వైరస్ ఓ సాధారణ జలుబు, జ్వరం స్థాయికి ముందు ముందు పడిపోయే అవకాశమూ లేకపోలేదు. అలాగని కరోనా వ్యాక్సిన్ పరీక్షలు ఆగబోవు. ఖచ్చితంగా వ్యాక్సిన్ వస్తుంది. కానీ, అదెప్పుడన్నది చెప్పడం చాలా చాలా కష్టం. 2020లో వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తీసుకురావడం దాదాపు అసాధ్యంగానే కన్పిస్తోంది.