Table of Contents
Andhra Pradesh Capital Politics.. రాష్ట్రానికి రాజధాని వుండాలి.. వుండి తీరాలి.! అది అమరావతి అవుతుందా.? విశాఖపట్నం అవుతుందా.? కర్నూలు అవుతుందా.? మరొకటి అవుతుందా.? అన్నది వేరే చర్చ.
అసలంటూ రాజధాని లేని రాష్ట్రమేంటి.? ఎందుకీ దుస్థితి.? దేశంలో ఏ రాష్ట్రానికీ లేని సమస్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎందుకొచ్చింది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయ్యింది. అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలూ అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపాయి.
చట్ట సభల సాక్షిగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయ్యింది. రాజధానిగా అమరావతి ‘నోటిఫై’ అయ్యింది కూడా. కేంద్రం కూడా అమరావతిని రాజధానిగా గుర్తించింది.
ప్రధాని శంకుస్థాపన చేసినా కూడా..
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇప్పటికైతే అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని. విభజన చట్టం ప్రకారం పదేళ్ళకు మించకుండా హైద్రాబాద్, తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఉమ్మడి రాజధాని.
పదేళ్ళకు మించకుండా అంటే.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నోటిఫై అయ్యాక, ‘ఉమ్మడి రాజధాని’ హక్కుని హైద్రాబాద్ మీద ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్టే.
సరే, టెక్నికల్ అంశాలు తర్వాత. రాష్ట్రానికైతే అమరావతే రాజధాని. అలాంటి రాజధానిలో గడచిన మూడున్నరేళ్ళలో కనీసపాటి అభివృద్ధి ‘రాజధాని’ పేరుతో ఎందుకు జరగలేదు.?
Andhra Pradesh Capital Politics.. ఒక్కటైతే సరిపోదు.. మూడు ముక్కలు కుదరదు..
ఒక్కటి సరిపోదు, మూడు రాజధానులైతేనే సమతౌల్యం అంటోంది వైసీపీ. ఆ దిశగా మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చారు. కానీ, అది చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది.
తాము తీసుకొచ్చిన బిల్లుని తామే చింపేసుకోవాల్సి వచ్చిన దరిమిలా, రాజధాని వర్సెస్ మూడు రాజధానుల వ్యవహారంపై ‘మొండితనానికి’ వెళ్ళాల్సిన అవసరమే లేదు.
కానీ, వైసీపీ తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్టు వ్యవహరిస్తోంది. అదే అసలు సమస్య.
ప్రస్తుతం విషయం కోర్టు పరిధిలో వుంది. సర్వోన్నత న్యాయస్థానం ఏం తేల్చుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
రాజధాని రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister Ys Jagan Mohan Reddy), ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. కోర్టు పరిధిలో వున్న అంశాలపైనా మాట్లాడుతున్నారు.. ప్రకటనలు చేస్తున్నారు.
విశాఖే (Visakhapatnam) రాజధాని.. అక్కడికే నా మకాం మార్చేస్తానని ముఖ్యమంత్రి ఈ మధ్యనే చెప్పారు. దాంతో అంతా అవాక్కయ్యారు.
మూడు రాజధానుల అంశం మిస్ కమ్యూనికేట్ అయ్యిందనీ.. పరిపాలనా రాజధాని విశాఖ మాత్రమేననీ.. కర్నూలులో హైకోర్టు ప్రధాన బెంచ్ మాత్రమే వుంటుందన్నది ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కొత్త వాదన.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం, ‘బుగ్గన అలా ఎందుకన్నారో తెలియదు.. మా విధానం మూడు రాజధానులే..’ అంటున్నారు.
కోర్టు పరిధిలోని అంశాలపై ఎవరికి తోచిన రీతిలో వారు మాట్లాడేయొచ్చా.? ఇదెంతవరకు సబబు.? అని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
Read Also: యుద్ధ విమానంపై హనుమాన్.! ఎందుకీ కాంట్రవర్సీ.!
రాజధాని అంటే రాజకీయ పార్టీల ‘ఆధిపత్య పోరు’కి సంబంధించిన విషయం కాదు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం.