నిన్న ఓ పార్టీలో వుంటారు.. నేడు ఇంకో పార్టీలో వుంటారు.. రేపు మరో పార్టీలో వుంటారు. ఇదీ నేటి రాజకీయం. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. అన్ని రాజకీయ పార్టీలదీ అదే తంతు. అందుకే, రాజకీయాల్లో మార్పు (Positive Change In Politics) అనేది సాధ్యం కావడంలేదు.
ఎన్నికలొస్తే, ఈక్వేషన్స్ మరీ ఛండాలంగా తయారవుతాయ్. టిక్కెట్టు కోసం ఒకే రోజు మూడు నాలుగు పార్టీల గడపలు తొక్కే నాయకుల్ని చూస్తున్నాం. ఇలాంటోళ్ళు రాజకీయాల్లో ఓ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తారని ఎలా అనుకోగలం.?
ఓ పార్టీ నుంచి గెలుస్తారు.. ఇంకో పార్టీలోకి దూకేస్తారు. నొప్పి కలిగితే, అవతలోడ్ని ‘లుచ్ఛా వెధవ’ అని చట్ట సభల సాక్షిగా తిట్టడానికీ వెనుకాడ్డంలేదు. ఇంతా చేసి, వాళ్ళు చూసేది కూడా అదే ‘లుచ్ఛా’ పని.. అన్న విషయం జనానికి అర్థమవుతున్నా, రాజకీయాల్లో మార్పు దిశగా ప్రజలూ సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
Also Read: ఎన్నికల సిత్రం: ఓటేస్తే ఏడాదికి కోటి, హెలికాప్టర్, రాకెట్టు.. ఫ్రీ.!
పార్టీ మారడమంటేనే రాజకీయ వ్యభిచారం.. అని ఒకప్పుడు నినదించిన రాజకీయ నాయకులు, ఆ తర్వాత నిస్సిగ్గుగా పార్టీ మార్చేసిన వైనాన్ని చూస్తున్నాం. ఎన్నికలెప్పుడొచ్చినా, ఓటరుని నోటుతో కొనేస్తున్నారు.. లేదంటే భయపెడుతున్నారు.. ఇవేవీ కాకపోతే, ఫేక్ ఓటర్లనూ తయారు చేస్తున్నారు.
రాజకీయాలు మారాలి.. అవినీతి లేని సమాజం కావాలి.. అని యువతకు మళ్ళీ ఈ నాయకులే హితోపదేశం (Positive Change In Politics) చేస్తారు. చెప్పేవి శ్రీరంగనీతులు.. దూరేవి డాష్ డాష్ అన్నట్లుగా తయారైంది పరిస్థితి.
రాజకీయం అంటే అధికారం మాత్రమే.. నేటి రాజకీయ నాయకులకి. గతంలో పరిస్థితి వేరు. రాజకీయాల్లోకి వచ్చాం.. కోట్లు ఖర్చు చేసి గెలిచాం.. గెలిచాక ఏదో ఒక పదవి దక్కించుకున్నాం.. ఖర్చు పెట్టిన సొమ్ముకి పదింతలు సంపాదించాం.. ఇప్పుడున్న రాజకీయాల్లో రాజకీయ నాయకుల ఆలోచన.
అంతే తప్ప, రాజకీయం అంటే ప్రజా సేవ అన్న విషయం ఎంతమందికి గుర్తుంది.? యధా రాజ.. తథా ప్రజ.. అంటారుగానీ.. ప్రజలే రాజకీయాల్లో అవినీతిని ప్రోత్సహిస్తున్నప్పుడు.. రాజకీయ నాయకులెందుకు అవినీతిలో కూరుకుపోరు.? ప్రజలు ప్రోత్సాహమే అవినీతి రాజకీయ నాయకులకి కొండంత బలం. అదే ప్రజలకు పెను శాపం.