Cock Fight Andhra Pradesh.. ఎంత గొప్పగా పెంచితే మాత్రం కోడి ఖరీదు పదివేలు, పాతిక వేలు ఉంటుందా..? అవును మరి, అది సంక్రాంతి కోడి పుంజు కదా. దాని రాజసమే వేరు.
రోజుల తరబడి, నెలల తరబడి పందెం కోళ్ళను బలంగా తయారు చేసేందుకు నానా తంటాలూ పడతారు. వాటికి స్విమ్మింగ్ నేర్పిస్తారు. పరుగు పందాలు పెడతారు. అంతేనా.. దానితోనే కోడి మాంసాన్ని తినిపిస్తారు. మేక మాంసం పెడతారు. జీడిపప్పు, బాదం.. ఇవన్నీ అదనం.
సంక్రాంతి కోడి పుంజుల కోసం ప్రత్యేకంగా విటమిన్ టాబ్లెట్లు కూడా ఉంటాయ్. కొందరైతే బ్రాంది, విస్కీ వంటి వాటిని కూడా వాటి చేత తాగిస్తారు. ఏం చేసినా పందెంలో ప్రత్యర్ధిని పడగొట్టేంత శక్తి దానికి వచ్చేలా చేసేందుకే.
Cock Fight Andhra Pradesh సంక్రాంతి అంటే అదే.!
తెలుగు రాష్ర్టాల్లో సంక్రాతి అనగానే కోడి పందాలు గుర్తుకొస్తాయ్ చాలా మందికి. ఉభయ గోదావరి జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతుంటాయ్. లక్షల్లో కాదు, కోట్లల్లో సొమ్ములు చేతులు మారుతున్నాయ్ ప్రతీ ఏడాది. వందల కోట్లు విరజిమ్ముతున్నారు.

చట్ట పరమైన ఆంక్షలు ఎన్ని వున్నా, ఎవ్వడూ లెక్క చేయడం లేదు. అధికారంలో ఉన్నోళ్లే అడ్డగోలుగా ఈ కోడి పందాల నిర్వహణకు బరి తెగిస్తున్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఇదే తంతు. సంప్రదాయ ఆటగా మొదలైన ఈ కోడిపందాలు ఇప్పుడు ఓ ఉద్యమంలా నడుస్తోంది.
పందేల పైత్యం.. అంతటా పాకేసిన వైనం..
తెలుగు నేలపై నలుమూలలకీ ఈ కోడి పందాల పైత్యం పాకేసింది. ఆన్ లైన్ బెట్టింగుల స్థాయికి ఎదిగేసింది. కొన్నాళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేసి మరీ కోడి పందాలు నిర్వహించారు. ఆ తర్వాత ఆ స్థాయి బహిరంగ సందడి తగ్గినా, ఏ ఏడాదికి ఆ ఏడాదే చేతులు మారుతున్న సొమ్ముల పరంగా సరికొత్త రికార్డులు నమోదవుతూనే ఉన్నాయ్.
Also Read: దేవిశ్రీ ప్రసాదం.! ఐటమ్ సాంగ్ అనబడు భక్తి గీతం.!
ఇంతకీ, గెలిచిన కోడి ఏమవుతుంది.? ఓడిపోయిన కోడి ఏమవుతుంది.? ఏదయినా మూకిడిలోకి ఎక్కాల్సిందే. అది కరకరలాడే పకోడీలా మారుతుందా.? నోరూరించే కోడి కూరవుతుందా.? అన్నదే తేడా. చాలా తక్కువ సందర్భాల్లో గెలిచిన కోడిని మరింత అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటారు. అది బతికినన్నాళ్లూ.