దేశంలో కరోనా వైరస్ (కోవిడ్ 19) సునామీలా ముంచెత్తుతోంది. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ప్రతిరోజూ మూడున్నర వేల మంది దాదాపుగా ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల సంఖ్యలో కొత్త కేసులు ప్రతిరోజూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ (Covid 19 Shock for IPL Indian Premiere League) సమంజసమా.?
మామూలుగా అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్, కొంతమేర దేశ ప్రజలకు ఊరటనిస్తోంది. న్యూస్ ఛానళ్ళలో నిత్యం కరోనా వార్తలే. కరోనా గురించిన మంచి సమాచారమైతే సమస్య లేదు.. కానీ, స్మశానాలు ఖాళీ లేవ్.. జనం పిట్టల్లా రాలిపోతున్నారు.. అంటూ ‘పగలిపోయే వార్తలతో’ జనం గుండెలు బద్ధలైపోయేలా చేస్తున్నాయి మీడియా సంస్థలు. వీటికి తోడు కొత్త కొత్త పుకార్లు.. జనాన్ని మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
నిజమే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని, జనం ఆలోచనలు కరోనా వైరస్ నుంచి క్రికెట్ ఆట వైపు, కాస్తంత వినోదం వైపు డైవర్ట్ అవుతున్నాయి. ఇంట్లో కూర్చున్నవారికి కాస్తంత మనశ్శాంతి దొరుకుతోంది. కానీ, ఆ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా కరోనా వైరస్ సెగ నుంచి తప్పించుకోలేకపోతోంది.
సిబ్బంది సహా ఆటగాళ్ళు కరోనా బారిన పడుతుండడంతో, వున్నపళంగా ఐపీఎల్ ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై ఇంకా బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఆటగాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వస్తే, దానికన్నా ఐపీఎల్ ఆపేయడమే బెటర్. ప్రాణం కంటే ఆట (Covid 19 Shock for IPL Indian Premiere League) మిన్న కాదు కదా.
