Table of Contents
తమిళ దర్శకుడు శంకర్ రూపొందించిన ‘2.0’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వెండితెర అద్భుతం 10 వేలకు పైగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా సృష్టించబోయే రికార్డుల గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఓ అంచనా ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ‘2.0’ సినిమా 120 కోట్ల పైన రాబట్టిందని సమాచారమ్. సినిమా విడుదలకు రెండ్రోజుల ముందు తెరపైకొచ్చిన అంశమిది. అంటే, ఫస్ట్ డే రికార్డుల పరంగా ‘2.0’ సరికొత్త చరిత్ర సృష్టించబోతోందన్నమాట.
‘2.0’ సినిమా తొలుత ‘బాహుబలి’ రికార్డుల్ని తిరగరాయాల్సి వుంటుంది. అయితే, అది అంత తేలికైన విషయం కాదు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ఏ భారతీయ సినిమా, ఇంతవరకు ‘బాహుబలి’ రికార్డుల్ని టచ్ చేయలేకపోయింది.
రజనీకాంత్ స్టామినా ఇది..
అయితే, రజనీకాంత్ ఇమేజ్ వేరు.. శంకర్ స్టామినా వేరు.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఇద్దరికీ ఫాలోయింగ్ వుంది. రజనీకాంత్ – శంకర్ కాంబోలో సినిమా వచ్చిందంటే అది తమిళ సినిమాగా మాత్రమే కాదు, భారతీయ సినిమాగా రికార్డులకెక్కుతుంది. మామూలుగా అమెరికాలో భారతీయ సినిమాలకు ఎక్కువ డిమాండ్ వుంటుంది. అమెరికా వసూళ్ళపై ఈ మధ్య భారతీయ సినిమాలు ఏ స్థాయిలో ఆధారపడుతున్నాయో అందరికీ తెలుసు.
విదేశాల్లో ‘2.0’ మోత మోగిపోతోంది..
అమెరికా మాత్రమే కాదు, దీనికి అదనంగా రజనీకాంత్ సినిమాలకు సింగపూర్, మలేసియా, జపాన్ తదితర దేశాల్లోనూ విపరీతమైన ఫాలోయింగ్ కన్పిస్తుంటుంది. యూఏఈ తదితర అరబ్ దేశాల్లోనూ ‘2.0’ గ్రాండ్ రిలీజ్‌కి రంగం సిద్ధమయిపోయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర ప్రాంతాల్లోనూ రికార్డు స్థాయిలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.
అమెరికా, ఇండియా వసూళ్ళను లెక్కేస్తే.. ‘బాహుబలి’ 1500 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టింది. ఇండియన్ సినిమా స్క్రీన్‌పై ఇంతకు మించిన విక్టరీ ఇంకోటి లేదు. అయితే, ఆ రికార్డ్‌ని బ్రేక్ చేయగలదంటూ ‘2.0’ సినిమాపై సూపర్ స్టార్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఆ దిశగా సినిమాకి హైప్ కూడా క్రియేట్ అయ్యింది. ఫస్ట్ డే వసూళ్ళలో ‘బాహుబలి’ని ‘2.0’ దాటేస్తుందని, ట్రేడ్ పండితులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ స్థాయిలో ‘2.0’ భారీగా రిలీజ్ అవుతోంది మరి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనమే..
తెలుగు రాష్ట్రాల్లోనూ ‘2.0’ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. రికార్డు సంఖ్యలో ఈ సినిమా కోసం థియేటర్లను కేటాయించారు. ‘2.0’ దెబ్బకి, కొన్ని తెలుగు సినిమాల రిలీజ్‌లు వాయిదా పడటం గమనించాల్సిన విషయం.
‘2.0’ సినిమాని పిల్లల సినిమాగా వెటకారం చేసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, ఆ తర్వాత మనసు మార్చుకుని.. ‘భైరవగీత’ సినిమా రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. ఇదీ ‘2.0’ మేనియా అంటే. బెంగళూరులోనూ రికార్డు స్థాయిలో థియేటర్లు ఈ సినిమా కోసం కేటాయించారు. చెన్నయ్‌లో సంగతి సరే సరి. అక్కడ జన సునామీని చూడబోతున్నాం ‘2.0’ విడుదల రోజున.
600 కోట్ల బడ్జెట్.. 1500 కోట్ల టార్గెట్..
ఇది సాధ్యమేనా.? అన్న ప్రశ్న రజనీకాంత్ విషయంలో ఉత్పన్నం కాదు. ఎందుకంటే, రజనీకాంత్ సినిమా హిట్టయితే వచ్చే ఆ వసూళ్ళ ఊపు ఓ రేంజ్‌లో వుంటుంది మరి. నాలుగు రోజుల వీకెండ్‌తోనే మేగ్జిమమ్ వసూళ్ళను ‘2.0’ కొల్లగొట్టేయవచ్చునని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
సినిమా కోసం 600 కోట్లు ఖర్చు చేసినట్లు స్వయంగా రజనీకాంత్ వెల్లడించిన సంగతి తెల్సిందే. వెయ్యి కోట్లు, ఆ పైన.. అంటే 1500 కోట్ల వసూళ్ళ లక్ష్యంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.