Bheemla Nayak Mogilayya Padmasri.. ఈ తరం కుర్రాళ్లకి సంగీతం అంటే, వెర్రి కూతలు మాత్రమే. పాడే వాడు ఏం వాగుతున్నాడో తెలీదు. వాయించేవాడు ఏం బాదుతున్నాడో తెలీదు. రాసేవాడు ఏం పీకుతున్నాడో తెలీదు. అయినా ఆ పాట హిట్టయిపోతోంది. ఫలానా సంగీత దర్శకుడికి కోట్ల రెమ్యునరేషన్ అట. ఫలానా పాటగాడికి లక్షల్లో రెమ్యునరేషన్ అట. ఇదే గొప్ప.
కానీ, సంగీతం అంటే ఆ కథే వేరు. ప్రకృతిలోకి తొంగి చూస్తే ఓ నిశ్శబ్ధం. ఆ నిశ్శబ్ధంలోంచి సన్నని గాలి సయ్యాట. ఆ సంగీతం చెవులకు మాత్రమే కాదు, మనసుకీ ఆనందాన్నిస్తుంది. అలా ప్రకృతిలోంచే ఎన్నెన్నో సంగీత పరికరాలు పుట్టుకొస్తాయ్.
మట్టిలో మాణిక్యాలెక్కడ.? పెంట పురుగులెక్కడ.?
మట్టిలో మాణిక్యాల్లాంటి చాలా కొద్ది మంది, సంగీతంలో ఓనమాలు నేర్చుకోకపోయినా సంగీత ప్రపంచంలో రారాజులుగా వెలుగొందుతుంటారు. ఈ క్రమంలో కొన్ని పరికరాలు పెద్దగా ప్రాచుర్యంలోకి రాకుండానే కాల గర్భంలో కలిసిపోతుంటాయ్.
తాను చనిపోయేలోపు, తన వాద్య పరికరం ప్రాచుర్యంలోకి రావాలని పరితపించిన మట్టిలోని మాణిక్యమే ‘మొగిలయ్య’. ‘12 మెట్ల కిన్నెర’ వాయిద్యం ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన దర్శనం మొగిలయ్యను ‘భీమ్లా నాయక్’ సినిమా కారణంగానే గుర్తు పడుతున్నాం.

నిజానికి మొగిలయ్య చాలా ఏళ్లుగా కిన్నెర వాయిద్యంపై తనకు తెలిసిన సంగీతాన్ని ఏదో ఒక రూపంలో వీలైనంత మందికి వినిపించే ప్రయత్నం చేస్తూనే వున్నాడు. మొగిలయ్య పాటకు తగిన ఆదరణ దక్కక కూలీ, నాలీ చేసుకుని బతకాల్సి వచ్చింది ఒకప్పుడు.
Bheemla Nayak Mogilayya Padmasri.. శెహబాష్ మొగిలయ్యా.!
ఓ దశలో కిన్నెరను వదలేయాలనుకున్నాడు కూడా. అలా వదిలేసి వుంటే, ‘12 మెట్ల కిన్నెర’ అనే వాయిద్యమే ఎవరికీ తెలిసి వుండేది కాదు. అసలు మొగిలయ్య అంటేనే తెలిసి వుండేది కాదు. ఇప్పుడు ఈ మట్టిలో మాణిక్యం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది. ఇది మొగిలయ్యకు దక్కిన గౌరవం. మొగిలయ్య పాటకు దక్కిన గౌరవం. మొగిలయ్య 12 మెట్ల కిన్నెరకు దక్కిన గౌరవం.
Also Read: పవ‘నిజం’ శుద్ధ అబద్ధం.. ‘మార్పు’ అసాధ్యం.?
అన్నింటికీ మించి, ఇంత గొప్ప కళాకారుడి పేరు ముందు చేరుకున్న పద్మ పురస్కారానికి దక్కిన అత్యంత అరుదైన గౌరవం. అవును.. పురస్కారాల ద్వారా వ్యక్తులకు గౌరవం పెరగడం అనేది ఓ ఎత్తు. ఆయా వ్యక్తులకు ఆయా పురస్కారాలు దక్కడం ద్వారా.. ఆ పురస్కారాల గౌరవం పెరగడం ఇంకో ఎత్తు.
చివరగా.. ఒకప్పుడు పద్మ పురస్కారాలంటే ‘కొనుక్కుంటే వస్తాయ్..’ అన్న అభిప్రాయం చాలామందిలో వుండేది. కానీ, మొగిలయ్యకి (Bheemla Nayak Mogilayya Padmasri) అవార్డులు కొనుక్కునేంత స్తోమతు లేదు. ఆ పురస్కారమే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది.!