Akhanda2 Thaandavam Review.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్ జంటగా నటించిన ‘అఖండ-2’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
‘అఖండ’ సినిమాకి సీక్వెల్ కావడంతో, సహజంగానే ‘అఖండ-2’ సినిమాపై నందమూరి అభిమానులు బోల్డన్ని అంచనాలు పెట్టుకున్నారు.
ప్యాన్ ఇండియా సినిమాగా.. ఆ మాటకొస్తే, అంతకు మించిన సినిమాగా.. ‘అఖండ-2’ సినిమా ప్రమోషన్స్ కూడా చేశారు.
సరిగ్గా విడుదలకు ముందు, ఆర్థిక పరమైన ఇబ్బందులు చిత్ర నిర్మాణ సంస్థకు రావడంతో, చివరి నిమిషంలో సినిమా విడుదల ఆగిపోయింది.. వారం తర్వాత, థియేటర్లలోకి రావడం జరిగిపోయాయ్.
ఇంతకీ, ‘అఖండ-2’ సినిమా ఎలా వుంది.? అసలేంటి కథ.? నందమూరి అభిమానుల్ని అలరించించేలా వుందా.? కథలోకి వెళ్ళిపోదాం పదండిక.
Akhanda2 Thaandavam Review.. కథా కమామిషు ఏంటి.?
భారత దేశంపై చైనా బయోవార్ చేస్తుంది.. అదీ, పవిత్ర గంగా నదిలో వైరస్ కలపడం ద్వారా. దానికి విరుగుడు కనిపెడుతుందో యువ సైంటిస్ట్.!
ల్యాబ్‌ని ధ్వంసం చేసి, యువ సైంటిస్ట్‌ని కూడా అంతం చేసేందుకు చైనా నుంచి కొందరు వచ్చి తీవ్ర ప్రయత్నాలు చేస్తారు.
ఈ క్రమంలో దేశాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు అఘోరా. తెరపై చిత్ర విచిత్రమైన విన్యాసాలు జరుగుతుంటాయి. కథ ఎక్కడో మొదలై, ఎటెటో వెళ్ళిపోతుంటుంది.
అనంతపురం నుంచి మంచు కొండలు.. చైనా.. ఏవేవో జరిగిపోతుంటాయి తెర మీద. అసలు కథేంటి.? అని జుట్టు పీక్కోవాల్సిందే సినిమాని తెరపై చూస్తున్నవాళ్ళంతా.
బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే, మ్యాథ్స్.. ఫిజిక్స్.. కెమిస్ట్రీ వుండవ్.. దబిడి దిబిడే.. అని అభిమానులు అంటుంటారు. కానీ, కథ వుండాలి కదా.? ప్చ్.. అదే లేదిక్కడ.!
ఎటు కావాలనుకుంటే అటు తిప్పేసిన బోయపాటి..
బోయపాటి తనకు నచ్చినట్లు సినిమాని ఎటు కావాలంటే, అటు తిప్పేకున్నాడు. బాలయ్య సంగతి సరే సరి. తనకు నచ్చింది చేసుకుంటూ పోయాడు.
దేశ భక్తి అంటారు.. వైరస్ అంటారు.. లాజిక్కులు వెతక్కూడదంటారు. దైవం అంటారు.. దెయ్యం అంటారు.. అంతా కలగాపులగం వ్యవహారమే.!
తెరపై తాము చూస్తున్నదేంటో కూడా అర్థం కాని దుస్థితిలో ప్రేక్షకులు థియేటర్లలో హాహాకారాలు చేశారంటే పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకోవచ్చు.
బహుశా, కంటెంట్ ఇలా వుంది కాబట్టే, సినిమా రిలీజ్ వారం రోజులు వెనక్కి వెళ్ళిందనుకోవాలా.?
ఈలోగా సినిమాపై సింపతీ క్రియేట్ చేయాలన్న దురాలోచన జరిగిందా.? అన్న ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో మెదులుతున్నాయిప్పడు.
దేవుడు.. అంటే, నార్త్‌లో ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారనుకున్నారు. దేశ భక్తికి దైవ భక్తి కూడా తోడైతే.. అన్న కోణంలో, కథని ఇష్టమొచ్చినట్లు తిప్పేశాడు దర్శకుడు.
అసలు ఏం డైలాగులు చెబుతున్నాడో, ఎందుకు ఆ డైలాగులు చెబుతున్నాడో.. సినిమా చేస్తున్నప్పడు బాలయ్య ఆత్మ విమర్శ చేసుకుని వుండాల్సింది.
దర్శకుడు బోయపాటికి బాలయ్యని చూస్తే పూనకమొచ్చేస్తుంది. ఆ పూనకంలో, అసలు తాను ఓ దర్శకుడినన్న విషయమూ మర్చిపోతాడు. కథ అవసరం సినిమాకి.. అని అస్సలు అనుకోడు.
ఇక, సంగీత దర్శకుడు తమన్, బీభత్సంగా వాయించి పారేశాడు సంగీతాన్ని. పాటలు తేలిపోయాయ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా ఓకే. మిగతాదంతా రొద.! చెవులు పగిలిపోయాయ్ అంతే.
సినిమాకి ఐటమ్ సాంగ్ అవసరం కాబట్టి.. అన్నట్లుంది, సినిమాలో హీరోయిన్ సంయుక్త మీనన్ పాత్ర. ‘జాజికాయ్..’ పాట, తెరపై తేలిపోయింది.
విచ్చలవిడిగా ఖర్చు చేసేశారు సినిమా కోసం. ఖచ్చంతా వృధా ప్రయాసే.! సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్.. ప్చ్, చాలావరకు కత్తిరించి పారేాయల్సిన సీన్స్ వున్నాయంటే అతిశయోక్తి కాదు.
నటీనటుల్లో ఎవరి గురించీ మాట్లాడుకోవాల్సినంత అవసరమే లేదు.! బాలయ్యతో బోయపాటి చేయించిన ‘అతి’ అంతా ఇంతా కాదు.!
చివరగా..
థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడ్ని ఎలా హింసించాలి.? అని బహుశా రీసెర్చ్ చేసి మరీ, ఈ ‘అఖండ-2’ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించినట్లున్నాడు.
తనదైన నటనతో, ఆ హింసకి సరికొత్త గ్లామర్ అద్దాడు హీరో నందమూరి బాలకృష్ణ.
థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలైపోవాలనుకున్నాడుగానీ, అలా చేయడం ద్వారా ప్రేక్షకుల చెవుల్లోంచి రక్తం కారే ప్రమాదముందని సంగీత దర్శకుడు తమన్ ఊహించలేకపోయాడు.
