Table of Contents
Biopic Movies Indian Actresses బయోపిక్ చేయడం అంటే అంత ఆషామాషీ కాదు. అందుకే కొందరు నటీనటులు బయోపిక్స్ చేయడానికి భయపడతుంటారు. బయోపిక్స్ అనగానే, ముందుగా వివాదాలు తలెత్తుతుంటాయి. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా ఏదో ఒక రకంగా గొడవలు బయోపిక్స్ చుట్టూ చక్కర్లు కొడుతుంటాయ్.
అందుకే నటీనటుల్ని బయోపిక్స్ కోసం ఒప్పించడమే పెద్ద తలనొప్పి దర్శక, నిర్మాతలకు. కొన్ని సందర్భాల్లో వివాదాల కోసమే బయోపిక్స్‌ని ఆశ్రయిస్తుంటారనే విమర్శ వుండనే వుంది. కానీ, ఆ తరహా ఆలోచనలు కొంప ముంచేసిన సందర్భాలూ లేకపోలేదు.
Biopic Movies Indian Actresses నటీ నటుల కెరీర్‌కి బయోపిక్స్ లాభమా.? నష్టమా.?
బయోపిక్స్‌లో నటించడం అనేది ఓ ఛాలెంజింగ్ టాస్క్. బోల్డంత కష్టపడీనా చివరికి అవి సక్సెస్ అవుతాయని చెప్పలేం. అయితే, భయపడకుండా బయోపిక్‌లో నటించి సంచలన విజయాల్ని అందుకున్ననటీమణులూ ఇండస్ర్టీలో కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో కొందరు కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి, విక్టరీస్ అందుకున్నారు.
ఇంకొందరు ఇక కెరీర్‌లో బయోపిక్స్ జోలికి పోకూడదని డిసైడ్ అయినవాళ్లూ ఉన్నారు. బయోపిక్ అంటే ఆషా మాషీ వ్యవహారం కాదు. పాత్రల గురించి లోతుగా రీసెర్చ్ చేయాలి. ఆయా పాత్రల్లో ఒదిగిపోవాలి. అలా ఒదిగిపోయిన వాళ్లెంతమంది.? ఆ స్థాయిని అందుకోలేక దిగిపోయిన వాళ్లెంతమంది.?
కీర్తిసురేష్ అలా కంగనా రనౌత్ ఇలా..
‘మహానటి’ అనగానే ఒకప్పుడు సావిత్రి పేరు గుర్తొచ్చేది. కానీ, ఇప్పుడు కీర్తి సురేష్ గుర్తొస్తోంది. అంతలా మహానటి సావిత్రి బయోపిక్‌లో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. ఆ పాత్ర కోసం కీర్తి తన బాడీ లాంగ్వేజ్ మార్చుకుంది. అచ్చు సావిత్రిలానే హావభావాలు పలికించింది. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసి తిరుగులేని విజయం అందుకుంది. అలాంటి సినిమా మళ్లీ కీర్తి సురేష్ కెరీర్‌లో రానే రాదు.

కంగనా రనౌత్ విషయానికి వస్తే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటీమణి జయలలిత బయోపిక్‌లో నటించింది. ఈ పాత్ర కోసం కంగనా శాస్ర్తీయ నృత్యం నేర్చుకుంది. జయ పాత్రలో ఒదిగిపోయేందుకు బరువు పెరిగింది.
తాప్సీ, ప్రియాంకా చోప్రా ఎంతలా కష్టపడ్డారంటే..
అందాల భామ తాప్సీ ‘శభాష్ మిత్తూ’ అంటూ భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో నటించింది. ఈ పాత్ర కోసం తనను తాను చాలా మార్చేసుకుంది తాప్సీ. ఫిట్‌గా మారిపోయింది. అంతకు ముందే ఆయా పాత్రల కోసం తనను తాను మార్చుకున్న తాప్సీ ఈ పాత్రలో అచ్చు మిథాలీ రాజ్‌ని తలపించేందుకు చాలా కష్టపడింది.
లేడీ బాక్సింగ్ సెన్సేషన్ మేరీకోమ్ బయోపిక్ కోసం ప్రియాంకా చోప్రా పడిన కష్టం అంతా ఇంతా కాదు. మేరీకోమ్‌లా కనిపించేందుకు చాలా వర్కువుట్లు చేసింది. కండలు తిరిగిన దేహంతో తను ప్రియాంకానా.? లేక మేరీ కోమ్‌నా.? అనేంతలా తనను తాను మార్చేసుకుంది.
Biopic Movies Indian Actresses.. అనుష్క శెట్టి, దీపికా పదుకొనె.. వీళ్ళ రూటే సెపరేటు
అనుష్క ప్రధాన పాత్రలో ‘రుద్రమదేవి’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇది బయోపిక్ అనలేం కానీ, తన అభినయంతో ఆ పాత్రకు తిరుగులేని వన్నె తీసుకొచ్చింది అనుష్క. అనుష్కను తప్ప ఆ పాత్రలో మరొకరిని ఊహించలేం అనేంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది అనుష్క.
Also Read: Pooja Hegde, Kajal Aggarwal..కైపెక్కిస్తున్న చక్కని ‘చుక్క’లు.!
అలాగే ‘పద్మావత్’ సినిమా కోసం రాణి పద్మిని పాత్రలో ఒదిగిపోయింది బాలీవుడ్ నటి దీపికా పదుకొనె. అనేక సవాళ్లను ఎదుర్కొని రాణి పద్మినిగా దీపికా సక్సెస్ అయింది. అంతేకాదు, యాసిడ్ బాధితురాలు లక్ష్మీఅగర్వాల్ బయోపిక్ కోసం డీ గ్లామర్ రోల్‌లో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది దీపికా పదుకొనె.
ఇంకా వున్నాయ్ చాలానే..
ఐటెం బాంబ్ సన్నీలియోన్ విషయానికొస్తే, తన బయోపిక్‌లో తానే నటించింది. అయితే, ఇది సినిమా కాదు, వెబ్ సిరీస్.

బాలీవుడ్ నటి విద్యా బాలన్ సిల్క్ స్మిత బయోపిక్ (డర్టీ పిక్చర్), హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి బయోపిక్‌తోపాటు, ఎన్టీఆర్ బయోపిక్ (బసవతారకం పాత్ర) చేసింది. ఆయా పాత్రల్లో ఒదిగిపోయేందుకు విద్యా బాలన్ పడ్డ కష్టానికి మంచి ప్రశంసలే దక్కాయి.. ఆయా సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా.
చెప్పుకుంటూ పోతే.. వెండితెరపై బయోపిక్స్ సందడి ఈనాటిది కాదు. అయితే, ఈ మధ్య ట్రెండ్ కాస్త జోరందుకుందంతే. గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత గాధల్ని వెండితెరపై చూపించడం ద్వారా కొత్త తరానికి ఆ గొప్ప వ్యక్తుల జీవితాలు దిశానిర్దేశమవుతాయి. అందుకే, తారలు.. మరీ ముఖ్యంగా నటీమణులు.. ఆయా బయోపిక్స్‌లో (Biopic Movies Indian Actresses) నటించడం ద్వారా తమ నట జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్నారు.