తెలుగులో బిగ్ బాస్ మూడో సీజన్‌ని హోస్ట్ చేసిన కింగ్ అక్కినేని నాగార్జున (Bigg Boss Telugu 4 Nag King Size Opening), నాలుగో సీజన్‌ని కూడా హోస్ట్ చేస్తున్న విషయం విదితమే. అయితే, మూడో సీజన్ సమయంలోనే కింగ్ నాగ్ మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియాలో. అయితే, దాన్ని నాగ్ లెక్క చేయలేదు.
బిగ్ బాస్ లాంటి రియాల్టీ షో సందర్భంగా ఈ తరహ ట్రోలింగ్ సర్వ సాధారణమే. రెండో సీజన్‌కి హోస్ట్ చేసిన నాని మీద కూడా బీభత్సంగానే ట్రోలింగ్ జరిగింది. అయితే, ఫస్ట్ సీజన్ హోస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి మాత్రం ఈ సమస్య రాలేదు.
ఇక, అక్కినేని నాగార్జున విషయానికొస్తే.. కరోనా నేపథ్యంలోనూ ఆయన డేరింగ్ స్టెప్ తీసుకున్నారు బిగ్ బాస్ రియాల్టీ షోని హోస్ట్ చేయడం ద్వారా. ఇందుకు ఆయన్ని తొలుత అభినందించాలి. షో ప్రారంభోత్సవం సందర్భంగా ఆడియన్స్‌కి ఆస్కారమివ్వలేదు. గతంలో అయితే, కంటెస్టెంట్స్ తాలూకు కుటుంబ సభ్యులు, ఇతరులు కన్పించారు.
ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. దాంతో నాగ్, అక్కడ జనాల్ని ఊహించుకుని.. దాన్నో అద్భుతమైన ఈవెంట్‌గా రక్తి కట్టించడం గమనార్హం. ‘ముద్దులూ, ఆలింగనాలు కరచాలనాలు’ కూడా లేకుండా పోయాయి కరోనా నేపథ్యంలో. నాగ్ని చూసి చాలామంది యంగ్ కంటెస్టెంట్స్ స్పెల్ బౌండ్ అయ్యారు.
అందర్నీ తనదైన స్టయిల్లో ఉత్సాహ పరిచిన నాగ్ (Bigg Boss Telugu 4 Nag King Size Opening), ప్రత్యేక పరిస్థితుల్లో ‘వారెవ్వా’ అన్పించుకోవడాన్ని అభినందించి తీరాల్సిందే. ఈవెంట్ ప్రారంభోత్సవం సందర్బంగా పెర్ఫామెన్స్లు కూడా తక్కువగానే వున్నాయి. అలాగని హై ఓల్టేజ్ ఎనర్జీకి ఏమాత్రం లోటు లేకుండా చూసుకున్నారు. గ్లామర్ కూడా ఎక్కువగానే వున్నట్లన్పించింది.
ఓవరాల్‌గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకన్నా ఎనర్జిటిక్ బిగినింగ్‌ని ఎలా ఆశించగలం.? అయినాగానీ, నాగ్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు నెటిజన్లు. నాగ్ని మాత్రమే కాదు, దాదాపు అందరు కంటెస్టెంట్స్నీ ట్రోల్ చేసేస్తున్నారు.. ఆఖరికి స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వతో సహా.
ఆర్మీలు ఏర్పడ్డాయి.. గ్యాంగులు తయారయ్యాయి.. వెరసి కంటెస్టెంట్స్‌కి బ్యాక్ ఎండ్ టీమ్స్ చాలానే వున్నాయనే విషయం అర్థమవుతోంది. 16 మంది కంటెస్టెంట్స్ రంగంలోకి దూకారు. అందులో ఇద్దరు రహస్య గదిలోకి వెళ్ళడం గమనార్హం.
హీరోయిన్ మోనాల్ గజ్జర్, దర్శకుడు సూర్యకిరణ్, యాంకర్ లాస్య, హీరో అభిజీత్, యాంకర్ సుజాత, యూ ట్యూబ్ సెన్సేషన్ మహబూబ్ దిల్సే, న్యూస్ రీడర్ దేవి నాగవల్లి, యూ ట్యూబ్ సంచలనం అలేఖ్య హారిక, టీవీ నటుడు సయ్యద్ సోయెల్, యూ ట్యూబ్ సెన్సేషన్ అరియానా గ్లోరీ, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్, నటి కరాటే కళ్యాణి, రాపర్ నోయెల్ సీన్, బుల్లితెర నటి దివి, నటుడు అఖిల్ సార్దక్, గంగవ్వ తదితరులు ఈ సీజన్ కోసం కంటెస్టెంట్స్‌గా తొలి రోజు బిగ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.