ఆ తండ్రి స్వభావమే అంత. తండ్రే అనుకుంటే, అంతకు మించిన ఘనా పాటి ఆ కొడుకు. ఇదీ ‘SR కళ్యాణ మండపం’ (SR Kalyana Mandapam Review) సినిమాలోని రెండు ప్రధాన పాత్రల తీరు తెన్నులు. యువ నటుడు కిరణ్ అబ్బవరం, సీనియర్ నటుడు సాయికుమార్, బబ్లీ బ్యూటీ ప్రియాంక జవాల్కర్, సీనియర్ నటి తులసి ఈ సినిమాలో ప్రధాన తారాగణం.
ఓ తండ్రి.. ఓ కొడుకు.. ఈ ఇద్దరి చుట్టూ చాలా సినిమాలొచ్చాయి. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చూశాం, అంతకు ముందూ, ఆ తర్వాతా చూశాం, చూస్తూనే వున్నాం. మరి, ఈ ‘SR కళ్యాణ మండపం’ ప్రత్యేకత ఏంటట.? తండ్రితో మాట్లాడని కొడుకు, కొడుకుని అస్సలు మెచ్చని తండ్రి. భర్తని రోజూ తిట్టడమే పనిగా పెట్టుకునే భార్య. భార్యని ఈసడించుకునే భర్త. హీరోయిన్ వెంట ‘కుక్కలా’ పడే హీరో. ఆ హీరోని కుక్కలా చూసే హీరోయిన్.
బాబోయ్, ఇవేం పాత్రలు మొర్రో.. అనిపిస్తే అది మీ తప్పు కానే కాదు. ఆ పాత్రల తీరే అంత. కానీ, ఆయా పాత్రల్లో అందరూ బాగానే చేశారు. చూసేవాళ్ళకే, ఈ పాత్ర మరీ ఇంత ‘అతి’గా ప్రవర్తించడం అవసరమా.? అనిపిస్తుంటుంది. పాత్రల తీరు తెన్నుల్ని దర్శకుడు అలా మలచాడు మరి.
అసలీ కళ్యాణ మండపం గోలేంటి.? SR Kalyana Mandapam Review
తాత నుంచి వచ్చిన ఆస్తి ఓ కళ్యాణ మండపం. దాన్ని హీరో తండ్రి భ్రష్టుపట్టించేస్తాడు. ఒకానొక సందర్భంలో హీరోగారు, ఆ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం తీసుకురావాలనుకుంటాడు. మళ్ళీ ఇందులో లవ్ స్టోరీకి సంబంధించిన కాన్‌ఫ్లిక్ట్ ఒకటి. హీరోయిన్ తండ్రి షరామామూలుగానే హీరోకి విలన్.
ఓ తండ్రి, ఓ కొడుకుని మరీ ఇంత హీనంగా చూస్తాడా.? అన్న అనుమానం చాలామందికి కలుగుతుంటుంది సినిమాలో సాయికుమార్ పాత్ర తీరు తెన్నుల్ని చూసినవారికి. కథ కోసం ఓ కారణం.. అన్నట్టుంది తప్ప, అసలు తండ్రీ కొడుకుల మధ్య గొడవకు సరైన కారణమే లేదనిపిస్తుంది అందరికీ.
ఈ తరానికి కావాల్సినట్లుగా హీరో, హీరోయిన్ వెంట పడటం. హీరోయిన్, హీరోని ఈసడించుకోవడం.. హీరోయిన్ ‘అందాల ప్రదర్శన’.. తాగేసి, వాగేసి, నానా అల్లరీ చేసే హీరో అండ్ బ్యాచ్.. ఇదీ వరస. హీరో బీభత్సమైన హీరోయిజం చూపించేయడానికి కావాల్సిన ఫైట్లు, ఎట్రాక్టివ్ సాంగ్స్.. ఇలా నింపేశారు ‘SR కళ్యాణ మండపం’ సినిమా నిండా.
అంత దారుణంగా ఎలా.?
సినిమా బాగుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. అసలు ఆ తండ్రిని మరీ అంత దారుణంగా చూపించాల్సిన అవసరమేంటి.? బలమైన కారణం లేకుండా విడిపోయినట్లే.. బలమైన సన్నివేశం లేకుండా తండ్రీ కొడుకుల్ని కలిపేసి సినిమా ముగించేయడమేంటి.? అన్న ప్రశ్నలతోనే ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకొస్తాడు.
విడివిడిగా అన్ని కమర్షియల్ అంశాలూ వర్కవుట్ అయ్యాయి. అదే ఈ ‘SR కళ్యాణ మండపం’ (SR Kalyana Mandapam Review) సినిమాకి ప్లస్ పాయింట్. అదే టార్గెట్ ఆడియన్స్ అయిన యూత్‌ని కరోనా పాండమిక్ సమయంలోనూ థియేటర్లకు బాగానే రప్పించేసింది.