తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షో నాలుగో సీజన్, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రారంభమయ్యింది. ఓపెనింగ్ ఈవెంట్ బాగానే జరిగింది. హౌస్‌లోకి 16 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వీక్ డేస్‌లో షో ‘సోసో’గా సాగింది. ఫస్ట్ వీకెండ్ (Bigg Boss Telugu 4 First Weekend) మాత్రం అదిరిపోయిందంతే.!
సూర్యకిరణ్ ఎలిమినేషన్ చాలామంది ఊహించిందే. దాంతో ఆయన హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం పట్ల పెద్దగా వ్యతిరేకత కన్పించడంలేదు. కింగ్ అక్కినేని నాగార్జున, చిన్న చిన్న చురకలేసినా.. గట్టిగా ఎవరికీ ఫస్ట్ వీకెండ్‌లో క్లాసులు పీకెయ్యలేదు.
మేగ్జిమమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలనుకున్నారేమో.. ఆ స్థాయిలోనే వీకెండ్ కాన్సెప్ట్స్ సిద్ధం చేశారు. శనివారం, ఆదివారం బుల్లితెర వీక్షకులు, బిగ్‌బాస్‌కి అతుక్కుపోయారనడం అతిశయోక్తి కాకపోవచ్చు. గత సీజన్లతో పోల్చితే, ఈసారి కంటెస్టెంట్స్ గ్లామరస్‌గా కన్పించారు వీకెండ్ సందర్భంగా.
శనివారం ఎపిసోడ్ అదుర్స్ అనుకుంటే, ఆదివారం నిజంగానే ‘ఫన్ డే’ అయ్యింది. కంటెస్టెంట్స్‌ని రెండు గ్రూపులుగా (ఆడ, మగ) విభజించి, ‘జుగల్బందీ’ నిర్వహించారు. అందులో కంటెస్టెంట్స్ పోటీ పడి డాన్సులేయడం గమనార్హం. గంగవ్వతోనూ స్టెప్పులేయించేశారు.
అలేఖ్య హారిక, లాస్య, దివి, మోనాల్ గజ్జర్, సుజాత, మోనాల్ గజ్జర్ డాన్సులు అదరగొట్టేశారు. నోయెల్, అఖిల్, సోహెల్, అభిజిత్, సూర్యకిరణ్ తదితరుల డాన్సులూ సూపర్బ్. అవన్నీ ఓ ఎత్తు… టీవీ9 దేవి డాన్స్ ఇంకో ఎత్తు. ప్రొఫెషనల్ డాన్సర్‌గా ఆమె సత్తా చాటిందనడం అతిశయోక్తి కాదు.
మోనాల్ గజ్జర్ వీకెండ్ ఎపిసోడ్‌లోనూ ‘ట్యాప్’ బంద్ చేయలేకపోయింది. ఎవిక్ట్ అయిన సూర్యకిరణ్‌తో హౌస్‌లో ఆమె అటాచ్‌మెంట్ అలాంటిది. ఇక, సర్‌ప్రైజ్ ఎంట్రీ కుమార్ సాయి.. ఈ వీకెండ్ ఎపిసోడ్‌కి జోష్ తీసుకొచ్చింది.
చాలా సినిమాల్లో కమెడియన్‌గా కనిపించిన కుమార్ సాయి, డైరెక్షన్ గురించి తన ప్లాన్స్ చెప్పాడు. నాగార్జునని డైరెక్ట్ చేయాలని వుందన్నాడు. స్టేజ్ మీద కుమార్ సాయి కాన్ఫిడెన్స్ చాలామందికి షాక్ ఇచ్చిందనడం నిస్సందేహం.
హౌస్‌లోకి సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చేశాడు. షోలో గెలుస్తాననే నమ్మకాన్ని నాగ్ సాక్షిగా వ్యక్తం చేశాడు. మొత్తంగా చూస్తే, తెలుగు బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫస్ట్ వీకెండ్ సూపర్ హిట్ అని చెప్పక తప్పదు.