సాయి పల్లవి అంటేనే ఏదో మ్యాజిక్. ఆమె కళ్ళు చాలా భావాల్ని పలికించేస్తాయి అలవోకగా. బాధనైనా, ప్రేమనైనా, అల్లరినైనా.. ఆమె కళ్ళల్లో చూసెయ్యొచ్చు. సాయి పల్లవి సినిమా అనగానే, ఆమె చేసే డాన్సుల గురించి అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తారు. కానీ, అలాంటి డాన్సుల్లేని సినిమా సాయి పల్లవి నుంచి వస్తే.? అయినా ఫర్లేదు, ఆమె ఎలాగోలా మ్యాజిక్ చేసేస్తుంది.. చేసేసింది కూడా, ‘అనుకోని అతిథి’ (Anukoni Athidhi Review) సినిమాతో.
మలయాళంలో గతంలో వచ్చిన సినిమా ‘అథిరన్’ (Athiran) తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈ ‘అనుకోని అతిథి’. తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమాలో తెలిసిన మొహాలంటే, ఒకటి సాయి పల్లవి (Sai Pallavi).. ఇంకోటి ప్రకాష్ రాజ్. కానీ, సినిమా అంతా మరో క్యారెక్టర్ చుట్టూ నడుస్తుంది. ఆ క్యారెక్టర్ పోషించింది ఫహాద్ ఫాజిల్.
నిజానికి, ఇది ఫహాద్ ఫాజిల్ (Fahaad Faasil) సినిమా. ఇందులో సాయి పల్లవి (Sai Pallavi) కూడా నటించింది.. అనుకోవాలేమో. ఓ డాక్టర్, సాధారణ ప్రపంచానికి దూరంగా వున్న ఓ మానసిక వైద్య చికిత్సాలయం లాంటి ఓ ‘కోట’లోకి ప్రవేశిస్తాడు. అక్కడ, ఓ వైద్యుడుంటాడు. అతన్ని క్రూరుడిగా ఓ పాత్ర మనకి పరిచయం చేస్తుంది. అక్కడేం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియదు.
హీరో.. అదేనండీ మన డాక్టర్ బాబు.. ఆ కోటలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే వచ్చాడు. అతని మీద పలు మార్లు హత్యాయత్నం జరుగుతుంది. అక్కడే బంధీగా వున్న ఓ యువతి (సాయిపల్లవి) గురించి తెలుసుకుని, ఆమెను రక్షించాలనుకోవడమే మన హీరోగారు చేసిన పెద్ద నేరం. ఇంతకీ, మన హీరో ఆ యువతిని రక్షించాడా.? రక్షించాల్సిందే.. మరి.
వావ్.. అని తీరాల్సిందే..
నటీనట్లుల్లో ఫహాద్ ఫాజిల్ పూర్తి మార్కులు కొట్టేశాడు. అతని చూపులు, యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు మెరుపులా అతను కదలిని వైనం.. ఆయన భయపడే సందర్భం.. ఇలా ప్రతీదీ సినిమా పూర్తయ్యాక కూడా ప్రేక్షకుల్ని వెంటాడుతుంది. మానసిక సమస్యతో బాధపడుతున్న యువతిగా సాయి పల్లవి టాప్ క్లాస్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ప్రాచీన యుద్ధ కళ కలరియపట్టుని ఔపోసన పట్టేసినట్టున్నారు సాయిపల్లవి, ఫహాద్ ఫాజిల్.
విలన్ (కోటలోని వైద్యుడు) పాత్రలో అతుల్ కులకర్ణి అత్యద్భుతమైన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ప్రకాష్ రాజ్ (Prakash Raj) చివర్లో కనిపిస్తాడు. సినిమాలో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసే పాత్రలో ప్రకాష్ రాజ్ తన అనుభవాన్ని రంగరించాడు.
Also Read: సాయి పల్లవికి ‘ఫిదా’ అయ్యేదందుకే..
ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. మలయాళంలో కొన్ని సినిమాలు అంతా సజావుగానే వున్నట్టు అనిపిస్తాయి. సాధారణంగా సినిమాలు నడుస్తున్నట్టుంటాయి. అత్యద్భుతమైన ట్విస్టులతో షాకిచ్చేస్తుంటారు. అదే ‘అనుకోని అతిథి’ సినిమాలోనూ జరుగుతుంది. ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే, సినిమా చూడ్డంలో మజా వుండదు గనుక, ఆ ట్విస్ట్ ఇక్కడ పేర్కొనడంలేదు.
సినిమాటోగ్రఫీ కోసం, నేపథ్య సంగీతం కోసం కూడా ఇంకోసారి ఈ సినిమాని చూడొచ్చు. సాయిపల్లవి, ఫహాద్ ఫాజిల్ కోసమైతే ఒకటికి రెండుసార్లు చూసినా తప్పులేదేమో. అన్నట్టు మన తెలుగు హీరో తరుణ్, ‘అనుకోని అతిథి’ (Anukoni Athidhi Review) సినిమాలో హీరో పాత్రకి డబ్బింగ్ చెప్పాడు.