Table of Contents
Bhagavanth Kesari Review.. నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
‘శ్రీలీల హీరోయిన్‌గా నేను హీరోగా ఓ సినిమా చేస్తానని ఇంట్లో చెబితే, గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ.. అని నా కొడుకు మోక్షజ్ఞ అన్నాడు..’ అంటూ బాలయ్య, సినిమా ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
ఇంతకీ, భగవంత్ కేసరి సంగతేంటి.? శ్రీలీల పాత్ర ఏంటి.? కాజల్ అగర్వాల్ సంగతేంటి.? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.!
కథలోకి వెళితే.. విజ్జి అలియాస్ విజయలక్ష్మి (శ్రీలీల)ని శక్తివంతమైన మహిళగా తయారు చేయాలనుకుంటాడు భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ).
ఈ క్రమంలో విలన్‌తో భగవంత్ కేసరి, విజ్జి కోసం తలపడాల్సి వస్తుంది. ఇంతకీ, విజ్జి ఎవరు.? ఆమె కోసం భగవంత్ కేసరి పడ్డ కష్టమేంటి.? అదంతా తెరపై చూడాల్సిన కథ.
Bhagavanth Kesari Review.. ఎవరెలా చేశారు.?
నందమూరి బాలకృష్ణ లౌడ్ పెర్ఫామెన్స్ అందరికీ తెలిసిందే. కాకపోతే, ఇందులో సెటిల్డ్ పెర్ఫామెన్స్ చూస్తాం. అలాగని, ఆగ్రహావేశాలు ఆ పాత్రలో వుండవని కాదు.
బాలయ్య బాడీ లాంగ్వేజ్ మారిందంటే, ఈ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడిని అభినందించి తీరాలి.

శ్రీలీల నుంచీ మంచి నటనను రాబట్టాడు దర్శకుడు. కాజల్ అగర్వాల్ పాత్రకి తక్కువ స్కోప్ వుంది. విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ ఓకే. మిగతా పాత్రలన్నీ తమ పాత్రల పరిధిలో ‘మమ’ అనిపిస్తాయి.
సినిమా నిడివి కాస్త ఎక్కువ అనిపిస్తుంది. అదే పెద్ద కంప్లయింట్. చాలా సీన్స్, గతంలో ఏదో సినిమాలో చూసేశామన్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది.
డైలాగ్స్ కూడా ఎప్పుడో విన్నాం కదా.. అనిపిస్తుంటాయి. కొన్ని సీన్స్ అయితే బలవంతంగా ఇరికించినట్లున్నాయ్ తప్ప, సినిమాలో భాగమనిపించవు.
స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల రేసీగా వుంటే, చాలా చోట్ల డల్లుగా సాగింది. తెలంగాణ మాండలికంలో బాలయ్య చెప్పే డైలాగులు బావున్నాయ్.

తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అవుతుంటుంది మామూలుగా అయితే. ఈ సినిమాలో ఆ బ్యాక్‌గ్రౌండ్ వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు.
సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ విభాగం కొంత అలసత్వం ప్రదర్శించిందేమో అనిపిస్తుంది. డైలాగ్స్ కొన్ని బావుంటే, చాలా డైలాగ్స్ పేలవంగా సాగాయ్.
నిర్మాణ విలువల పరంగా చూసుకుంటే, ఎక్కడా రాజీ పడని వైనం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. రిచ్‌గానే సినిమాని తెరకెక్కించారు.
చివరగా..
నందమూరి బాలకృష్ణ ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారా.? అదైతే, ప్రస్తుతానికి సస్పెన్స్. దసరా సీజన్, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం వుండడం కొంత ప్లస్.
నందమూరి బాలకృష్ణని కొత్త కోణంలో చూపిస్తానని చెప్పిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఆ క్రమంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు.
కానీ, బలవంతంగా కొన్ని చోట్ల కామెడీని ఇరికించే ప్రయత్నం చేయడం, సాగతీత సన్నివేశాలు.. ఇవన్నీ, సినిమాలో వేగాన్ని తగ్గించాయ్.
ఫైనల్ టచ్..
భగవంత్ కేసరి.. కాస్త ఫర్లేదుగానీ.!