Table of Contents
కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి అవకూడదా.! అవుతాడు, అయి తీరతాడు.!
– పవన్‌కళ్యాణ్, జనసేన కవాతు సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి.
సినిమా హీరోలకి అభిమానులుంటారు. అది మామూలు విషయమే. కానీ, ఆయన అభిమానులు ప్రత్యేకం. ఎందుకంటే, ఆయనే చాలా ప్రత్యేకం. ఆయన పిలుపునిస్తే, లక్షలాదిమంది తరలి రావడం కాదు.. ఆయన ఆలోచనలకు తగ్గట్టు నడుచుకోవడం ఆ అభిమానుల ప్రత్యేకత. తొలిసారిగా ఓ హీరో అభిమానులంతా కలిసి ‘ఇజం’ చూపించారు. దానికి ‘పవనిజం’ అని పేరు పెట్టుకున్నారు. ఈ ‘పవనిజం’ సినిమా నటుడి మీదున్న అభిమానం మాత్రమే కాదు.. అంతకు మించి ఏదో ప్రత్యేకత వుందని చెబుతుంటారు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానులు.
సినిమాలో పవన్‌కళ్యాణ్ చెప్పే డైలాగులకే కాదు, నిజ జీవితంలో పవన్‌కళ్యాణ్ మాట్లాడే మాటలకీ ఆయన అభిమానులు ఫిదా అయిపోతుంటారు. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ని పవన్‌కళ్యాణ్ ఏర్పాటు చేస్తే.. క్షణాల్లో ‘మేము సైతం’ అంటూ విరాళాలు ప్రకటించి, ‘పవనిజం’ సత్తా చాటారు. అన్న చాటు తమ్ముడే అయినా, ఆ అన్నయ్యను సైతం ఎదిరించడానికి వెనుకాడలేదు అతని అభిమానులు. ఇదీ ‘పవనిజం’ అంటే.
జనసంద్రం అనేది చిన్న మాట
పవన్‌కళ్యాణ్ పిలుపునిస్తే, అభిమానులు ఆగుతారా.? ఛాన్సే లేదు. అభిమానం పోటెత్తేసింది. గోదారితో పోటీ పడి ఉరకలేసింది అభిమానం. లక్షలాదిమంది అభిమానులు తరలి వచ్చారు జనసేన కవాతు కోసం. కవాతు అంటే ఆషామాషీ కాదు. ఓ బ్రిడ్జి మీద కవాతు చేయాల్సి వస్తే, అదీ లక్షలాదిమంది తరలి వచ్చినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంది పార్టీ యంత్రాంగం. అయినా, ఇక్కడ పార్టీ యంత్రాంగమంటే జనసైన్యమే కదా.
‘మీరు క్షేమంగా వచ్చి వెళ్ళాలి. మీలో ఏ ఒక్కరికి ఎలాంటి ఆపద వచ్చినా నేను తట్టుకోలేను’ అన్న పవన్‌కళ్యాణ్ మాటల్ని వంటబట్టించుకున్నారు. సాటి జనసైనికుడికి ప్రమాదం రాకూడదనీ, తాము ప్రమాదంలో పడకూడదనీ, అత్యంత జాగ్రత్తగా కవాతులో పాల్గొన్నారు. బ్రిడ్జి మీద జనం, బ్రిడ్జి కింద గోదావరిలో నడుచుకుంటూ జనం. ఎటు చూసినా జనమే. జలం, జనం తప్ప ఇంకేమీ కన్పించలేదంటే అతిశయోక్తి కాదేమో.
పవన్ పేల్చిన పొలిటికల్ తూటాలు
అధికార పార్టీని కడిగి పారేశారు. ప్రతిపక్షాన్నీ వదిలిపెట్టలేదు. జనసేన అంటే బాధ్యతాయుతమైన రాజకీయాల కోసం పుట్టిన పార్టీ అని పిలుపునిచ్చారు. తిట్టడం చేతకాక కాదు, తిట్టడం ద్వారా స్థాయిని దిగజార్చుకోవడం ఇష్టం లేదంటూ పవన్‌కళ్యాణ్ తనదైన స్టయిల్లో ఎవరికి తగలాలో వాళ్ళకే గట్టిగా తగిలేలా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఓ మహిళతో నా తల్లిని తిట్టిస్తారా.? అని పవన్ సంధించిన ప్రశ్నకి, అధికార పార్టీ సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేదు.
