Hyper Aadi.. తెలుగు బుల్లితెర వీక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది. తనదైన కామెడీతో అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ అయిపోయాడు బుల్లితెరపై. అక్కడి నుంచి వెండితెర వైపుగా ఆది ప్రయాణం సాగింది.. వెండితెరపైనా మంచి మంచి అవకాశాలే దక్కించుకుంటున్నాడు హైపర్ ఆది.
తాజాగా హైపర్ ఆది మీద దాడి జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది.
Hyper Adi.. అసలేం జరిగిందంటే..
ఇటీవల ఓ కామెడీ షోలో ఆది చేసిన స్కిట్, ఓ సినీ నటుడ్ని ఉద్దేశించి వెటకారంగా రూపొందించారనీ, ఆ హీరో అభిమానులు కొద్ది రోజులుగా హైపర్ ఆది కోసం వెతికారనీ, అది తెలుసుకుని ఆది అజ్ఞాతంలోకి వెళ్ళాడనీ, అతన్ని ఎలాగోలా పట్టుకుని చితక్కొట్టారనీ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయి.

ఈ వ్యవహారంపై హైపర్ ఆది స్పందించాడు. కమెడియన్లు రైజింగ్ రాజు, శాంతి స్వరూప్‌లతో కలిసి ఓ వీడియో విడుదల చేశాడు. తనను ఎవరూ కొట్టలేదనీ, తన కోసం ఎవరూ వెతకడంలేదనీ, తాను దాక్కోలేదనీ హైపర్ ఆది చెప్పాడు.
తన మీద తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని చెబుతూ, అలా రాసేవాళ్ళకి డబ్బులు అవసరమైతే, తాను కష్టపడి సంపాదించి వాళ్ళని పోషించేందుకు సిద్ధమని కూడా హైపర్ ఆది చెప్పుకొచ్చాడు.
ఇంత హైపర్ అవసరమా.?
కామెడీ షోస్‌లో ప్రముఖ నటీనటుల్నో, లేదంటే తోటి కమెడియన్లనో అనుకరిస్తూ, వారి మీద సెటైర్లు వేస్తూ.. పచ్చి, పిచ్చి వల్గర్ కామెడీ సైతం చేసే హైపర్ ఆది, తన మీద వచ్చే గాసిప్స్‌ని జీర్ణించుకోలేకపోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.?
Also Read: సాయి పల్లవి బాటలో Ketika Sharma
వాళ్ళ మీదా వీళ్ళ మీదా సెటైరికల్ కామెడీ చేస్తూ హైపర్ ఆది (Hyper Aadi) అటు పేరు, ఇటు డబ్బు సంపాదిస్తున్నాడనే విమర్శల సంగతి సరే సరి. సో.. సోషల్ మీడియాలో అయినా.. వెబ్ మీడియాలో అయినా వచ్చే వార్తల మీద.. అలా రాసేవారి సంపాదన మీదా హైపర్ ఆది సెటైర్లు వేయడమేంటో.. ఇదే మరి కలికాలం అంటే.!