Table of Contents
Bus Accident Kurnool.. కర్నూలు జిల్లాలో జాతీయ రహదారిపై ఓ బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదమంటేనే, ఘోరం.! ఇంకా ఘోర ప్రమాదమేంటి.?
చాలా ప్రమాదాల్లో నిర్లక్ష్యమే ప్రధాన కారణమవుతుంటుంది. మానవ తప్పిదాలే ఘోర ప్రమాదాలకు కారణమవుతున్నా, తప్పిదాల్ని సరిదిద్దుకునే ప్రయత్నమే జరగదు.
రోడ్డు మీద ప్రమాదాలు సర్వసాధారణం.. వందల్లో, వేలల్లో వాహనాలు ప్రయాణిస్తుంటే, అప్పుడప్పుడూ ప్రమాదాలు జరగకుండా వుంటాయా.? అనేది వితండవాదం.!
రోడ్డు డిజైనింగులో లోపం, వాహనాలకు సరైన ఫిట్నెస్ లేకపోవడం, వాహనం నడిపేవారికి తగిన అనుభవం లేకపోవడం.. ఇలా చాలా కారణాలున్నాయి రోడ్డు ప్రమాదాలకి.
తప్ప తాగి వాహనాలు నడపడం.. అనేది ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది.
ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి, చలాన్లు వేసి, చేతులు దులుపుకుంటారు.
Bus Accident Kurnool.. ఈ పాపం అందరిదీ..
వసూళ్ళ విషయంలో ప్రభుత్వాలు, ట్రాఫిక్ విభాగానికి టార్గెట్లు పెడుతుంటాయి తప్ప, ట్రాఫిక్ విభాగం విధులేంటి.? అన్న కనీసపాటి ఆలోచన ప్రభుత్వ పెద్దలకు వుండటంలేదు.
ప్రైవేటు ట్రావెల్స్ ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతుంటాయి. డ్రైవర్లకు క్షణం తీరిక లేకుండా, వాహనాలు నడపాల్సిన దుస్థితే ఇందుకు కారణం.
ఒత్తిడిని తట్టుకునేందుకు, మద్యం.. మాదక ద్రవ్యాల వాడకం.. ఇదీ చాలామంది డ్రైవర్లు చేస్తున్నది. తమ వెంట మద్యం, మాదక ద్రవ్యాలు తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు డ్రైవర్లకి.
మార్గమద్యంలో ప్రైవేటు బస్సులు నడిపేవారికి మద్యం, మాదక ద్రవ్యాలు అందించేందుకు ధాబాల్లో ప్రత్యేక ఏర్పాట్లు వుంటున్నాయి.
అలాంటి చోట్లే, ప్రయాణీకులకు భోజనం కోసం ఆపుతుంటారు డ్రైవర్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలా సందర్భాల్లో ప్రయాణీకులు, డ్రైవర్ల మద్యపానంపై నిలదీస్తుంటారు కూడా.
రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రైవేటు ట్రావెల్స్ తమ బస్సుల్ని ఆపరేట్ చేస్తుంటాయి. రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్ వుంటుంది.. కానీ, అవి కూడా వసూళ్ళ దందా కోసమే.. అన్నట్లు తయారైంది పరిస్థితి.
వాహనాల వేగ నియంత్రణ విషయమై ఖచ్చితమైన నిబంధనలున్నాయి. కానీ, చలాన్లు పడుతున్నాయా.? అతి వేగంతో వెళ్ళే బస్సుల్ని సీజ్ చేస్తున్నారా.? ప్చ్.. లేదాయె.!
తిలా పాపం తలా పిడికెడు..
పరిమితికి మించిన వేగంతో రహదార్లపై ప్రైవేటు బస్సులు దూసుకెళుతుంటాయి. ఈ క్రమంలో ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.
గత కొంతకాలంగా, ప్రైవేటు ట్రావెల్స్.. స్లీపర్ బస్సుల్ని వినియోగంలోకి తీసుకొచ్చాయి. ఆ బస్సుల్లో కూడా, పరిమితికి మించి ఎక్కువగా సీట్లు వుంటున్నాయి.
ఎక్కువ సీట్ల కోసం, బస్సులో ‘స్పేస్’ విషయంలో రాజీ పడుతున్నాయి బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లు. టూ ప్లస్ వన్ స్లీపర్ బస్సుల్లో, నడక మార్గం.. చాలా చాలా ఇరుకుగా మారిపోయింది.
కాస్త బొద్దుగా వున్న వ్యక్తి, సులువుగా బస్సులో ఆ చివర నుంచి, ఈ చివర వరకు నడవలేని పరిస్థితి. లోయర్ బెర్తుల్లో పడుకున్న వ్యక్తి, లేచి బయటకు రావాలంటే.. చాలా కష్టపడాలి.
బస్సులో ఇద్దరు డ్రైవర్లుండాలి.. అది రూల్.! ఇద్దరుంటారు.. కానీ, బస్సు ప్రయాణిస్తున్న దూరమెంత.? తిరుగు ప్రయాణంలోనూ ఆ ఇద్దరే బస్సుల్ని నడపాలి. వారికి, తగిన విశ్రాంతి మాత్రం దొరకదు.
నిద్దరొస్తున్నా, బస్సుని అత్యంత వేగంగా నడపాల్సిందే.. సకాలానికి గమ్యం చేరుకోకపోతే, మరుసటి రోజు ట్రిప్ రద్దయిపోతుంది. ఉద్యోగమూ పోతుంది. కాబట్టి, ప్రమాదమైనా.. ముందుకు దూకాల్సిందే.
తెలిసీ.. తప్పు చేస్తున్నారు.. ప్రాణాలు తీస్తున్నారు..
చెప్పుకుంటూ పోతే, ప్రైవేటు బస్సుల్లో అక్రమాలు లెక్కలేనన్ని వున్నాయి. ఇవన్నీ రవాణా శాఖలకి తెలియని విషయాలు కావు. రవాణా శాఖలో అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
పైగా, ప్రైవేటు ట్రావెల్స్ నిర్వహిస్తున్నవారిలో ఎక్కువమంది రాజకీయ నాయకులే వుంటారు. అందునా, కీలక పదవుల్లో వున్నవారే ప్రైవేటు ట్రావెల్స్ సంఘాల్లో చక్రం తిప్పుతుంటారు.
చాలా ఏళ్ళ క్రితం ఇదే కర్నూలు సమీపంలో ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ప్రయాణీకులంతా కాలి బూడిదైపోయారు. రోడ్డు డిజైనింగ్‌లో లోపమని తేల్చారు అప్పట్లో.
Also Read: బాబోయ్ అమ్రికా.! ఫర్లేదు.. మరీ అంత భయం లేదు లేవోయ్.!
మరి, ఇప్పుడేం తేల్చుతారు.? అప్పటి నుంచి ఇప్పటివరకు.. ఎన్నో ప్రమాదాలు జరిగాయి.. ఇకపైనా జరుగుతాయ్. నిర్లక్ష్యం.. అంతటా నిర్లక్ష్యం.. బతుకులు బుగ్గయిపోవడానికి కారణం.!
తిలా పాపం తలా పిడికెడు.! ప్రయాణీకులు సైతం, ప్రభుత్వ రవాణా సంస్థల సేవల్ని వినియోగించుకోవడానికి ఇష్టపడటంలేదు. ప్రమాదమని తెలిసీ, ‘లగ్జరియస్ జర్నీ’ పేరుతో, ప్రైవేటు ట్రావెల్స్‌ని ఆవ్రయిస్తున్నారు.
