Indian Political System.. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. వస్తుంటాయ్, పోతుంటాయ్.. మళ్లీ వస్తుంటాయ్, మళ్లీ పోతుంటాయ్.. ఎన్నికలు, రాజకీయం, ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం.. ఇదంతా మళ్లీ ఇంకో ప్రసహనం. స్వాతంత్ర్యం సిద్ధించాకా ఇన్నేళ్లలో ఏం సాధించాం.?
సాధించకనేం.? చాలానే సాధించాం. సాధించినదెక్కువా.? కోల్పోయినదెక్కువా.? మళ్లీ ఇదో చిక్కు ప్రశ్న. ఎంతో సాధించాం. ఎంతో కోల్పోయాం. ప్రాధమిక హక్కులున్నాయ్. ఆ హక్కులకి మోకాలడ్డే దుష్ట శక్తులూ వున్నాయ్.
ప్రజాస్వామ్యం వుంది. ఆ ప్రజాస్వామ్యాన్ని పాతరేసే నీచ, నికృష్ట రాజకీయమూ వుంది. దేశంలో ఎప్పటికైనా మంచి మార్పు వస్తుందన్న ఆశా వుంది.. ఈ బతుకులింతే.. ఇక మారవంతే.. అనే నైరాస్యమూ వుంది.
Indian Political System .. కరెన్సీ నోట్లతో ఓట్లను నిర్లజ్జగా కొనేసే రాజకీయమిది.!
కరెన్సీ నోటుతో నిర్లజ్జగా ఓటును కొనేసే రాజకీయ నాయకుడిది తప్పా.? లేదంటే నిస్సిగ్గుగా తన ఓటునీ, తన భవిష్యత్తునీ అమ్మేసుకుంటున్న ఓటరుది తప్పా.? తప్పు కొందిరిది. శిక్ష మాత్రం అందరికీ.

వెయ్యి కోసమో, రెండు వేల కోసమో.. ఓటుని అమ్మేసుకోవడం అంటే ఐదేళ్ల భవిష్యత్తుని నాశనం చేసుకోవడమే అని ఓటరుకు ఎప్పుడు తెలిసొస్తుంది.? తన వల్ల నాశనమైపోతున్న దేశంలో తానూ వున్నానన్న సోయ తాను నాశనం చేసిన వ్యవస్థ.. తననూ ఏదో రోజు నాశనం చేస్తుందన్న ఇంగితం రాజకీయ నాయకుడికి ఎప్పుడు కలుగుతుందో.
నమ్మి ఓట్లేసి గెలిపిస్తే, రాజకీయ వ్యభిచారిలా మారి గోడ దూకేసే రాజకీయ నాయకులు రాజ్యమేలుతున్న ఈ ప్రజాస్వామ్యంలో సామాన్యుడి బతుకు దుర్భరం అవకుండా బాగుపడుతుందా.?
ఖద్దరు నేర్చిన కప్పల తక్కెడ సూత్రం..
రాజకీయం అంటే, ప్రజాసేవ కాదు, కప్పల తక్కెడ వ్యవహారం. లాభ, నష్టాల గలీజు యాపారం. దోపిడీకి అత్యంత సులభమైన మార్గం. ఇదీ నేటి రాజకీయం.
Also Read: వెర్రి వెంగళప్పాయ్.! ఓటుకీ, సినిమా చూడ్డానికీ లింకేమిట్రా.?
వేదికలెక్కి నీతులు చెప్పే రాజకీయ నాయకుడి చరిత్ర ఏంటో, వేదిక కింద ఆ నీతుల సోది వింటోన్న ప్రతి ఒక్కడికీ తెలుసు. కానీ, మధ్యం మైకంలోనో, డబ్బు మైకంలోనో కులం, మతం, ప్రాంతం అనే మాయలోనో ఒక అసమర్ధున్ని, ఒక దుర్మార్గున్ని అందళమెక్కించడానికి అస్సలు సిగ్గుపడని జన తత్వం ఈ దేశానికి శాపం.
ప్రశ్నించాల్సిన మేధావి అమ్ముడుపోతున్నాడు. తమ జీవితాలు నాశనమైపోతున్నా గొంతు పెగల్చి సామాన్యుడు నిలదీయలేకపోతున్నాడు. స్వాతంత్ర్యానికి ముందు, బ్రిటీష్ అరాచకాలకు ఎదురొడ్డి ధైర్యంగా నిలబడిన ఆ ధైర్యం.. ఆ పోరాటతత్వం.. ఆ తెగువ.. ఇప్పుడేదీ.? అర్ధమవుతోందా.? ఏం కోల్పోయామో.
– yeSBee