బాక్సాఫీస్ స్టామినా.. అనేది చాలా చిన్న పదమే అవుతుంది బహుశా రజనీకాంత్ గురించి మాట్లాడుకోవాలంటే. సినిమాల్లో రజనీకాంత్ (Rajnikanth Political Power) పవర్ అలాంటిది. రజనీకాంత్ సినిమా విడుదలవుతోంటే, కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ఇచ్చేస్తాయి. అదీ రజనీకాంత్‌కి వున్న క్రేజ్.
ఇండియాలో బహుశా ఏ నటుడికీ లేనంత ప్రత్యేకమైన క్రేజ్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సొంతం. అయితే, సినిమా వేరు.. రాజకీయం వేరు. రాజకీయ రంగ ప్రవేశం చేస్తానంటూ చాలాకాలంగా రజనీకాంత్, తన అభిమానుల్నీ, తమిళ ప్రజల్నీ ఊరిస్తూ వచ్చాడు. చివరికి, వచ్చేస్తున్నా.. అంటూ డెడ్‌లైన్ కూడా పెట్టేశాడు.
డిసెంబర్ 31న ప్రకటన, జనవరిలో పార్టీ పేరు గురించిన వివరాల వెల్లడి.. ఇదీ రజనీకాంత్ పొలిటికల్ షెడ్యూల్. త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీ చేస్తుంది. ‘ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం.. తమిళ ప్రజల తల రాతలు మారుస్తాం..’ అంటూ ఇప్పటికే రజనీకాంత్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.

రాజకీయాల్లోకి రావడమంటే అంత తేలికైన వ్యవహారం కాదు. పైగా, తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం పూర్తిగా సన్నద్ధమయిపోయాక.. రజనీకాంత్ తాపీగా, రాజకీయ ప్రకటన చేశాడు. పార్టీ పేరు ప్రకటించాలి.. గుర్తు ప్రకటించాలి.. పార్టీ జెండా ఖరారు కావాలి.. ఎజెండా తయారు చేయాలి.. కథ చాలానే వుంది. ఇవన్నీ రజనీకాంత్ సినిమాల్లో డైలాగులు చెప్పినంత సులభం కాదు.
ఎన్నికల గుర్తు అన్నిటికంటే కీలకమైనది. ఎన్నికల కమిషన్‌కి దరఖాస్తు చేసుకోవాలి.. ఎన్నికల కమిషన్ దాన్ని అనుమతించాలి.. ఆ ఎన్నికల గుర్తుని జనంలోకి తీసుకెళ్ళాలి.. ఇలా చాలా పనులున్నాయ్. తెలుగు నాట చిరంజీవికి సాధ్యం కాలేదు, పవన్ కళ్యాణ్‌కీ సాధ్యం కాలేదు.
తమిళనాడులో అయితే, విజయ్‌కాంత్ రాజకీయాల్లోకి వచ్చి బోల్తా కొట్టేశాడు. తెలుగులో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు ఏ స్థాయి క్రేజ్ వుంటుందో.. తమిళనాడులో రజనీకాంత్‌కీ అంతే. అయితే, తమిళనాడులో రజనీకాంత్‌కి ‘నేటివిటీ’ సమస్య కూడా వుంది. అదే అతనికి పెద్ద సమస్య కాబోతోంది.
అయితే, తలైవా రజనీకాంత్‌కి అలాంటి చిన్న చిన్న అడ్డంకులు పెద్దగా ఇబ్బంది పెట్టబోవన్నది అభిమానుల వాదన. సినిమాల్లో రజనీ ఏం చేసినా చెల్లుతుంది. మరి, రాజకీయాల్లోనో.! శతృవులు పెరిగిపోతారు.. ఇప్పటిదాకా పొగిడినోళ్ళే, ఇకపై తిట్టడం మొదలు పెడ్తారు. అన్నిటికీ రజనీకాంత్ సిద్ధమవ్వాల్సి వుంటుంది.
చూద్దాం, రజనీకాంత్ పొలిటికల్ ‘స్టామినా’ (Rajnikanth Political Power) ఏ స్థాయిలో వుంటుందో.!