మొత్తం ఓటర్లలో సగం మంది ఓటేయడానికే రావట్లేదంటే, దాన్నొక ‘ఎన్నిక’ అనగల‘మా’.? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో ఇష్టమొచ్చినట్లుగా తిట్టుకుంటున్నారు. వీళ్ల గోల సామాన్యులకెందుకు.? మేం సినీ నటులం కనుక ఏ ఛండాలం చేసినా మమ్మల్ని చూడాల్సిందే అని జనం మీద బలవంతంగా ఈ ‘మా’ (MAA Elections 2021)ఎన్నికల పైత్యాన్ని రుద్దడమేంటీ.?
గట్టిగా వెయ్యి మంది ఓటర్లు (సభ్యులు) కూడా లేని ‘మా’ అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే, ఎవరికి లాభం.? ఆ సంగతి సభ్యులకీ తెలుసు. అందుకే సగం మంది ఓటేయడానికే రారు. సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చినట్లు ‘మా’ ఎన్నికల్లో ఇరు పక్షాలు హామీలు ఇచ్చేశాయి. రేపొద్దున్న ఎవరు గెలిచినా, ఆ హామీలు నెరవేర్చడానికి నానా పాట్లు పడాలి. అసలు ఆ హామీలు నెరవేర్చడమే అసాధ్యం.
తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల్ని దేబురిస్తారట. నిధుల సమీకరణ కోసం ఇంకేవేవో చేసేస్తారట. అంత సమర్ధత స్టార్ హీరోలకు లేకనా.? వాళ్లెవరూ ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టట్లేదు.? విష్ణు కావచ్చు.. ప్రకాష్ రాజ్ కావచ్చు. వీళ్ల ప్యానెల్స్‌లో ఉన్న మిగతా సినీ జనాలు కావచ్చు.. అందరికీ వాస్తవమేంటో తెలుసు. తెలిసీ ‘మా’ సభ్యుల్ని మభ్యపెడుతున్నారు. తెలుగు జనాల్ని వెర్రివెంగళప్పల్ని చేస్తున్నారు.
మీడియాకి ఎక్కడం వల్ల ‘మా’ ఎన్నికల్లో అదనంగా ఒక్క ఓటు కూడా పడదని తెలిసి రచ్చకెక్కుతున్నారంటే, వీళ్లకసలు ఇంగిత జ్ఞానం ఉందనుకోవాలా.? లేదనుకోవాలా.? ‘మా’ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది వేరే చర్చ. కానీ, ‘మా’ అంటే, జుగుప్స అనే స్థాయికి ఈ సినీ రాజకీయాన్ని దిగజార్చేశారు.
పరభాషా నటులతో కుప్పలు తెప్పలుగా సినిమాలు తెలుగులో తెరకెక్కతున్నాయి. ఆ పరభాషా నటీ నటులకు ‘మా’ సభ్యత్వం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ‘స్థానికత’ అన్న చర్చ అర్ధం లేనిది. ఆ అర్ధం లేని అంశం చుట్టూ రచ్చ జరగడం అస్సలేమాత్రం సమర్ధనీయం కాదు.
కులం, మతం, ప్రాంతం, భాషా.. వీటి గురించి మాట్లాడుతున్నారంటే, అసలు వీళ్లకి ‘మా’ (MAA Elections 2021) పట్ల కనీస అవగాహన ఉందనుకోవాలా.?
కొసమెరుపేంటంటే, పోలింగ్ రోజున.. లేని నవ్వుని బలవంతంగా మొహాన పులుముకుని మరీ సినీ రాజకీయ ప్రత్యర్థులు ఒకర్నొకరు కౌగలించుకోవడం. మేమంతా ఒక్కటే, మా నాటకాల్ని చూసి నిజమనుకుని నమ్మిన మీరే వెర్రి వెంగళప్పలన్నట్టుంది సినీ జనాల తీరు.