Andhra Pradesh YSRCP Change.. 2024 ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాలకుగాను అన్ని నియోజకవర్గాల్నీ గెలుచుకుంటామనే ధీమా పదే పదే వ్యక్తం చేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో మొత్తం 151 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని, అధికార పీఠమెక్కిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జన రంజకమైన పాలన అందిస్తున్నారన్నది వైసీపీ వాదన.
కానీ, కింది స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి. వైఎస్ జగన్ చెప్పిన ప్రత్యేక హోదా రాలేదు, ’రాజన్న ప్రారంభించాడు.. రాజన్న బిడ్డ పూర్తి చేస్తాడు‘ అని చెప్పిన పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు.
మద్య నిషేధం అమలు కాలేదు, ఇంకా చాలా చాలా జరగలేదు. అయితే, చెప్పినవాటితోపాటు చెప్పనివీ చేశామని వైసీపీ అంటోంది.
గడప గడపకీ మన ప్రభుత్వం అన్నారు.. ఇంకోటేదో అంటున్నారు.. ఎన్ని చేసినా, వైసీపీలో ఓటమి భయం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.
Andhra Pradesh YSRCP Change.. మార్పు వెనుక అసలు కోణం.. భయమేనా.?
అత్యద్భుతమైన.. జనరంజకమైన పాలన అందిస్తే, సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం వైసీపీకి ఏమొస్తుంది.?
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పదవికీ అలాగే పార్టీకీ రాజీనామా చేయడంతో దుమారం చెలరేగింది. పది మందికి పైగా నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల్ని మార్చింది వైసీపీ.
ఈ మార్పు దేనికి సంకేతం.? ఇంకో నలభై వరకు మార్పులు వుంటాయని వైసీపీ చెబుతుండడం గమనార్హం. అంటే, ఈ మార్పుల వెనుక ఓటమి భయం వున్నట్లే కదా.. అన్నది విపక్షాల వాదన.
‘అది మా పార్టీ అంతర్గత వ్యవహారం..’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. అదే నిజమైతే, ఇతర రాజకీయ పార్టీల పొత్తుల వ్యూహాలు.. వాటి అంతర్గత వ్యవహారం కదా.? వాటిపై వైసీపీ ఎందుకు ఉలిక్కిపడుతోంది.?
ఒక్కటి మాత్రం నిజం. ఎవర్ని ఎన్నికల బరిలోకి దింపాలన్నది ఆయా పార్టీల అంతర్గత వ్యవహారమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. గెలుపు గుర్రాలకే ఏ పార్టీలు అయినా సీట్లు ఇవ్వాలనుకుంటాయి.
సీట్లను మార్చడం.. అంటే, ముమ్మాటికీ ఓటమి భయమే.! మార్పు మంచిదేనా.? మార్పు వల్ల లాభం కంటే, నష్టం ఎక్కువ జరుగుతుందా.? అన్నది ముందు ముందు తేలుతుంది.