Bigg Boss Telugu Season 5.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎలా నడుస్తోంది.? ఇంకెలా నడుస్తుంది.. చప్పగా.. సా.. గు..తోంది. టెలికాస్ట్ వైఫల్యమో, అసలు హౌస్‌లో కంటెంట్ లేదో అర్ధం కావట్లేదు కానీ, లాంచింగ్ ఎపిసోడ్ తప్ప మిగతాదంతా ట్రాష్. అందరూ దాదాపుగా కెమెరాలని ఫేవర్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఇందులో రియాల్టీ ఏముంటుంది.?
టాస్క్‌లు చేయకపోతే బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడని తెలిసి, కామెడీలు చేస్తున్నారు. సిల్లీగా ఆలుగడ్డ కర్రీ కోసం అడ్డగోలు పంచాయితీ పెట్టుకుంటున్నారు. సీనియర్లు, జూనియర్లు అంటూ డివైడ్ చేసుకుంటున్నారు. మెచ్యూర్డ్ మెంటాల్టీ, సెన్సిటివ్ మెంటాల్టీ అని విభజన రేఖలే గీసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే, చప్పగా, చాలా చాలా చప్పగా తయారయింది బిగ్ బాస్.
ఎలిమినేషన్ కోసం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. అయినా కానీ, ఆటలో సీరియస్‌నెస్, నామినేట్ అయిన సభ్యుల్లోనే కనిపించడం లేదు. లోబో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. సిరి హన్మంత్ అవసరానికి మించి అతి చేస్తోంది. లహరి ఏదో చేస్తోంది. గందరగోళంలో పడిపోతోంది. హమీదా ఓ అయోమయం. విశ్వ అదో లోకంలో ఉంటున్నాడు. యాంకర్ రవి యాంకరింగ్ మాత్రమే చేస్తున్నాడు ఎప్పటిలాగే.
మోడల్ జెస్సీ చిన్న పిల్లాడిలా తింగరితనం ప్రదర్శిస్తున్నాడు. నటరాజ్ పెద్దరికం చూపించడానికి ట్రై చేస్తున్నాడు. ప్రియాంక స్ర్కీన్ స్పేస్ దొరక్క తెర మరుగయిపోతోంది. అతి విషయంలో టాప్ ర్యాంక్ తనదేనంటోంది కాజల్. యాని, ప్రియ, ఉమాదేవి, సరయు వీళ్లంతా ఏదేదో చేస్తున్నారు.
జనాభా ఎక్కువైపోయిందేమో.. బిగ్ హౌస్ అంతా గందరగోళమే. మూడో రోజు ముచ్చట్లలో ఆలు గడ్డ తప్ప ఇంకేమీ లేదు. ఉన్నా చెప్పుకోదగ్గ విషయాలేమీ కాదు. వీకెండ్‌లో నాగార్జునకు మాంచి స్టఫ్ దొరికినట్లే. గట్టిగా ఓ రౌండేసుకుని వార్నింగ్ ఇచ్చేస్తే, నెక్స్‌ట్ వీక్ తమలో తాము తిట్టేసుకుని, కొట్టేసుకుని ప్రేక్షకులకు ఇవ్వాల్సిన ఎంటర్టైన్మంట్ ఇచ్చేస్తారేమో కంటెస్టెంట్లు. అప్పటిదాకా ఈ నస ఇంతే.