టెస్ట్ క్రికెట్ హిస్టరీలో.. ఆ మాటకొస్తే ఏ ఫార్మాట్‌లో అయినా.. మోడ్రన్ క్రికెట్‌కి సంబంధించి వన్ అండ్ ఓన్లీ బౌలర్.. అనిల్ కుంబ్లే.. (Anil Kumble Ten Out Of Ten) అంటారు చాలామంది క్రికెట్ వీరాభిమానులు. నిజం, అనిల్ కుంబ్లే అనగానే.. మైదానంలో బంతితో మ్యాజిక్ చేసే ఓ ఇంజనీర్ గుర్తుకొస్తాడు చాలామందికి.
అవును, కుంబ్లే.. మైదానంలోకి అడుగు పెడుతూనే, పిచ్‌ని స్టడీ చేస్తాడు. బంతి ఎక్కడ వేస్తే, ఎలా తిరుగుతుందో అంచనా వేస్తాడు. తిరిగితే పండగే, తిరగకపోయినా.. తిప్పేయడానికి చూస్తాడు. స్పిన్ బౌలింగ్‌లో అనిల్ కుంబ్లే చేసినన్ని ప్రయోగాలు బహుశా క్రికెట్‌లో ఇంకే ఇతర బౌలర్ చేసి వుండడేమో.
అందుకే, ఓ టెస్టు మ్యాచులో.. ఒకే ఇన్నింగ్స్‌లో.. ఒక్కటి తప్ప, అన్ని వికెట్లు తీసేశాడు. 11 మందే కదా ఆటగాళ్ళు.. అందులో ఒకడు ఒంటరిగా మిగిలిపోవాల్సిందే. లేకపోతే, పది కాదు.. పదకొండు వికెట్లూ కుంబ్లే ఖాతాలో పడేవే. కుంబ్లే కారణంగా ఊచకోతకు గురైన జట్టు, చిన్న జట్టేమీ కాదు.. పాకిస్తాన్ జట్టు.
పాకిస్తాన్ ఆటగాళ్ళంటే స్పిన్ బౌలింగుని ధీటుగా ఎదుర్కోగలరు. అలాంటి జట్టు మీద.. కుంబ్లే తన ప్రతాపం చూపించేశాడు. అది 1999. ఆనాటి ఆ అద్భుతం ఇప్పటికీ క్రికెట్ అభిమానుల కళ్ళ ముందు కదలాడుతూనే వుంటుంది.
కుంబ్లే అంటే పెద్దన్న..
కుంబ్లే, క్రికెట్‌కి గుడ్ బై చెప్పి చాన్నాళ్ళే అయ్యింది. బౌలింగ్ వెయ్యకపోతేనేం.. వేయిస్తున్నాడు. బారత క్రికెట్‌కి వివిధ రూపాల్లో సేవలందిస్తూనే వున్నాడు. ఇండియన్ క్రికెట్‌కి పెద్దన్న.. అనదగ్గ అతికొద్దిమందిలో అనిల్ కుంబ్లే ఒకడు. భారత క్రికెట్‌లో నవతరం ఆటగాళ్ళలో చాలామందికి అనిల్ కుంబ్లే స్ఫూర్తి. ఆట పరంగానే కాదు, వ్యక్తిత్వం పరంగా కూడా.
కెప్టెన్‌గానూ టీమిండియాకి సేవలందించిన అనిల్ కుంబ్లే.. (Anil Kumble Ten Out Of Ten) ఈ క్రమంలో ప్రత్యర్థి జట్లు మాటలతో తోక జాడిస్తే, తనదైన స్టయిల్లో చాలా పద్ధతిగా చురకలేయడం చూశాం. దటీజ్ అనిల్ కుంబ్లే. కుంబ్లే అంటే.. మాస్టర్ ఇన్ బౌలింగ్. కాదు కాదు, బౌలింగ్‌లో ఇంజనీర్. క్రికెట్‌లో అతను సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు.
దటీజ్ అనిల్ కుంబ్లే..
విజయాలకు పొంగిపోలేదు, అపజయాలకు కుంగిపోలేదు. నెత్తురోడుతూనే మైదానంలో జట్టు కోసం కుంబ్లే నిలబడ్డ సందర్భాలూ లేకపోలేదు. అందుకే, అనిల్ కుంబ్లే (Anil Kumble Ten Out Of Ten) ఎప్పటికీ చాలామందికి ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్.
పదికి పది వికెట్లు తీయడమే కాదు, భారత క్రికెట్‌లో వ్యక్తిత్వం పరంగా కూడా పదికి పది మార్కులేయించుకున్నాడు.