Middle Class Family.. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అని ఓ తెలుగు సినిమాలో మాంచి పాటొకటుంది. ‘అమ్మో ఒకటో తారీఖు’ అంటూ ఓ అదిరిపోయే టైటిల్‌తో ఎప్పుడో సినిమా వచ్చేసింది. ఆ పాటలు విని, అలాంటి సినిమాలు చూసి, అప్పట్లో ఏదో సినిమాలే అనుకున్నారు కానీ, ఇప్పుడయితే, నిత్య నరకమే.
రాత్రి పడుకుని, తెల్లారాకా లేచి పెట్రోలు బంక్‌కు వెళితే, గూబ గుయ్యమైపోతోంది. ఇది నిత్య నిరకం అంటే. 15 రోజులకోసారి ఇంట్లో గ్యాస్ బండను చూస్తే బెంగొచ్చేస్తోంది. ఇదో టైపు గుండె పోటు. నెల ముగిసి, కొత్త నెల వస్తోందంటే, వీపు విమానం మోత మోగిపోతోంది.
Middle Class Family భయపెడుతున్న ‘ఒకటి’
చిత్రమేంటంటే, ప్రతి నెలా ఒకటో తారీఖున చాలా మారిపోతున్నాయ్. వాతలు తప్ప ఉపశమనాల్లేని జీవితమైపోయింది. ఫోన్లో వాట్సాప్ దగ్గర్నుంచీ, బ్యాంకుల్లో అదనపు ఛార్జీల దాకా అన్నింటా రీ సౌండ్ వచ్చేస్తోంది. 100 ఏళ్ల ఆయుష్షు ఈ వాతల కారణంగా సగానికి పడిపోతోంది.

ఎప్పుడు.? ఎలా.? బాదేస్తారో తెలీని పరిస్థితి. కింది తరగతి, మధ్య తరగతి, పై తరగతి.. తేడాల్లేవ్. దాదాపుగా అందరికీ చెంప ఛెల్లుమనిపోతోంది. పెట్రోలు రేటు మండిపోతోంటే, అసలు పెట్రోల్‌తో 90 శాతం మందికి పైగా ప్రజలకు అవసరమే లేదంటాడు ఓ రాజకీయ మూర్ఖుడు. ఇదీ నేటి భారతం.
దోపిడీకి వారం, వర్జ్యం లేనే లేదు
వెనకటికి పిల్లలు పుట్టాకా, పొట్ట మీద ఎర్రగా కాల్చిన ఇనుముతో వాతలు పెట్టేవారు. ఎందుకిలా అంటే, రోగాలకు మందు.. అనేవారు. దానికేమి తీసిపోవట్లేదిప్పటి వాతలు. ప్రజల్నిలా కాల్చుకు తింటున్నారెందుకు.? అన్న ప్రశ్నకు పాలకుల సమాధానమేంటో తెలుసా.? మిమ్మల్ని ఉద్ధరించడానికేనని.
నెలకో, మూన్నెళ్లకో, ఆర్నెళ్లకో, ఏడాదికో ఓసారి గతంలో పెట్రో ధరలు పెరిగితే, ఇప్పుడు రోజువారీ పెరుగుతూ భయపెడుతున్నట్లే, ఇకపై అమ్మో ఒకటో తారీఖుపై అమ్మో తెల్లారిందా.? అని ప్రతి రోజూ భయపడాల్సిన (Middle Class Family) దుస్థితికి ఎంతో దూరంలో లేం మనం.