Bheemla Nayak Vs Daniel Shekar రెండు సింహాలు ఒకదానితో ఒకటి పోరాడుతోంటే ఎలా వుంటుంది.? నటీ నటులు కాదు, తెరపై పాత్రల మధ్య పోటీ.. అనే స్థాయికి ప్రేక్షకులు లీనమైపోతే.! అది ‘అయ్యపనుమ్ కోషియమ్’ సినిమా ప్రత్యేకత.
మలయాళ సినిమా ‘అయ్యపనుమ్ కోషియం’ చూసినవారిలో ఎక్కువమంది బహుశా తెలుగు ప్రేక్షకులే వుంటారేమో. ఎందుకంటే, తెలుగులో ఈ సినిమా రీమేక్ అవుతోంది.. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్నారు.
‘అయ్యపనుమ్ కోషియమ్’ (Ayyapanum Koshiyum) తెలుగులోకి ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) పేరుతో రూపొందుతున్న విషయం విదితమే. టైటిల్ విషయంలో తెలుగులో దర్శక నిర్మాతలు, పవన్ కళ్యాణ్ పాత్ర వైపే మొగ్గు చూపారు. కారణం ఏంటి.? అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. మలయాళంలో మాత్రం, రెండు పాత్రల పేర్లూ కలిసి వచ్చేలా టైటిల్ పెట్టారు.
ఇటీవల ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి, హీరో పాత్రని ఓ స్పెషల్ ప్రోమో ద్వారా రివీల్ చేసిన విషయం విదితమే. పవన్ కళ్యాణ్.. (Pawan Kalyan) ఆ పాత్రలో చెలరేగిపోయారు.. కొన్ని సెకెన్ల నిడివి గల వీడియోతో.. ప్రకంపనలు సృష్టించేశారు పవన్ కళ్యాణ్. మరి, డేనియల్ శేఖర్ పాత్రలో.. రానా (Rana Daggubati) ఎలా వుండబోతున్నాడు.?
ఇదిగో, రానా కూడా వచ్చేశాడు. తెల్లటి పంచె కట్టుతో, కారు మీదకెక్కి.. డేనియల్ శేఖర్ పాత్రలో రానా అదరగొట్టేశాడు. వీడియో ప్రోమోలో అయితే, రానాని చూసినవారంతా ‘బాహుబలి’ సినిమాలోని భళ్ళాల దేవ తర్వాత, అంతటి పవర్ వున్న రోల్.. అంటూ ఆయనపై ప్రశంసలు గుప్పించేస్తున్నారు.
మలయాళ నటుడు పృధ్వీరాజ్, ‘అయ్యపనుమ్ కోషియం’ సినిమాలో చేసిన పాత్రని రానా చేస్తున్నాడు తెలుగులో. పృధ్వీరాజ్, ‘డేనియల్ శేఖర్’ ప్రోమో విడుదల చేస్తూ, తనను మించి రానా ఆకట్టుకుంటాడనే నమ్మకాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.