ముంబై ఇండియన్స్ (Mumbai Indians IPL Champions) ఇంకోస్సారి ఐపీఎల్ ఛాంపియన్స్‌గా సత్తా చాటింది. అంచనాలకు తగ్గట్టే ముంబై రాణించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అద్భుతాలేమీ కనిపించలేదు. మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించిన పరిస్థితి కూడా లేదు.
ఏదో సరదాగా జరిగిపోయింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైనల్ మ్యాచ్. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్, ఫైనల్స్‌కి రావడమే గొప్ప.. అన్నట్లుగా లైట్ తీసుకోవడం.. ముంబై ఇండియన్స్ జట్టు చాలా తేలిగ్గా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేయడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే, ఈసారి అత్యంత ప్రత్యేకమైన టోర్నమెంట్‌ని క్రికెట్ అభిమానులు తిలకించాల్సి వచ్చింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో బయో బబుల్ విధానం ద్వారా ఈ మ్యాచ్‌లను నిర్వహించారు.
మైదానంలో ప్రేక్షకుల్లేరు.. అభిమానులు, ఇంట్లోని టీవీ సెట్ల ముందు కూర్చుని మాత్రమే మ్యాచ్‌లను తిలకించాల్సి వచ్చింది. మ్యాచ్ జరుగుతున్నంతసేపూ స్టేడియంలో అభిమానుల హోరు కనిపించేలా, రికార్డెడ్ ఆడియోలను ప్లే చేశారు.
ఇంతటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆటగాళ్ళు, ఆటని రక్తి కట్టించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దాదాపుగా ఏ జట్టు కూడా ఒత్తిడితో కనిపించలేదు. ఆటలో గెలుపోటములు సహజం.
ఓ జట్టు పేలవమైన ప్రదర్శన చేయడం.. ఇంకో జట్టు అద్భుతమైన ప్రదర్శన చేయడం.. ఇవన్నీ ఆటలో భాగమే. బయో బబుల్ ఎంత పకడ్బందీగా వుందంటే.. మైదానంలోకి దిగాక ఒక్క ఆటగాడికీ కరోనా సోకలేదు మరి. చాలా నిబద్ధతతో ఐపీఎల్ 2020 సీజన్ నడిచింది.
క్రికెట్ అభిమానులకి ఇంతటి గొప్ప ఎంటర్టైన్మెంట్ అందించిన క్రికెటర్లకు హేట్సాఫ్ చెప్పాలి. ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఆటగాళ్ళు ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడారనడం అతిశయోక్తి కాదు. కరోనా పాండమిక్ తెచ్చిన భయం అలాంటిది మరి. ఏదిఏమైనా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 అదుర్స్ అన్నది నిర్వివాదాంశం.
గెలుపోటముల సంగతి పక్కన పెడితే, ప్రతి జట్టుకీ.. ప్రతి ఆటగాడికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే ఐపీఎల్ అభిమానులంతా. ఇంతటి ప్రత్యేక పరిస్థితుల్లోనూ అత్యద్భుతంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించిన ముంబై జట్టు (Mumbai Indians IPL Champions) తాను అసలు సిసలు ఛాంపియన్ అనిపించుకుంది. హేట్సాఫ్ టు ముంబై ఇండియన్స్.