Anasuya Bharadwaj Online Games.. ఆన్‌లైన్ గేమ్స్.. జేబులు గుల్ల చేస్తున్నాయ్.. కొంపలు ముంచేస్తున్నాయ్.. కొన్నిసార్లు ప్రాణాలు తీసేస్తున్నాయ్ కూడా.
ఇలాంటి ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో అప్రమత్తంగా వుండాలని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వున్నారు.
కానీ, సెలబ్రిటీలు మాత్రం ‘ఆడండి.. ఆడి చావండీ..’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. డబ్బులిస్తే చాలు, ఏ ఛండాలాన్నయినా ప్రమోట్ చేస్తాం అన్నట్లుగా వుంది సెలబ్రిటీల తీరు.
సమాజం వల్ల ఆయా వ్యక్తులకు సెలబ్రిటీ అనే ట్యాగ్ దొరుకుతోంది. మరి, ఆ సమాజానికి మేలు చేయకపోయినా ఫర్వాలేదు. కీడు చేయకపోతే చాలు అన్న ఇంగితం సెలబ్రిటీలుగా చెప్పుకునేవారికి లేకపోవడమేంటీ.?
Anasuya Bharadwaj Online Games.. నీతులు.. రోతలు.!
పొద్దున లేస్తే నీతులు చెప్పే కొందరు సెలబ్రిటీలు.. చెప్పేవి డాష్ నీతులు, దూరేవి డాష్ గుడిసెలు.. అన్నట్లు వ్యవహరిస్తే ఎలా.? కొందరు సినిమా స్టార్లు పాన్‌పరాగ్, గుట్కా వంటి వాటికి సైతం బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం దారుణం.
లిక్కర్ బ్రాండ్లను ప్రమోట్ చేయడంలోనూ సెలబ్రిటీలు సిగ్గు పడట్లేదు. తమకు లభించిన స్టార్‌డమ్‌ని క్యాష్ చేసుకోవడం ఒక్కటే వాళ్లకి తెలిసిన విద్య.

ఈ మధ్య సోషల్ మీడియాలో కొందరు సెలబ్రిటీలు ఆన్‌లైన్ గేమ్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్‌లనీ, ఇంకోటనీ కొన్ని యాప్ప్ అందుబాటులో వున్నాయ్. అవి సెలబ్రిటీల ద్వారా ప్రకటనలు గుప్పిస్తున్నాయ్.
వాటి మోజులో పడి, జీవితాన్ని నాశనం చేసుకుంటోంది నేటి యువత. తాజాగా బుల్లితెర బ్యూటీ, సినీ నటి అనసూయ ఓ యాప్‌ని ప్రమోట్ చేస్తుంది.
పోకర్, తీన్ పత్తి.. లాంటి కాసినో తరహా గ్యాంబ్లింగ్ ఆడి డబ్బులు సంపాదించండి.. అంటూ బాధ్యతా రాహిత్యంతో ఆ యాప్ తరపున ప్రచారం చేస్తోంది.
ఇదేం పద్ధతి అనసూయా.?
దీనికి కౌంటర్ ఇస్తూ, ఇదేం పద్థతి.? అంటూ నెటిజనం అనసూయపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి గ్యాంబ్లింగ్ వ్యవహారాలకి ఎంతో మంది యువత బలైపోతున్న విషయం అనసూయకి (Anasuya Bharadwaj) తెలియదా.?
పొద్దున్న లేస్తే నీతులు చెబుతావ్ కదా.. ఇదేం పద్థతి.? అని అనసూయని చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీలు ఇలాంటివి చేస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చర్యలు తీసుకుంటున్నట్లు.?
Also Read: ప్రాంక్ స్టార్స్: బూతులేనా వీళ్ళకి భవిష్యత్తు.!
ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ కాసినో వంటి వాటిపై ఎందుకు పోలీస్ వ్యవస్థ ఉక్కుపాదం మోపడం లేదు.? తమకు సోషల్ మీడియాలో వున్న లక్షలాది మంది ఫాలోవర్లను గ్యాంబ్లింగ్, కాసినో వంటి వాటి వైపు ప్రోత్సహించేవారిని ఏమనాలి.?
డబ్బులిస్తే చాలు.. సమాజానికి చేటు చేసే పనైనా సరే, దాన్ని ప్రమోట్ చేసేద్దాం.. అనుకునేవాళ్లతోనే సమాజానికి ఎక్కువ ప్రమాదం.