Bikini Girl Politics.. రాజకీయాల్నీ, సినిమాల్నీ విడదీసి చూడలేం. ఎందుకంటే, సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వెళ్లి రాణించినోళ్లను ఎంతో మందిని చూశాం. చూస్తూనే ఉన్నాం. నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు.. ఇలా సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది రాజకీయాల్లో రాణించారు. రాణిస్తూనే ఉన్నారు.
విజయ శాంతి (Vijayasanthi), నగ్మా (Nagma), జయప్రద, జయా బచ్చన్ (Jayabachan), రోజా (Roja), నవనీత్ కౌర్, ఊర్మిళ (Urmila Matondkar), కుష్బూ (Khushboo).. ఇలా లిస్టు తీస్తే చాలా చాలా చాలా పెద్ద లిస్టే ఉంటుంది. ఇది నటీ మణుల లిస్టు మాత్రమే. హీరోల లిస్టు వేరే.
Bikini Girl.. రాజకీయం చేస్తే నేరమా.?
సినీ నటి జయ లలిత (Thalaivi Jayalalitha) తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలందించారు. తిరుగులేని రాజకీయ శక్తిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. జయప్రద (Jayaprada) సంగతి సరే సరి. జుగుప్సాకరమైన మార్ఫింగ్ ఫొటోలతో రాజకీయంగా జయప్రదను వేదించిన వైనం ఎలా మర్చిపోగలం.?

ఎన్నికలు అనగానే రాజకీయ పార్టీలు, సినీ గ్లామర్ కోసం పరితపిస్తాయ్. అవే రాజకీయ పార్టీలు సినిమా పరిశ్రమ మీద నిస్సిగ్గుగా బురద చల్లుతాయ్. సినీ జనాల్ని థర్డ్ గ్రేడ్ సిటిజన్స్‌లా భావించడం కొన్ని రాజకీయ పార్టీలకీ, కొందరు రాజకీయ నాయకులకీ అలవాటయిపోయింది.
అసహ్యం.. అభ్యంతరకరం.. ఇదే రాజకీయం.!
నటి అర్చనా గౌతమ్ (Actress Archana Gautam) ఓ రాజకీయ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగడం, ఇంకో రాజకీయ పార్టీకి నచ్చలేదు. బికినీ గాళ్ రాజకీయాల్లోకి వచ్చిందంటూ.. ఆమెపై రాజకీయ ప్రత్యర్ధులు విరుచుకు పడుతున్నారు. లేడీ అమితాబ్.. లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి (Vijay Santhi) కూడా సినిమాల కోసం బికినీ ధరించడాన్నిసో – కాల్డ్ రాజకీయ నాయకులు, పార్టీలు మర్చిపోయినట్లున్నాయ్.
Also Read: అహంకారమే దిగజారుడుతనమై.! నెట్టింట్లో ఎందుకీ పైత్యం.?
వ్యాంప్ తరహా పాత్రల్లో కనిపించిన నవనీత్ కౌర్ (Navneet Kaur), పార్లమెంటుకి ఎన్నికై, మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. సినిమా జనాలంటే, వాళ్లు కూడా సమాజంలో భాగమే. సినిమా అనేది వాళ్ల ప్యాషన్. నటన అనేది ఓ వృత్తి. సినిమాల్లో బికినీలు వేశారు కాబట్టి, రాజకీయాల్లోకి రాకూడదంటే, అది మూర్ఖత్వమే.
హత్యలు చేసిన వాళ్లూ, అత్యాచారాలకు తెగబడినోళ్లు తమ ఘన కార్యాలను రాజకీయాల్లో రాణించడానికి అర్హతలుగా భావిస్తున్న రోజులివి. వాళ్లకి, సినీ జనాల్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది.!