‘రాఫెల్ (Rafale Indian Air Force) యుద్ధ విమానాలు మన దగ్గర వుండి వుంటే.. పరిస్థితి ఇంకోలా వుండేది..’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ‘బాలాకోట్’ సర్జికల్ స్ట్రైక్ తర్వాత వ్యాఖ్యానించారంటే.. ఈ యుద్ధ విమానాల సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
భారత్ ఎప్పుడూ తొలుత దాడి చేయదు. కానీ, శతృవు తొందరపడితే.. సత్తా చాటేందుకు ఎప్పుడూ భారత్ సిద్ధమే. పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా.. ఎప్పటికప్పుడు భారతదేశమ్మీదకి దండెత్తడానికే ప్రయత్నిస్తుంటాయి.
చైనా నుంచి భారతదేశానికి ముప్పు తక్కువే. పాకిస్తాన్‌తో అలా కాదు. పాకిస్తాన్ ఎప్పటికీ ఇండియాని ఓడించలేదు. కానీ, పాకిస్తాన్ నుంచి వచ్చే ముప్పుని తక్కువగా అంచనా వేయలేం. దొంగ దెబ్బ తీయాలని ఎప్పటికప్పుడు పాకిస్తాన్, ‘గోతికాడి నక్కలా’ కాచుక్కూర్చుని వుంటుంది. అదే అసలు సమస్య.
సరిహద్దుల నుంచి తీవ్రవాదుల్ని భారత్‌లోకి ఎగదోయడం పాకిస్తాన్ ఎప్పటినుంచో చేస్తున్నదే. భారత్ మీద ప్రత్యక్ష యుద్ధం చేయలేని పాకిస్తాన్ ఇలాంటి అనైతిక చర్యలు ఎన్నో దశాబ్దాలుగా చేస్తూనే వుంది. అలాంటి పాకిస్తాన్‌కి అవసరమైనప్పుడు అవసరమైన రీతిలో బుద్ధి చెప్పాల్సిందే.
యురి, పుల్వామా ఘటనల తర్వాత పాకిస్తాన్‌కి షాకిచ్చేందుకు ‘సర్జికల్ స్ట్రైక్స్’ చేశాం. ఆ సమయంలో రఫాలె యుద్ధ విమానం తాలూకు అవసరం బాగా తెలిసొచ్చింది మనకి. ఇప్పుడు ఈక్వేషన్స్ మరింతగా మారాయి. చైనా కవ్వింపులు పెరిగిపోయిన నేపథ్యంలో, రఫాలె యుద్ధ విమానాల రాక.. భారత్‌కి బాగా కలిసొచ్చింది.
రాఫెల్ ఒక్కటే కాదు, అపాచీ యుద్ధ హెలికాప్టర్లు కూడా భారత వైమానిక శక్తిని మరింత పెంచాయి. చైనా వద్ద ఇంకా అత్యాధునిక యుద్ధ విమానాలు వుండొచ్చుగాక. కానీ, పరిమిత వనరులతో అద్భుతాలు సృష్టించడమెలాగో భారత్‌కి తెలుసు.
సుఖోయ్ 30 ఎంకే యుద్ధ విమానాలు పెద్ద సంఖ్యలో భారత్ వున్నా, రాఫెల్ లాంటి యుద్ధ విమానాలూ అత్యవసరమే. ఆ కొరత ఇప్పుడు దాదాపుగా తీరిపోయినట్లే. మరిన్ని రఫాలె యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో త్వరలో చేరనున్నాయి. డాగ్ ఫైట్‌లో ఇవి అత్యంత కీలకం.
అంతే కాదు, శతృ భూభాగంలోకి లోతుగా వెళ్ళి విధ్వంసం సృష్టించడంలో రాఫెల్ ఫైటర్ జెట్ ప్రపంచంలోనే మేటి యుద్ధ విమానాల్లో ఒకటిగా పేరొందింది. ఇవి కాక తేజస్ యుద్ధ విమానాలు, తేజస్‌లో రెండో రకం యుద్ధ విమానాలూ ముందు ముందు భారత వైమానిక దళానికి మరింత బలాన్నిస్తాయి. ‘భారత్ గనుక కయ్యానికి కాలు దువ్వితే, మట్టికరవాల్సిందే..’ అని చైనా హెచ్చరిస్తోంది.
కానీ, చైనాకీ తెలుసు.. భారత్‌తో యుద్ధమంటూ జరిగితే ఏమవుతుందో. కవ్వింపులు మినహా, చైనా.. భారత్ మీదకి దండెత్తేందుకు సాహసించకపోవచ్చు. కానీ, అన్నిటికీ సిద్ధమయ్యే వుండాలి. నిజానికి, భారత్ సమకూర్చుకుంటున్న ఆయుధ వ్యవస్థలన్నీ చైనాకి ధీటుగా వుండాలనే.!
పాకిస్తాన్, చైనా రెండు కలిసి భారత్ మీదకు దాడికి దిగినా.. తిప్పికొట్టగల స్థాయిలో ఎప్పుడూ భారత్ సిద్ధంగానే వుంటుంది. కానీ, యుద్ధం చివరికి మిగిల్చేది వినాశనమే. ఆ పరిస్థితే రాకూడదు.