Andhra Pradesh Liquor Politics: సారాయి.. కాస్త నీటుగా చెప్పుకుంటే మద్యం.. అదేనండీ లిక్కర్.! ఆరోగ్యానికి ఇదెంత హానికరమో వైద్యులు నిత్యం మొత్తుకుంటూనే వున్నారు.
మద్యపానం ఆరోగ్యానికి హానికరమంటారు.. కానీ, ఆ మద్యాన్ని జనం మీద రుద్దుతూనే వుంటారు. అదే మరి మద్యం తాలూకు ప్రత్యేకత.
అందరూ ట్యాక్స్ పేయర్లే.! ఎందుకంటే, ఏ వస్తువు కొనుగోలు చేసినా ట్యాక్స్ వుంటుంది. కానీ, తాగుబోతులు మాత్రమే ‘మేం ట్యాక్స్ పేయర్స్’ అని గర్వంగా చెప్పుకుంటారు. ఔను మరి, తాగుబోతులే లేకపోతే ప్రభుత్వాలకు రావాల్సినంత ఆదాయం రాదు కదా. అదీ అసలు సంగతి.
‘మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకూడదని ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోంది.. అలా ఆదాయం రాకుండా పోతే, సంక్షేమ పథకాలు ఆగిపోతాయ్..’ అంటూ ముఖ్యమంత్రిగారు చిత్ర విచిత్రమైన వాదనని శాసన సభ సాక్షిగా చేసేశారు. ఎంత మేతావితనం.! టేక్ ఎ బౌ అనాల్సిందేనండోయ్.!
Andhra Pradesh Liquor Politics సంక్షేమ సారాయి.!
ఎట్టెట్టా.! సంక్షేమ పథకాల్ని అమలు చేయాలంటే, మద్యం అమ్మకాల ద్వారా ఘనమైన ఆదాయం రావాలి.? మరి, మద్య నిషేధమంటూ ఎన్నికల వేళ కబుర్లెలా చెప్పారయ్యా.? అంటే, ప్చ్.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పరాయె.
మద్యం సేవించినోళ్ళంతా ఒకలానే వుంటారని అనలేం. కానీ, తాగాక రోడ్డెక్కి చిందులేసేవారు చాలామందే వుంటారు. రోడ్డు ప్రమాదాలకు కారకులయ్యేవారు, హత్యలు చేసేవారు, అత్యాచారాలకు పాల్పడేవారు.. ఇలా చాలా కథ వుంది.
లిక్కర్ సేవించి వాహనాన్ని నడిపితే చలాన్ విధిస్తారు పోలీసులు. ప్రభుత్వానికి అలాక్కూడా ఆదాయం వచ్చి పడుతుంది. ఇవన్నీ ఎందుకు, మొత్తంగా మద్యాన్ని నిషేధించేస్తే.? ఇంకా నయ్యం, అలా చేస్తే ప్రభుత్వ ఆదాయం పడిపోదూ.?
సారాయి అమ్మకాలు.. సొమ్ములు.!
ప్రభుత్వమంటే ప్రజల కోసం పని చేయాలి. ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకోవడం కాదు. దురదృష్టమేంటంటే, ప్రభుత్వాలు ఇప్పుడు బిజినెస్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లున్నాయ్.
అన్ని శాఖలకూ టార్గెట్లు పెట్టి వసూళ్ళకు దిగుతున్నాయ్.! ఎవరు అధికారంలో వున్నా ఇదే తంతు.. అంటూ రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారంటే, అందులో తప్పేముంది.?
Also Read: సాములోరి రాజకీయం.! ఏం ఖర్మ పట్టింది బాసూ.!
ఆయా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటి ద్వారా తమ సొంత ప్రచారం చేసుకుంటున్న రాజకీయ నాయకులు, పార్టీలు.. ప్రజల్ని సోమరిపోతుల్లానే కాదు, వ్యసనపరులుగా కూడా మార్చేస్తున్నారు.
ప్రజల వ్యసనాల ద్వారానే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే.. వారెవ్వా ఇదీ ప్రజాస్వామ్యానికి అసలు సిసలు అర్థం.!