వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సుదీర్ఘ పాదయాత్ర చేసి.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేశారు.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు వైఎస్సార్ కుమార్తె షర్మిల (YS Sharmila Padayatra In Telangana), తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేయబోతున్నారు.
‘పాదయాత్రలు చేస్తే అధికారం వస్తుందా.?’ అన్న ప్రశ్నకు, ‘కేవలం పాదయాత్రలతోనే అధికారం వచ్చేయదు..’ అని షర్మిల స్వయంగా ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. అంటే, పాదయాత్ర తర్వాత రాజకీయ సమీకరణాలు ఎలా వుంటాయన్నదానిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఓ అవగాహన వుందన్నమాట.
Also Read: అపరిచితులు: అప్పుడు కేసీయార్, ఇప్పుడు షర్మిల.!
అన్నట్టు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర చేశారు. ఆయనకూ పాదయాత్ర రాజకీయంగా బాగానే కలిసొచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. మరోపక్క, హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా పాదయాత్ర చేసి, మధ్యలో అనారోగ్యం కారణంగా బ్రేక్ ఇచ్చారు.
ఇంకోపక్క, అతి త్వరలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయబోతున్నారట. ఇలా నాయకులంతా పాదయాత్రల బాట పడితే.. పోలీసుల పరిస్థితేంటి.? నాయకుల పాదయాత్రలకు రక్షణ కల్పించడం ఎంతటి కష్టమైన వ్యవహారమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కాగా, షర్మిల గతంలో కూడా పాదయాత్ర చేశారు.. అయితే, అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం. ఈసారి షర్మిల తన కోసం పాదయాత్ర చేస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా. కొత్త పార్టీ అయిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని, షర్మిల (YS Sharmila Padayatra In Telangana) తెలంగాణలో ఎలా నిలబెడతారు.? ఆమె ఎలా నిలబడతారు.? అన్నది కాలమే నిర్ణయించాలి.