అధికారం చేపట్టడానికి అనుభవం అవసరమని భావించానని మరోసారి పవన్ స్పష్టం చేశారు. కానిస్టేబుల్ పదవి కోసం కూడా అనుభవం కావాలనీ, అలాంటిది ముఖ్యమంత్రి పదవి కోసం అనుభవం ఎందుకు అవసరంలేదని ప్రశ్నించిన పవన్, ఆ అనుభవం కోసమే ఇన్నేళ్ళు ఎదురు చూశానని అన్నారు. ముఖ్యమంత్రి కొడుకు మాత్రమే ముఖ్యమంత్రి పదవి కోసం ఆలోచించాలా? కానిస్టేబుల్ కొడుకు ఎందుకు ముఖ్యమంత్రి అవకూడదు, అవుతాడంటూ ప్రత్యర్థి పార్టీలకు దిమ్మ తిరిగే కౌంటర్ వేశారు పవన్‌కళ్యాణ్.
ఇబ్బందులు బలాదూర్.. జనసైన్యం ఫుల్ హుషార్
బ్రిడ్జి పటిష్టంగా లేదనీ, ఇరిగేషన్ శాఖ అభ్యంతరం చెబుతోందంటూ ప్రభుత్వం తరఫున కుంటి సాకులు చూపుతూ, ‘కవాతు’ని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. చివరి నిమిషంలో అనుమతులు ఇచ్చేది లేదనీ తేల్చేశారు అధికారులు. కానీ, జనసేన కవాతు ఆగలేదు. పవన్‌కళ్యాణ్‌ని మాత్రం వారధి మీద నడవడానికి వీల్లేకుండా చేయగలిగారు. అయితేనేం, ఆయన ‘రధం’ ఎక్కారు.
వాహనంలో అధినాయకుడు తరలి వస్తోంటే, జనసైన్యం ఆయనకు సెల్యూట్ చేస్తూ ఆయన వెంట పోటెత్తింది. ప్రత్యర్థులకు వెన్నులో వణుకు మొదలైంది. డబ్బులిస్తే వచ్చిన జనం కాదు, అభిమానంతో వచ్చిన జనం. నడవలేని పరిస్థితుల్లో వున్నవారూ, వృద్ధులూ, మహిళలూ జనసేనాని వెంట కవాతులో పాల్గొనడం ఓ చారిత్రక ఘట్టంగా అభివర్ణిస్తే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు.
సినిమాలు చేస్తే కోట్లు సంపాదించగలడుగానీ..
పవన్‌కళ్యాణ్ ఏదన్నా సినిమాకి ‘సైన్’ చేస్తే, ఆ సినిమాపై 100 కోట్ల రూపాయల అంచనాలుంటాయి. అదీ పవన్‌కళ్యాణ్ సత్తా. జయాజపయాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాపై అంచనాలు అలా పెరిగిపోతుంటాయ్. కానీ, జనసేనానిగా ప్రజల్లోకి పవన్‌కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు.? జనం కోసం.
‘నేను సినిమాలు చేస్తే కోట్లు సంపాదించగలను. కానీ, కోట్లాదిమంది ప్రజల కోసం సినిమాలు వదిలేసి సైనికుడిలా వచ్చాను. ప్రజల కోసం పోరాడతాను..’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు, ఆయనపై విమర్శలు చేస్తున్నవారికి చాలా గట్టిగానే తగిలేశాయి. నిజమే, పవన్ ఏడాదికి రెండు సినిమాలు చేస్తే చాలు.. తక్కువలో తక్కువ 50 నుంచి 100 కోట్లు సంపాదించేయగలడేమో.!