Table of Contents
దోపిడీ.. నిలువు దోపిడీ.! దోచుకోవడమంటే డబ్బును దోచుకోవడమే కాదు. ధన, మాన, ప్రాణాల్లో దేన్ని దోచుకున్నా దోపిడీ కిందే లెక్క. వ్యక్తిగత వివరాల దోపిడీ (Pegasus Spyware Attack On Indian Democracy) సైతం క్షమించరాని నేరం. కానీ, మారిన ప్రపంచంలో ఎవరి వ్యక్తిగత గోప్యతకూ భరోసా లేదు. అసలు వ్యక్తిగత వివరాలనేవి ఈ రోజుల్లో బహిరంగ రహస్యం.
అన్నింటికీ ఆధార్ కార్డుతో లింకు పెట్టాల్సిందే. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయకుండా ఏ పనీ జరగడం లేదీ రోజుల్లో. ప్రతి చిన్న అవసరానికి ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, డ్రైవింగ్ లెసెన్స్.. ఇలా గుర్తింపు కార్డులు ఇస్తే కానీ, పనవ్వడం లేదు. అవన్నీ చాటు మాటుగా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.
ఈ దోపిడీ అత్యంత హేయం..
జిరాక్స్ సెంటర్ల నుండీ, బ్యాంకుల నుండీ.. ఇలా అన్ని చోట్ల నుండీ మన వ్యక్తిగత సమాచారం సైబర్ టెర్రరిస్టులకు చేరిపోతోంది. ఇదంతా ఓ ఎత్తు. తీవ్రవాదాన్ని అడ్డుకునేందుకు, నేరాలను అదుపు చేసేందుకూ ప్రభుత్వాలు పెట్టే అధికారిక నిఘా పక్క దారి పడితే, ప్రజల వ్యక్తిగత సమాచారం దోపిడీకి గురైతే, జరిగే నష్టం అంచనాలకందదు.
దురదృష్టం ఏంటంటే, నష్టం జరిగిపోయింది. పెగాసస్ స్పైవే ప్రపంచం మీద దాడి చేసింది. ఇజ్రాయెల్ సంస్థ రూపొందించిన ఈ స్పైవే కొన్ని దేశాలకు ఉపయోగపడుతోంది. ఆయా ప్రభుత్వాలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తోంది. ఇక్కడే దీని దుర్వినియోగంపై ఆందోళన బయలుదేరింది.
ఈ-దోపిడీ.. బాధితులెవరంటే..
భారతదేశంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఫోన్ నెంబర్, ఆయన కుటుంబ సభ్యుల సమాచారం హ్యాకింగ్ చేయబడింది. కొందరు కేంద్ర మంత్రులకీ ఇదే షాక్ తగిలింది. బోలెడంత మంది జర్నలిస్టులు పెగాసన్ బాధితులయ్యారట. వివిధ పార్టీలకు చెందిన నేతలదీ అదే పరిస్థితి. దేశాన్ని కరోనా కంటే దారుణంగా కుదిపేస్తున్న సమస్య ఇది.
మొబైల్ ఫోన్ తెరిస్తే, భయమేస్తోంది. అందులో సమాచారం ఎవరైనా దోచేశారా.? మనకు తెలియకుండా, మనల్ని మన ఫోన్ కెమెరాతో చూస్తున్నారా.? మన మాటల్ని వింటున్నారా.? ఇలా ఎన్నో అనుమానాలు చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ప్రాథమిక హక్కులేవీ.?
ఇదెక్కడి పైత్యం.? ఇదెక్కడి దారుణం.? మన జీవితాలు ఎవరి చేతుల్లోకో వెళ్లిపోవడమేంటీ.? అసలు పెగాసన్ స్పైవే దేశం మీద దాడి చేసిన మాట నిజమేనా.? కాదా.? ప్రభుత్వం ఈ విషయమై ప్రజలకు భరోసా ఇవ్వాల్సి ఉంది. 140 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది. జీవించే హక్కుకు సంబంధించిన విషయమిది.
ప్రాధమిక హక్కుల్ని భారతీయుడు కలిగి ఉన్నాడా.? లేడా.? ఉంటే, ఈ పెగాసన్ స్పైవే భారతీయుల మీద ఎలా దాడి (Pegasus Spyware Attack On Indian Democracy) చేయగలుగుతోంది.? ఒక స్పై వేర్.. భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లే లెక్క. ఎందుకిలా.? ఈ పాపం ఎవరిది.? దేశ నాయకత్వం, దేశ ప్రజలకు వ్యక్తిగత గోప్యత విషయమై ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతుంది.?
ఈ పెగాసన్ స్పైవే వైరస్‌కి వ్యాక్సిన్ కనిపెట్టడం సాధ్యమేనా.? జస్ట్ ఆస్కింగ్.