పగిలిపోయే వార్త.. అదేండీ బ్రేకింగ్ న్యూస్.! మీరు ఆశ్చర్యపోయే వార్త.. అదేనండీ షాకింగ్ న్యూస్.! ఈ గంటకు ఇది అవసరం.. అదేనండీ, నీడ్ ఆఫ్ ది అవర్.! అసలేంటి కథ.. అంటారా.? పెద్ద కథే వుంది. మీడియా రంగంలో వినూత్నమైన పోకడలు పుట్టుకొచ్చాయి. వాడికంటే నేనే ముందు.. అనే తొందర కారణంగా, కొత్త కొత్త పదాలు (Breaking News Shocking News Need Of The Hour) పుట్టుకొస్తున్నాయి.
అక్కడ ఏదన్నా పగిలిందా.? లేదా.? అన్నది అనవసరం.. పగిలిపోయే వార్త.. అదేనండీ, బ్రేకింగ్ న్యూస్ పేరుతో బద్దలుగొట్టేయాల్సిందే. మీరు షాక్ అయినా, అవ్వకపోయినా.. షాకింగ్ న్యూస్ అంటే, షాక్ కొట్టించేస్తారంతే. ఆ సమయానికి అది అవసరం వున్నా లేకపోయినా, అదే నీడ్ ఆఫ్ ది అవర్ అయిపోతుంది.
ఇంతకీ, ఈ పగిలిపోయే వార్తలు.. షాకింగ్ వార్తలతో జనానికి ఒరిగేదేమన్నా వుందా.? అంటే, ఏమీ లేదు. పైగా, ఇలా న్యూస్ ఛానళ్ళు అర్థం పర్థం లేని వార్తల్ని బద్దలుగొట్టేస్తోంటే, చూస్తోన్న జనాల్లో కొందరు సన్నిత మనస్కుల గుండెలు నిజంగానే బద్ధలైపోతున్నాయి.
ఎవడన్నా రాజకీయ ప్రముఖుడు ఎక్కడికన్నా వెళితే పగలిపోయే వార్త.. ఎవడన్నా చనిపోతే వార్త. ఇదేదీ లేకపోతే, ప్రపపంచంలో ఏదో మూల ఏదో చిన్న సంఘటన జరిగితే.. అదీ పగిలిపోయే వార్తే. అసలు మీడియా ఏం వార్తలు జనంలోకి తీసుకెళ్ళాలి.? అన్నదానిపై ఎలాంటి ఆంక్షలూ లేవు. కానీ, పగిలిపోయే వార్తలు ప్రసారం (Breaking News Shocking News Need Of The Hour) చేసేటప్పుడు కాస్తంత సామాజిక బాధ్యత వుండాలి కదా.?