Bigg Boss Telugu Season 5 ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, అధికారిక లోగో మాత్రం ఇటీవల బయటకు వచ్చింది. త్వరలో సీజన్ ప్రారంభమవుతుందంటూ లోగోతోపాటు ప్రకటించారు. ఇంతలోనే, సోషల్ మీడియా వేదికగా ‘ఆర్మీ’లు (Bigg Boss Telugu Season 5 Contestants Fan Clubs) షురూ అయ్యాయి.
టిక్ టాక్ దుర్గారావు పేరుతో ఓ ఆర్మీ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఆర్మీ అంటే.. ఆర్మీ పేరుతో హ్యాష్ ట్యాగ్ అన్నమాట. చాలా తక్కువమందే ఈ హ్యాష్ ట్యాగ్ పేరుతో హడావిడి చేస్తున్నారు. మరోపక్క, యాంకర్ రవి పేరుతోనూ, ఆర్మీలూ.. ఇంకొన్ని చిత్ర విచిత్రమైన హ్యాష్ ట్యాగ్స్ చక్కర్లు కొట్టేస్తుండడం గమనార్హం.
టీవీ సీరియళ్ళ నటి నవ్య స్వామి, యాంకర్ వర్షిణి సౌందరరాజన్ తదితరుల పేర్లతో ఇప్పటికే వున్న ఫ్యాన్ క్లబ్స్.. బిగ్ బాస్ కోసం సమాయత్తమవుతుండడం గమనార్హం. హీరోయిన్ ఇషా చావ్లా పేరుతో కొత్తగా అభిమాన సంఘాలు వెలుస్తున్నాయి. 16 మంది లిస్ట్ ఇదేనంటూ రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో బీభత్సంగా సర్క్యులేట్ అయిపోతున్నా, ఆయా సెలబ్రిటీలెవరూ ఇంతవరకు ఈ వ్యవహారాలపై స్పందించలేదు.
అన్నట్టు, అందరికన్నా ఎక్కువగా షణ్ముఖ్ (యూ ట్యూబర్) పేరుతోనే ఎక్కువ అభిమాన సంఘాలు బిగ్ బాస్ తెలుగు 5 రియాల్టీ షో (Bigg Boss Telugu Season 5) కోసం ఏర్పడ్డాయన్నది ఇప్పటిదాకా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఒక్కటి మాత్రం నిజం.. ఎవరైతే ఇప్పటికే బెర్త్ ఖాయం చేసుకున్నారో.. వాళ్ళంతా తమ అభిమాన సంఘాల్ని ఇప్పటికే పూర్తిస్థాయిలో పటిష్టపరచేసుకుని వుండాలి. ఎందుకంటే, ఒక్కసారి హౌస్‌లోకి వెళ్ళాక.. వాళ్ళిక చేసేదేమీ వుండదు. ముందే సెటప్ చేసేసుకుంటే, ఆ తర్వాత ఆ అభిమాన గణాల్ని నడిపేందుకు.. ఆయా సెలబ్రిటీల కుటుంబ సభ్యులో సన్నిహితులో సరిపోతారు.
కౌశల్‌తో మొదలైన ఈ ఆర్మీలు.. గత సీజన్ విషయంలోనూ బీభత్సంగా వర్కువట్ అయిన విషయం విదితమే. గత సీజన్ విజేత అబిజీత్ పేరుతో ఇప్పటికీ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తూనే వున్నారు.