బుల్లితెరపై అత్యద్భుతమైన రియాల్టీ షో ఏదంటే, ఠక్కున గుర్తుకొచ్చేది ‘బిగ్ బాస్’. హిందీలో సూపర్ హిట్. తమిళంలోనూ అంతే. తెలుగులోనూ ఈ ‘షో’ పట్ల వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘ఛ.. అదేం రియాల్టీ షో.! అంతా యాక్టింగే..’ అని అంటూనే వుంటారు.. దానికి అడిక్ట్ అయిపోతూనే (Bigg Boss Telugu Season 4 Reality Show) వుంటారు.
అలా ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు.. ఈసారి నాలుగో సీజన్‌తో సందడి చేయడానికి రెడీ అయిపోతోంది. నాలుగో సీజన్ కోసం ఫలానా ఫలానా కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేసేశారంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. అయితే, షో ప్రారంభమయ్యే రోజు వరకూ కంటెస్టెంట్ల లిస్ట్ అధికారికంగా బయటకొచ్చే అవకాశమే లేదు.
కానీ, మూడో సీజన్‌కి చాలామంది గెస్ చేసిన కంటెస్టెంట్లే ఎంపిక కావడంతో.. ఈసారి కూడా ఆ స్పెక్యులేషన్స్ నిజమవుతారన్న అభిప్రాయాలు విన్పిస్తున్నాయి. ఇదిలా వుంటే, తాను ‘బిబి’లో ఎంటర్ అవుతున్నట్లు నటుడు నందు (సింగర్ గీతా మాధురి భర్త) ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.
నటి సురేఖావాణి కూడా ఈ షోలో పాల్గొననుందన్న ప్రచారం జరుగుతుండగా, ‘ఆ విషయం నాకు తెలియదు’ అంటూ స్వయానా సురేఖా వాణి కుమార్తె చెప్పడం గమనార్హం. జబర్దస్త్ కామెడీ షో నుంచి ఓ నటుడు (అవినాష్ లేదా కార్తీక్), సింగర్ నోయెల్.. ఇలా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
ఇప్పటికే కొందరు, ‘అదంతా తూచ్’ అని కొట్టి పారేస్తే, మరికొందరు సైలెంటయిపోయారు. ప్రతి సీజన్‌లోనూ ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, ఆ షోని ఎక్కడికో తీసుకెళ్ళిపోతోంది. రెండో సీజన్‌లో కౌషల్, మూడో సీజన్‌లో పునర్నవి – రాహుల్‌ల మధ్య కెమిస్ట్రీ.. ఇలాంటివన్నమాట.
మరి, నాలుగో షో ఎలాంటి స్పెషల్ ఎట్రాక్షన్‌తో రాబోతోంది.? అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. ఈలోగా స్పెక్యులేషన్స్ ఎలాగూ ఆగవు. షో ఎన్ని రోజులు కొనసాగుతుంది.? ఎంతమంది కంటెస్టెంట్స్.? అనేది తెలియడానికి ఇంకాస్త సమయం పట్టేలా వుంది.
ప్రస్తుతానికైతే కింగ్ అక్కినేని నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారన్నది అధికారికంగా ప్రకటితమైంది.. కొన్ని ప్రమోషనల్ యాడ్స్ కూడా ఆయన మీద చిత్రీకరించారు.. అవి ఆల్రెడీ విడుదలైపోయాయి. ఇది ఆయనకు రెండోసారి బిగ్ బాస్ రియాల్టీ షోని హోస్ట్ చేయడం.