Bezawada Durgamma Power Cut.. విజయదశమి వంటి పర్వదినాల సమయంలో, వీవీఐపీలు పెద్దయెత్తున బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళతారు.!
ప్రోటోకాల్ దర్శనాల సందర్భంగా, సామాన్య భక్తులకు రక్త కన్నీరే.! ఔను, ప్రముఖ హిందూ దేవాలయాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి.!
దేవుడి ముందర సాధారణ భక్తులు వేరు, వీఐపీ భక్తులు వేరు.! ఇదీ దేవాలయాల పాలక మండళ్ళ తీరు. ప్రభుత్వంలో ఎవరున్నా, రాజకీయ నిరుద్యోగులకు, పాలక మండళ్ళలో పెద్ద పీట వేయడం తెలిసిన విషయమే.
ఈ క్రమంలో, సామాన్యుడికి దైవ దర్శనం కనాకష్టమైపోతోంది పర్వదినాల్లో.! సాధారణ రోజుల్లోనూ, దేవాలయాలకు వీఐపీల తాకిడి చాలా చాలా ఎక్కువగానే వుంటోంది.
మంత్రి పదవి కంటే కూడా, టీటీడీ పాలక మండలిలో పదవులకు గిరాకీ ఎక్కువ. దుర్గమ్మ సన్నిధిలోనూ, పాలక మండలి సభ్యులంటే.. ఆ క్రేజ్ వేరు.!
ఇదొక లాభసాటి వ్యాపారం.. అంటే, అది అతిశయోక్తి కాదేమో.! అందుకే, పాలక మండలి పదవుల కోసం పోటీలు పడుతుంటారు రాజకీయ నాయకులు.
ఇప్పుడిదంతా ఎందుకంటే, హిందూ దేవాలయాల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల కోట్లు, వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది.
కానీ, దేవాలయాలు ప్రభుత్వానికి విద్యుత్ బకాయిలు చెల్లించలేని దుస్థితిలో వున్నాయంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
తాజా ఉదాహరణ ఏంటంటే, బెజవాడ దుర్గమ్మ దేవాలయం, దాదాపు మూడు కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల బకాయిలతో వార్తల్లోకెక్కింది.
బకాయిలు చెల్లించలేదని, విద్యుత్ శాఖ ఏకంగా ‘పవర్ కట్’ చేసేసింది దుర్గమ్మ దేవస్థానానికి. ఎంత దారుణమైన విషయమిది.?
సమాచార లోపంతోనే, ఈ దారుణం జరిగిందంటూ బుకాయిస్తే సరిపోదిక్కడ.! ఎందుకంటే, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి.!
పాలక మండలి ఏం చేస్తోంది.? ప్రభుత్వం ఏం చేస్తోంది.? సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు.? వీటిపై తక్షణ విచారణ జరగాలి, తప్పు ఎవరు చేశారో, వారికి తగిన శిక్ష పడి తీరాల్సిందే.
రాజధాని అమరావతికి కూత వేటు దూరంలో వున్న ప్రముఖ దేవాలయం బెజవాడ దుర్గమ్మ దేవస్థానం. రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయం ఇది.
ఇంతటి ప్రముఖ దేవాలయాలనికి ‘పవర్ కట్’ అనే దరిద్రాన్ని ఆపాదించడం మహాపాపం.! ఇందులో అన్యమతస్తుల కుట్ర ఏమైనా దాగి వుందా.? అన్నదానిపై భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రోటోకాల్ కక్కుర్తితో సమాన్య భక్తుల్ని ఇబ్బందులకు గురిచేసే పొలిటికల్ ‘వీవీఐపీ భక్తులు’, దుర్గమ్మకి ఇంత అన్యాయం జరిగితే మౌనం దాల్చడం శోచనీయం.
