‘బొమ్మరిల్లు’ ఫేం హీరో సిద్దార్ధ్, తెలుగులో ప్రస్తుతం ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. సినిమా విషయాల్ని పక్కన పెడితే, హీరో సిద్దార్ధ్ పేరు తమిళ రాజకీయాల్లో (Siddharth Faces Huge Political Shock) హాట్ టాపిక్ అయ్యింది. కొందరు వ్యక్తులు హీరో సిద్దార్ధ్ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో పెట్టేశారట. దాంతో, పాపం సిద్ధార్థ్ బెదిరింపు ఫోన్ కాల్స్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడట.
తన ఫోన్ నెంబర్ లీక్ అవడానికి కారణం భారతీయ జనతా పార్టీయేనని సిద్దార్ధ్ ఆరోపించడంతో దుమారం మరింత ముదిరి పాకాన పడింది. మరోపక్క హీరో సిద్దార్ధ్ (Siddharth Faces Huge Political Shock) ఫిర్యాదు మేరకు పోలీసులు అతనికి, అతని కుటుంబ సభ్యులకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.
సోషల్ మీడియా వేదికగా ఎవరన్నా ప్రశ్నిస్తే చాలు అధికారంలో వున్న పార్టీలు, ఆయా పార్టీల మద్దతుదారులు.. వ్యక్తిగత దూషణలకు దిగడం, భౌతిక దాడులకు పాల్పడటం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. ఇది ఓ రాష్ట్రానికో, ఓ పార్టీకో పరిమితమైన వ్యవహారం కాదు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
దేశంలో ప్రతి వ్యక్తికీ భావ ప్రకటనా స్వేచ్ఛ వుంది. అధికారంలో వున్నవారిని విమర్శించినంతనే దాడులు చేస్తారా.? అన్న ప్రశ్న ప్రజాస్వామ్యవాదుల నుంచి ఉత్పన్నమవుతోంది. మరోపక్క, పనిగట్టుకుని విమర్శలు చేస్తూ, ప్రభుత్వాల ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్న వాదనలూ అధికార పార్టీల నుంచి వ్యక్తమవుతుండడం మామూలే.