Table of Contents
Android Kattappa Review.. రోబోటిక్ యుగంలో వున్నాం మనమిప్పుడు. రెస్టారెంట్‌కి వెళితే, ఓ రోబో వచ్చి మనకేం కావాలో ఆర్డర్ తీసుకుంటుంది. దాన్ని మనకి తెచ్చిస్తుంది. ఆసుపత్రికి వెళితే బ్లడ్ శాంపిల్స్ సేకరించడం దగ్గర నుంచీ, సమయానుసారం ఏమేం మందులు వేసుకోవాలో అదే చూసుకుంటుంది.
అసలు టెక్నాలజీ అంటేనే నచ్చని ఓ పెద్దాయన అనుకోని పరిస్థితుల్లో ఓ రోబోతో కలిసి వుండాల్సి వస్తే, ఆ రోబోతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతే ఏమవుతుంది.? ఇది తెలుసుకోవాలంటే, ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ను చూడాల్సిందే.
మలయాళ బొమ్మ.. ఆ కిక్కే వేరప్పా.!
మలయాళంలో రూపొందిన ఈ సినిమా అసలు పేరు ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’. ఓటీటీ తిరగేస్తోంటే ఈ ఆండ్రాయిడ్ కట్టప్ప కనిపించాడు. నాలుగైదుసార్లు స్కిప్ చేసేసినా, ఎందుకో ఓసారి చూస్తే పోలా.. అనిపించింది.
కేరళ అంటే, ప్రకృతి అందాలకు నెలవు. మలయాళ సినిమాలంటే, సహజత్వానికి చాలా దగ్గరగా వుంటాయ్. అలా ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ ప్రారంభమవుతూనే మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లిపోతుంది. కుమారుడికి దూరంగా సాంకేతికతకు అందనంత దూరంగా ఓ పల్లెటూరిలో వుంటాడో పెద్దాయన.
తండ్రికి దూరంగా వుంటాడే కానీ, మనసంతా తండ్రితోనే వుంటుంది ఆ కుర్రోడికి. తండ్రికి సాయంగా వుండేందు కోసం ఓ రోబోని తీసుకొస్తాడు. ఫోను వాడడానికి కూడా ఇష్టపడని ఆ పెద్దాయన, మొదట్లో రోబోని విలన్‌లా చూస్తాడు. కానీ, ఆ రోబోకి అలవాటు పడిపోతాడు. ఎమోషనల్‌గానూ ఇద్దరి మధ్యా బాండ్ ఏర్పడుతుంది.
Android Kattappa Review.. రోబో బొమ్మ.. అనుబంధాల బొమ్మ.!
కానీ, అది ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు రూపొందించబడిన రోబో. దాన్ని తిరిగి తన కంపెనీకి అప్పగించేయాల్సి రావడంతో, అప్పటికే దానికి అడిక్ట్ అయిపోయిన తన తండ్రిని కాపాడుకోవడం కోసం ఆ కుర్రోడు పడే తపన మనసుని కట్టిపడేస్తుంది.
సినిమాలో మనకి నటీనటులెవరూ కనిపించరు. అన్నీ పాత్రలే కనిపిస్తాయ్. పాత్రల్లో ఆయా నటీనటులు జీవించేశారు. రోబోతో ఉపయోగాలు చూపిస్తూనే, వాటితో ప్రమాదం కూడా వుంటుందని చిన్నగా చెప్పి కథ ముగించేశాడు.
ఈ కట్టప్పని చూడాల్సిందే సుమీ.!
పిల్లలకు దూరంగా వుండే తల్లితండ్రులు పడే ఆవేదన, దూరంగా వున్న తండ్రిని ఆప్యాయంగా చూసుకునే కొడుకు.. ఇవన్నీ కథలో భాగంగానే వుంటాయ్. హాస్యం కూడా బలవంతంగా నెత్తిన రుద్దినట్లు వుండదు.
Also Read: సచ్చింది గొర్రె.! కొత్త వైరస్ వస్తోందహో.!
సినిమాటోగ్రఫీ ఎంతందంగా వుందంటే, ప్రతి ఫ్రేమ్ చాలా చాలా సహజంగా మనం అక్కడే వున్నట్లుగా వుంది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం. హీరోయిన్‌తో హీరోకి డ్యూయెట్లు లేవు. యాక్షన్ సన్నివేశాలు లేవు. వెకిలి కామెడీ అస్సలే లేవు. అలాంటివి ఆశిస్తే ఈ సినిమాని స్కిప్ చేసేయొచ్చు.
ఓ మంచి సినిమా చూడాలనుకుంటే మాత్రం ఈ ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ని (Android Kattappa Review) మిస్ అవ్వద్దు.
