బాలీవుడ్ భామ అలియా భట్, తెలుగులో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చేస్తోన్న విషయం విదితమే. కానీ, అలియా భట్ (Alia Bhat To Walk Out From RRR) ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ తాజాగా మరోసారి గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కూడా పలుమార్లు అలియాపై ఈ తరహా గాసిప్స్ వచ్చాయి.
అయితే అలియా మాత్రం, తాను ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో నటిస్తున్నాననీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది పలు సందర్భాల్లో. అలియా ఎన్నిసార్లు ఖండిస్తున్నా, ఆమెపై నెగెటివ్ గాసిప్స్ మాత్రం ఆగడంలేదు. తాజాగా ‘కరోనా వైరస్’ని బూచిగా చూపి, అలియాపై పుకార్లు షురూ చేశారు కొందరు.
ఈ విషయమై ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర దర్శక నిర్మాతలు ఇంకా స్పందించాల్సి వుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో నటిస్తోంది అలియా భట్. హీరోయిన్ పాత్ర అనడం కంటే.. అంతకు మించిన ప్రత్యేకత వున్న పాత్ర అని అలియా పలు సందర్భాల్లో చెబుతూ వచ్చింది ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి.
రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి తొలిసారిగా నటిస్తోన్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఇది. రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ సహా పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి, జులై 30న ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల చేస్తామని, సినిమా ప్రారంభోత్సవం రోజు చెప్పారు.
అయితే, అనివార్య కారణాలతో అది కాస్తా, 2021 సంక్రాంతికి వాయిదా పడింది. కానీ, తాజా పరిణామాలు చూస్తోంటే, 2021 సమ్మర్‌కిగానీ ఈ సినిమా రెడీ అయ్యే అవకాశాలు కన్పించడంలేదు. ఇదిలా వుంటే, ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఓ ‘స్పెషల్ టీజర్’ బయటకొచ్చింది.
త్వరలో యంగ్ టైగర్ స్పెషల్ టీజర్ రాబోతోంది. కరోనా ఎఫెక్ట్ లేకపోయుంటే, మే 20నే ఎన్టీఆర్ టీజర్ వచ్చేది. షూటింగ్ స్టార్ట్ అయితే, పది పదిహేను రోజుల్లోనే టీజర్ విడుదల చేయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నాడట.