Bhuj The Pride Of India Review.. సినిమాని ఎలా చూడాలి.? హీరోయిన్ గ్లామర్ కోసం సినిమా చూడాలా.? హీరో చేసే వీరోచితమైన ఫైట్ల గురించి చూడాలా.? కమర్షియల్ సినిమాల లెక్కలు వేరు, ఆర్ట్ సినిమాల ఆలోచనలు వేరు. ఓ సినిమాతో సమాజానికి మంచి చేయాలనే ఆలోచన చిత్ర దర్శక నిర్మాతల్లో కలిగితే, కమర్షియల్ లెక్కలేసుకోకుండా సినిమా తెరకెక్కిస్తే.. దానికి దేశభక్తి కథాంశమైతే, అది వాస్తవ చరిత్రను మనకి పరిచయం చేస్తే.! అలాంటి సినిమానే ‘భుజ్’ – ది ప్రైడ్ ఆఫ్ ఇండియా.
అజయ్ దేవగన్ (Ajay Devgn) ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి. స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కర్ణిక్ పాత్రలో కనిపించారాయన. విజయ్ కర్ణిక్ ఓ పోరాట యోధుడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం పనిచేశారు. 1971లో ఇండియా – భారత్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో భుజ్ ఎయిర్ స్ట్రిప్ బాధ్యతలు నిర్వహించారు విజయ్ కర్ణిక్.
పాకిస్తాన్ యుద్ధ విమానాల దెబ్బకి, భుజ్ ఎయిర్ స్ట్రిప్ దెబ్బ తింటే, 300 మంది స్థానిక మహిళల సాయంతో తిరిగి ఆ ఎయిర్ స్ట్రిప్‌ని పునరుద్ధరించారు విజయ్ కర్ణిక్. వింగ్ కమాండర్‌గా ఆయన ఆ తర్వాత ప్రమోట్ అయ్యారు. ఈ సాహస వీరుడి సాహసాన్ని ‘భుజ్ – ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ పేరుతో సినిమాగా తెరకెక్కించారు.
ఇది కథ కాదు.. రియల్ హీరోల దేశభక్తి..
సినిమా చూస్తున్నంత సేపూ, చాలామందికి చాలా డౌటానుమానాలు వచ్చేస్తుంటాయి. నిజంగా ఇలా జరుగుతుందా.? సినిమా కోసం అనవసరపు హంగులు, ఆర్భాటాలు చేశారన్న అభిప్రాయాలు కొందరిలో వ్యక్తమవ్వొచ్చుగాక. కానీ, సినిమా చివర్లో చూపించిన కొన్ని వాస్తవ ఫొటోలు, ‘ఔను, ఆనాటి సాహసం ఓ అద్భుతం..’ అనే అవగాహనకు వచ్చి, సినిమాని ఇంకోసారి చూసి తీరతారు.
అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఎలా నటించాడు.? అతని భార్యగా నటించిన ప్రణీత (Pranitha Subhash) ఎలా చేసింది.? సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) నటనా ప్రతిభ ఎంత.? సంజయ్ దత్ (Sanjay Dutt) నటనకు ఎన్ని మార్కులు పడతాయి.? ఇలాంటి చర్చ ఈ సినిమా విషయంలో అనవసరం. ఎందుకంటే, తెరపై ఆయా నటీనటులు కనిపించరు, వారి పాత్రలే కనిపిస్తాయి.
ఎక్కువగా ఐటమ్ సాంగ్స్‌కే పరిమితమైన నోరా ఫతేహి (Nora Fatehi), ఈ సినిమాతో నటిగా తన కెరీర్‌లో ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకునే ఓ గొప్ప పాత్ర చేసింది. ఆమె పాత్ర నిడివి తక్కువే. కానీ, అందులో ఆమె అద్భుతంగా చేసింది. అజయ్ దేవగన్ మంచి నటుడు, అయితే.. కొన్ని సన్నివేశాల్లో డ్రమెటిక్ యాంగిల్ కనిపించింది అతని పాత్రకు సంబంధించి.
సంజయ్ దత్ (Sanjay Dutt) మాత్రం, అత్యద్భుతంగా చేశాడు. అజయ్ దేవగన్ (Ajay Devgn) కంటే ఎక్కువగా సంజయ్ దత్ పాత్ర ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది సినిమా చూసిన ప్రేక్షకుల్లో.
సాంకేతిక అంశాల విషయానికొస్తే, సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఆర్ట్ వర్క్ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్ బావుంది. యాక్షన్ ఎపిసోడ్స్.. గగుర్పాటుకి గురిచేస్తాయి. కమర్షియల్ హంగుల జోలికి వెళ్ళనందుకు దర్శకుడ్ని అభినందించి తీరాల్సిందే. నిర్మాణం పరంగా ఎక్కడా రాజీ పడలేదు.
‘భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ (Bhuj The Pride Of India Review)లాంటి సినిమాలకి సక్సెస్, ఫెయిల్యూర్.. అనేవి వర్తించవు. ఇవి చాలా చాలా ప్రత్యేకమైన సినిమాలు. ఎందుకంటే, సినిమాల్లోని పాత్రలు.. మన రియల్ హీరోలకు సంబంధించినవి. వారి విజయ గాధల్ని నేటి తరం, రాబోయే తరం తెలుసుకుని తీరాలి మరి.!